మంచిమాట వింటే నోటిని తీపి చేసుకుంటాం. శుభకార్యం తలపెడితే తీపి రుచులతో మొదలుపెడతాం. తియ్యటి రుచి తగలగానే చెరకు గడే గుర్తు చేసుకుంటాం. జీవితంలో ఎప్పుడూ సంతోషాలే ఉండవు కదా. అప్పుడప్పుడు కష్టాలున్నట్టే తీపి పంటను సాగు చేసే చెరకు రైతుకూ చేదు అనుభవాలు ఉంటాయి. ఆ కష్టాలు తప్పించేందుకు సంగారెడ్డి జిల్లా బసంత్‌పూర్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు చక్కెర దుంపను సాగులోకి తెస్తున్నారు. సులువైన సాగుకు చక్కెర దుంప ఎంపికే మేలని శాస్త్రవేత్తలు ఎందుకు చెబుతున్నారో తెలుసుకుందామా!
రెండు వందల సంవత్సరాల క్రితం… ఐరోపా దేశాలు చక్కెర కోసం బ్రిటన్‌పై ఆధారపడేవి. చాలా దేశాలకు నిత్యావసరమైన చక్కెర దిగుమతి ఆర్థికంగా భారంగా పరిణమించింది. చక్కెర ఉత్పత్తిలో బ్రిటన్ అధిపత్యానికి అడ్డుకట్టవేయాలని ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ భావించాడు. తన కలలు పండవని చక్రవర్తికి వెంటనే తెలిసొచ్చింది. చక్కెర ఉత్పత్తికి ఆధారమైన చెరకు పంట సాగుకు ఫ్రాన్స్ అనుకూలమైన ప్రాంతం కాదు. అయినా సరే చక్కెర ఉత్పత్తి చేసి తీరాలనుకున్నాడు.
ప్రత్యామ్నాయాలు వెతకమని శాస్త్రవేత్తలు, రైతులు, ప్రజలను ఆదేశించాడు. చెరకులో ఉన్నట్టే ఓ దుంపలోనూ సుక్రోజ్ అధిక శాతం ఉండటాన్ని ఫ్రాన్స్ పరిశోధకులు గుర్తించారు. ఆ దుంప గుజ్జుని పాకం పట్టి చక్కెర తయారు చేయవచ్చని నిరూపించారు. ఫ్రాన్స్ భౌగోళిక వాతావరణానికి అనువైన ఈ దుంపను షుగర్ బీట్ పేరుతో పిలిచారు. అప్పటి నుంచి దీనిని విస్తృతంగా సాగు చేస్తున్నారు.

చక్కెర దుంప (షుగర్ బీట్) ఆకులు చూడ్డానికి పాలకూరలా ఉంటాయి. దీని దుంప ఆకృతి ముల్లంగిని తలపిస్తుంది. నాలుగు నెలల్లోనే పంట చేతికొస్తుంది. ఎలాంటి నేలలో అయినా సులభంగా పండుతుంది. ఖర్చు తక్కువ. రాబడి ఎక్కువ. కాబట్టి పంజాబ్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాలు షుగర్ బీట్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణ రైతులు కూడా చక్కెర దుంప సాగుచేసేలా హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాయం శాస్త్రవేత్తలు పరిశోధనలను ప్రోత్సహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఇది చక్కెర దుంప సాగుకి అనువైన వాతావరణం. కాబట్టి న్యాల్కల్ మండలం, బసంత్‌పూర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విశ్వవిద్యాలయ సూచనలతో ప్రయోగాత్మంగా చక్కెర దుంపను సాగు చేస్తున్నారు.

ప్రపంచ దేశాలు చక్కెర కోసం చెరకు పంటకు బదులుగా చక్కెర దుంప సాగువైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ పంటలో ఏదీ వృథాగా పోదు. అన్నిటికీ మార్కెట్ ఉంది. చెరకు నుంచి మొలాసిస్ తయారు చేసినట్టే ఈ దుంపల నుంచి మొలాసిస్ ఉత్పత్తి చేయవచ్చు. దాని నుంచి ఇథనాల్ తయారు చేయవచ్చు. ఫార్మా, కాస్మెటిక్స్ రంగాల్లో చక్కెర దుంప నుంచి తయారు చేసిన చక్కెర వినియోగం పెరిగింది. దీని ఆకుల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకులు మేలురకం పశుగ్రాసం.
కాబట్టి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ పంట వ్యర్థాలను బిల్డింగ్ మెటీరియల్‌గా వాడుకోవచ్చు. రోడ్ల నిర్మాణంలో కూడా ఉపయోగిస్తున్నారు. దుంప పిప్పిని ప్రాసెస్ చేసి వంట చెరకుగా వాడుకోవచ్చు. చక్కెర దుంప సాగులో పద్ధతులు, నూతన వంగడాలను రూపొందించే పరిశోధలు చేపడుతున్నారు. చెరకు సాగులో రైతులు అనేక కష్టనష్టాలను అనుభవిస్తున్నారు. ఈ పంట సాగు రైతులకు అన్నీ విధాలుగా లాభాలను చేకూరే విధంగా స్థానిక పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.

సమశీతోష్ణ వాతావరణంలో పండే చక్కెర దుంపను ఉష్ణ మండల ప్రాంతాల్లో సాగుకు సరిపోయే వంగడాల గుర్తింపు, అభివృద్ధి కోసం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎకరానికి సుమారు ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల విత్తనం అవసరమవుతుంది. తక్కువ నీటితో దీని సాగు పూర్తవుతుంది. షుగర్ బీట్ భూమి లోపల దుంప రూపంలో పండుతుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే హెక్టారుకు 35 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ పరిశోధనా కేంద్రంలో 8 రకాల వంగడాల సాగుపై పరిశోధనలు చేస్తున్నాం. రైతులు పండించుకునేందుకు ఈ వంగడాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. తెలంగాణ రైతుకు ఇది లాభసాటి పంట.
– డా॥ విజయ్‌కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త.
– విఠల్, జహీరాబాద్