ఒకానొక సామూహిక రోదన నుంచి రంగస్థలం ఆవిర్భవించినట్టు గ్రీకు శాస్త్రం తెలిపింది. దీనినే కెథోరిసిస్ (ప్రక్షాళన) అని అభివర్ణించారు. అంతరంగంలో పేరుకుపోయిన దుఃఖాన్ని తెరలు తెరలుగా బహిర్గతంగా రోదిస్తూ వ్యక్తం చేయడం వలన లోపల ఉన్న ఆ మాలిన్యాలన్నీ కొట్టుకుపోతాయి. ఆ తర్వాత హృదయం నూతనోత్తేజంతో ఆవిష్కృతమవుతుంది. ఈ ప్రక్రియే ప్రక్షాళనగా రూపాంతరం చెందినట్టు శాస్త్ర భావన. జీవితం ఎప్పుడూ నవనవోన్మేషంగా ప్రకాశించడానికి రంగస్థలం ఆ విధంగా దోహదపడుతుందనేది అందులోని అంతరార్థం!
మన దేశంలో తెగలు, కులాలు, ఉప కులాలు, ఆశ్రిత కులాలు ఉన్నాయి. దాదాపు ఆరు వేలకు పైగా కులాలు ఉన్నట్టు అంచనా. ఈ నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థతో వర్ణాశ్రమ ధర్మం నేటికీ వర్ధిల్లడం మనం కాదనలేం. ‘రుడాలి’ ప్రజలు రాజస్థాన్లో ఓ తెగవారు. రుడాలి అంటే ‘స్త్రీ రోదన’ అని అర్థం. ఆ తెగ కడు బీదరికంలో జీవిస్తూ ఉంటుంది. వారికి సొంత భూములు, ఆస్తులు ఉండవు. దొరలకు ఊడిగం చేయడం లేదా కాయకష్టం చేసుకుని బతుకుతారు. అన్నింటికీ మించి అద్దెకు రోదించడం ఆ కుల స్త్రీల వృత్తి ధర్మం. సంపన్నుల కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాల ముందు పడి ఈ ఆడవాళ్లు శోకాలు పెడతారు. ఆ విధంగా ఏడ్వడం కలవారికి చిన్నతనం. అది వారి ‘నాగరికత’.
ఈ తెగ ప్రజలు ఊరికి దూరంగా, బహిష్కృతులుగా జీవిస్తుంటారు. వారిది ఎడారి జీవితం. కరువు నిరంతరం. కాయకష్టం చేసే పనులు కూడా సరిగా దొరకవు. సుదూర ప్రాంతాల నుంచి నీటిని కడవలతో తెచ్చుకోవడం, అప్పుడప్పుడు కూలికి వచ్చిన తిండి గింజలు దంచుకుని, వంటావార్పులతోనే స్త్రీల జీవితం తెల్లారిపోతుంది. మగవాళ్లు ఎక్కువ మంది దొరల దగ్గర రుణభారంతో వెట్టిచాకిరీ చేస్తుంటారు. ఆ అప్పులు తీరేవి కాదు. రుణ చట్రంలో తరాలవారీగా ఇరుక్కుపోయే ఉంటారు.
దొరలు రుడాలి తెగ స్త్రీలపై కన్నేస్తూనే ఉంటారు. అదో మోహం. ఈ ఘటనతోనే నాటకం మొదలవుతుంది. కడవ మోసుకుంటూ వస్తున్న యువతిపై కన్నేస్తాడు ఓ దొర. దప్పిక తీర్చుకోవడానికి ఆమెను నీరు అడుగుతాడు. ఆ యువతి తాగేందుకు నీరు పోస్తుంది. ఎవరి భావాలు వారివి. ఆ యువతికి అప్పటికే పెళ్లవుతుంది. కొడుకు పుడతాడు. అందరిలాగానే సంసారం దుర్భరంగా సాగుతూ ఉంటుంది. ఆమె భర్త తాగుడుకి బానిస. చాలామంది మగవాళ్లకు ఆ వ్యవసనం ఉంది. ఆమె కష్టం ఇంటికే కాక భర్త తాగుడికీ పోతుంది. ఇల్లు నడపడం ఆమెకు శక్తికి మించిన కష్టంగా ఉంటుంది. ఓ కవి ఆనందం కూడా నిత్య సత్యం కదా అన్న సహజత్వం ఆమెది. వెన్నెల రాత్రులను ప్రేమిస్తుంది. సంతల్లో, తిరునాళ్లలో నలుగురితో కలిసి చిన్న చిన్న సరదాలు తీర్చుకుంటుంది. పాటలు పాడుతుంది. నృత్యాలు చేస్తుంది. జీవితాన్ని రసభరితం చేసుకునేందుకు తనకు తెలియకుండానే తాపత్రయపడుతుంది.
కల్తీ మద్యం తాగి కొందరు మరణిస్తారు. వారిలో తన భర్త ఒకడు. అంత్యక్రియలు జరుగుతాయి. కొన్నాళ్లకు కొడుకు యువకుడు అవుతాడు. పెళ్లి చేసుకుంటాడు. కోడలు వస్తుంది. అత్తా కోడళ్ల మధ్యన వచ్చే సాధారణ గొడవలు. కోడలు అలిగి వెళ్లిపోతుంది. కొడుకు కూడా తల్లిని తిట్టి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఆ తల్లి ఒంటరిదవుతుంది. జీవితం మరింత భారమవుతుంది. ఒకనాడు పొరుగూరు నుంచి ఆమె స్నేహితురాలు వస్తుంది. రుడాలి పనికి (అద్దెకు రోదించడం) మనిషి కావాలని చెబుతుంది. ఇతర పనులతోపాటు ఈ తల్లికి రుడాలి పని నేర్పుతుంది. దుఃఖపడటం వేరు. దుఃఖాన్ని బలవంతంగా తెచ్చుకోవడం వేరు. ఆ మెలకువని స్నేహితురాలు నేర్పుతుంది. తర్వాత తానూ ఈ పనిలో రాణించగలనని భావిస్తుంది.
పేరు : రుడాలి (హిందీ నాటకం)
రచన: మహాశ్వేతాదేవి
దర్శకత్వం: అరవింద్ సింగ్ చంద్రవంశి
సమర్పణ: షణ్ముఖ రంగమండల్
ఇంటి నుంచి వెళ్లిన కొడుకు ఒక హవేలీలో పనిలో కుదురుకుంటాడు. ఒకానొక రాత్రి ఆ హవేలీ నుంచి కబురు వస్తుంది. అక్కడో మృతదేహం ఉంది. నీవు అద్దెకు రోదించాలనేది కబురు. చీకట్లో ఒంటరిగా బయలుదేరుతుంది. లోపలికి వెళ్లి చూస్తే ఆ మృతదేహం ఎవరిదో కాదు. తన కన్న కొడుకుది. ఇప్పుడెలా…? సొంత ఏడుపు ఏడ్వాలా..? ఏడుస్తున్నట్టు నటించాలా? సందిగ్ధత? నటన రాదు. ఏడుపూ రావడం లేదు. బిత్తర పోతుంది. నాటకం ముగుస్తుంది.
దాదాపు ఇరవై మంది నటీనటులు భిన్న పాత్రలను సందర్భోచితంగా నటిస్తూ రసరమ్య వర్ణ కావ్యంగా మలిచారు. అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ సందర్భంగా ఆగస్టు 11న హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శితమైంది.