డాక్టర్ చదివి యాక్టర్‌గా రాణిస్తున్న నటి అదితీ శంకర్. ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురిగా పరిశ్రమలో అడుగుపెట్టిన అదితి నటిగా, గాయనిగా, నిర్మాతగా రాణిస్తున్నది. కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నది. ‘భైరవం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. శంకర్ కూతురిగానే కాకుండా వైవిధ్యమైన ప్రతిభ కనబరుస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అదితి పంచుకున్న కబుర్లు..
చెన్నైలో పుట్టి పెరిగాను. నాన్న పరిశ్రమలో ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే సినిమాలపై ఇష్టం ఉండేది.
శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడిసిన్ చదివాను. గ్రాడ్యుయేషన్ తర్వాత అమ్మానాన్నలతో నటనను కెరీర్‌గా ఎంచుకుంటానని చెప్పాను. వాళ్ల అనుమతితోనే ‘విరుమాన్’ సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టాను.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను. ఫొటోలు, నా ప్రాజెక్ట్ అప్డేట్స్ షేర్ చేస్తుంటాను. అభిమానులతో
కనెక్టవడం ఆనందంగా ఉంటుంది. తెలుగులో నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. ఒకసారి ఆయన్ని కలిసి
ఆటోగ్రాఫ్ కూడా అడిగాను. ఆయన సింప్లిసిటీ నాకు చాలా నచ్చింది.
అమ్మకు సంగీతం అంటే ఇష్టం. ఆమె పాటలు పాడుతుంటే నేనూ నేర్చుకునేదాన్ని. గాయనిగా తమన్ మొదటి అవకాశం ఇచ్చారు. నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే, సహజమైన పాత్రలు ఇష్టం. ‘విరుమాన్’,
‘మావీరన్’లో అలాంటి పాత్రలే చేశాను. భవిష్యత్తులో కొత్త జోనర్లు ట్రై చేయాలనుంది.
నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ ముఖ్యంగా ఇడ్లీ, దోసె, సాంబార్ అంటే ఇష్టం. ఇటాలియన్ పాస్తా కూడా ఫేవరెట్! సంగీతం వినడం, పాటలు పాడటం, ట్రావెలింగ్ ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడటం, విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవడం ఆసక్తి. చీరలు, మోడ్రన్ డ్రెస్‌లు రెండూ ఇష్టపడతాను.
బ్లాక్ నా ఫేవరెట్ కలర్.
మొదటి సినిమాలో కార్తీతో కలిసి నటించడం భలేగా అనిపించింది. దర్శకుడు ఎం.ముత్తయ్య దర్శకత్వంలో వచ్చిన ‘విరుమాన్’ సినిమాలో నా పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డ్ అందుకున్నా. ‘భైరవం’ నా తొలి తెలుగు సినిమా.
తెలుగు ప్రేక్షకుల ప్రేమ అబ్బురపరిచింది.
నాన్న చేసిన సినిమాల్లో ‘జెంటిల్‌మేన్’, ‘భారతీయుడు’ నాకు చాలా ఇష్టం. సమాజంలోని సమస్యలను ఆయన చూపించే తీరు చాలా నచ్చుతుంది. ‘బాహుబలి’ సినిమా కథ, కథనం బాగా నచ్చింది. నాకు నేనుగా సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నా, అందుకే నాన్న సినిమాల్లో నటించలేదు.
భవిష్యత్తులో నాన్న సినిమాల్లో చేస్తాను. కానీ సరైన కథ, పాత్ర ఉండాలి. ఆయన సినిమాలు భారీగా ఉంటాయి కాబట్టి, నాకు సరిపడే పాత్ర కోసం వెయిట్ చేస్తున్నా. నా తల్లిదండ్రులు నా రోల్‌మోడల్స్. నాన్న వర్క్ ఎథిక్, అమ్మ సపోర్టివ్ నేచర్ నన్ను ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తాయి.