ఆహా.. పోహా.. ఇండోర్‌లో అవుట్డోర్ ఈటింగ్!
ప్రాచీన చరిత్రకు ఆధునికతను జోడించిన నగరం ఇండోర్. నాటి ఠీవిని నేటికీ ప్రదర్శించే అద్భుతమైన రాజ ప్రాసాదాలు.. చేయి తిరిగిన పాకయాజులు వండి వడ్డించే రుచుల ప్రసాదాలు.. కలగలిసి ఇండోర్ పర్యటన కళగా సాగిపోతుంది. నోరూరించే పోహా.. రుచి చూడమంటూ జిలేబీలు పర్యాటకులను ఓ పట్టాన కదలనివ్వవు. సంప్రదాయాలు, సంస్కృతి, వాణిజ్యం, ఆతిథ్యం.. అన్నీ కలగలిసిన ఇండోర్‌లో అవుట్డోర్ ఈటింగ్ భలేగా ఉంటుంది.
ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన నగరం ఇండోర్. ఎక్కడెక్కడి రుచులెన్నో ఇక్కడ తిష్ట వేసుకొని చవులూరిస్తాయి. ఈ నగరంలో విహారం.. కన్నులకే కాదు జిహ్వకూ పండుగే. మన దేశంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే చిరుతిండి పోహా! అదేనండి మన అటుకులు!! చిటికెలో కలిపేసుకొని అల్పాహారం అయ్యిందనిపిస్తాం! పోహా ఆహా అనిపించాలంటే మాత్రం ఇండోర్ దాకా వెళ్లాల్సిందే! ఇక్కడి ఓల్డ్ పలాసియా గల్లీలో హెడ్ సాహెబ్ పోహావాలే బండి ముందు ఆగాల్సిందే! ఆ బండి ముందు దాకా వెళ్లే చాన్స్ ఉండదు. ఎందుకంటే.. సూర్యుడి రాకతోనే.. అక్కడ వందల మంది పోగవుతారు. పోహావాలే పంకజ్ సాబ్ చకచకా కలుపుతున్న అటుకుల వైపు ఆశగా చూస్తుంటారు జనాలు. తమ వంతు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు.
మామూలు పోహాకు ఇంత సీన్ ఉందా అంటే.. విషయమంతా పోహాకు జతగా ఇచ్చే ఉసల్ గ్రేవీదే అని చెబుతారంతా! పల్చటి మసాలా గ్రేవీలో రోస్ట్ చేసిన పనీర్ తేలుతూ… ఆవురావురుమనిపిస్తుంటుంది. పైనుంచి సేవ్, ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర రంగరించి ఇచ్చిన పోహా ఇలా అందుకోగానే.. ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. ఆబగా తినేవారు కొందరైతే, ఆగి ఆగి తినేవారు ఇంకొందరు! ఎలా తిన్నా.. రుచి అదిరిపోతుంది. అందాకా ఎదురుచూపులతో వెర్రెత్తిన ఆత్మారాముడి గొడవంతా ఈ చుడువాతో ఎగిరిపోతుంది. ఆ రుచి చూశాక.. బహుశా కుచేలుడు ఈ అటుకులే కృష్ణపరమాత్మకు ముడుపు కట్టుకొని వెళ్లాడనిపిస్తుంది.

Poha Dal Bafla
ఇది బాలభోగం. ఆ తర్వాత ఉన్నదే అసలు యోగం. సర్ఫా బజార్ దాకా సఫారీ సాగిస్తే.. అక్కడ రాజహంస బాఫ్లావాలా అనే హోటల్ కనిపిస్తుంది. మాల్వా ప్రాంతపు ప్రత్యేక పాకం దాల్ బాఫ్లా. గోధుమ పిండి, బొంబాయి రవ్వ కలగలిపి ముద్దగా చేసి, ఆవిరికి ఉడకనిచ్చి, నేతిలో పైపైన వేయించి ఆపై నిప్పుల కుంపటి పెనం మీద ఇరువైపులా దోరగా కాలనిచ్చి ఇచ్చే పదార్థమే బాఫ్లా! ఇది సాదాసీదాగా తింటే.. వహ్వా అనలేం. దీన్ని కాంబినేషన్‌తో తినాలి. అలా ఉడికి, వేగి, కాలిన బాఫ్లాని మెత్తగా ఒత్తుకొని, అందులోకి గంటజారుడు టమాటా మసాలా పప్పు, రెండు చెంచాల నెయ్యి, పంజాబీ స్టయిల్లో చేసిన మసాలా ఆలూ వేపుడు ముక్కలు వేసి.. కలియ కలిపి రుచి చూస్తారు. ముద్దముద్దకూ అల్లం, ధనియా పచ్చడి, చల్లపులుసు నంజుకుంటూ దాల్ బాఫ్లాను ఓ పట్టుపడితే ఉంటుందీ.. మాటల్లో చెప్పలేనంత అనుభూతి ఖాయం.
అన్ని ప్రొటీన్లు పొట్టలోకి చేరాక.. భుక్తాయాసంతో భారంగా పది అడుగులు వేశామో, లేదో కాంచ్ మందిర్ సమీపంలో ప్రసిద్ధ్ కచోరీ నుంచి ప్రశస్తమైన సువాసనలు పలకరిస్తాయి. పొట్టలో పిట్ట మనసంత ఖాళీ లేకున్నా.. ఇక్కడి కచోరీ తినాల్సిందే! ఎనభై ఏండ్లుగా రుచికరమైన కచోరీ సర్వ్ చేస్తూ అందరి మనసులూ చోరీ చేస్తున్నారు వీళ్లు. అటుపై సర్ఫా బజార్లోనే రాజ్వాడా రాజ ప్రాసాదం వెనుక దహీ వడ మరో అద్భుతం. ఆ దుకాణం యజమాని దహీ వడ ప్లేట్‌ని అలా ఎగిరేసి ఇచ్చే వైనం ఆశ్చర్యపరుస్తుంది. చక్కటి వడ, దానిపై చిక్కటి పెరుగు.. ఆపై జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి ఇవ్వడమూ, ఆత్రంగా తినడమూ… వెంటనే మరోటి అంటూ ఆర్డర్ ఇవ్వడమూ జరిగిపోతుంది. ఇదే సర్ఫా బజార్లో నీమా కుల్ఫీ, ప్రకాశ్ కుల్ఫీ సెంటర్లు తప్పక సందర్శించాల్సిందే! మీకు కుల్ఫీలంటే నచ్చకపోయినా.. సుమారు 15 కిలోల బంగారు నగలు ధరించిన ఆ కొట్ల యజమానులు కోరిన కుల్ఫీ సర్వ్ చేస్తుంటే.. ఆ క్షణంలో మనం ఇంకా రిచ్ ఫెలోస్ అన్న ఫీలింగ్ కలగకమానదు.

Wada, Kachori, Prakash Kulfi
ప్రశాంత్ పోహావాలే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది అల్లాటప్పా కొట్టు కాదు. ఇక్కడి అటుకులు స్వర సామ్రాజ్ఞి లతాజీ ఆరగించారు. ఆమీర్ ఖాన్ తిన్నాడు. సోను నిగమ్ ఆస్వాదించాడు. ఎంత బాగుండకపోతే అంతమంది సెలెబ్రిటీలు వీటిని రుచి చూస్తారు. మనమూ చూస్తే మన్‌పసంద్ అవుతుంది. సాయంత్రం న్యూ పలాసియా ఏరియాలో ఛపన్ దుకాణ్ సెంటర్‌కు వెళ్తే.. చిరుతిళ్ల బండ్లు బారులుగా కనిపిస్తాయి. మిర్చి నుంచి హాట్ డాగ్ బన్ వరకు రకరకాల వెరైటీలు జఠరాగ్నికి సవాలు విసురుతాయి. తిండిపుష్టి కలవారు వరుసపెట్టి తినడమే! అంతగా పొట్టలో గడబిడ అయితే భాస్కర లవణమో, త్రిఫలా చూర్ణమో గోరువెచ్చని నీటిలో రెండు చెంచాలు కలుపుకొని తాగితే తెల్లారేసరికి.. ఇండోర్ రుచులపై మరోసారి దండయాత్రకు పూనుకోవచ్చు.
– కణ్వస

Prashanth Poha

Rajwada Palace
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

