ఆంగ్లేయులకు వేసవి రాజధాని సిమ్లా. కొత్తజంటలకు హనీమూన్ విడిదిగా పేరున్న ఈ హిమవన్నగ నగరి.. సాహస యాత్రికులు ఇష్టపడే విహార కేంద్రం. కొత్త రుచులు ఆస్వాదించాలని భావించే జిహ్వ చపలురు సిమ్లాపై నిర్మొహమాటంగా హమ్లా చేసేయొచ్చు. మంచు కుచ్చుటోపీలు పెట్టుకున్న గిరి శిఖరాల వంక చూస్తూ.. వేడివేడి పదార్థాలు రుచి చూడొచ్చు. వెరైటీ పాకాలకు కేరాఫ్‌గా నిలిచే సిమ్లా రసోయీల్లో సోయి లేకుండా విహరిద్దాం పదండి..
గిరుల రాణిగా పేరున్న సిమ్లా.. రుచుల్లో మాత్రం రారాజే! ఇక్కడి మాల్ రోడ్డులో చిరుతిళ్లు పలకరిస్తే.. లోయర్ బజార్లో అడుగడుగునా రెస్టారెంట్లు అడ్డుపడతాయి. లక్కడ్ బజార్లో కిక్కిచ్చే పాకాలు తమను రుచి చూడమంటూ జఠరాగ్నిని ప్రేరేపిస్తాయి. ఇలా సిమ్లాలో ఎక్కడికి వెళ్లినా ఘనమైన ఘుమఘుమలు సాదరంగా ఆహ్వానం పలుకుతాయి.
హిమాచల్ ప్రత్యేకం, సిమ్లాలో మరింత రుచికరంగా వండే పదార్థం కుర్కేజ్. మాల్రోడ్డులోని కృష్ణ బేకరీలో ఇవి దొంతరులుగా పేర్చి ఉంటాయి. రకరకాల కూరగాయలను ఆలుగడ్డతో ఉడికించి. మెత్తగా మెదిపి, మసాలా దినుసులు రంగరించి, రోల్స్‌లా చుట్టి, సలసల మసిలే నూనెలో దోరగా వేయించి చేసే వంటకం ఇది. రెడ్ చట్నీలో నంజుకుని తింటే అదుర్స్ అంటాం. గ్రీన్ చట్నీ అద్దుకొని తింటే అద్భుతః అనేస్తాం. కుర్కేజ్ రుచిని నెమరువేస్తూ.. అలా మరో వీధిలోకి మలిగితే ఇంకో స్మెల్ స్మైల్ ఇస్తుంది. ఆ వెరైటీ పేరు సిడ్డూ. ఇదో గమ్మత్తయిన వంటకం. హిమాచల్ చలికి తట్టుకునే గుణాన్ని ప్రసాదించే పోషకాల పాకం. నానబెట్టిన మినప్పప్పును మెత్తగా, ముద్దగా రుబ్బుకొని, అందులో రకరకాల మసాలా దినుసులు వేసి రెడీగా పెట్టుకుంటారు. గోధుమపిండిని మందపాటి పూరీలా ఒత్తుకొని అందులో పైన కలుపుకొన్న మిశ్రమాన్ని కూరుస్తారు. ఆపై ఆవిరికి ఉడికిస్తారు. మెత్తగా ఉడికిన సిడ్డూని.. గట్టి చట్నీలో నంజుకొని తింటే.. ‘ఆహా ఏమి రుచి!’
అన్న పాటందుకుంటాం. రెండు వెరైటీలకే తృప్తిపడిపోతే.. ఆత్మారాముడికి అన్యాయం చేసినట్టే! సిడ్డూ అందించిన సత్వర శక్తితో.. మరో నాలుగు వీధులు చకచకా నడిచేస్తాం. ఈ దారుల్లో అక్తోరీ తగులుతుంది. ఇది చూడ్డానికి అచ్చంగా మన పుల్లట్టులానే కనిపిస్తుంది! హిమాచలీ శైలిలో చేస్తారన్నమాట. రోటి పచ్చడితో కలిపి ఆస్వాదిస్తే భలేగా ఉంటుంది. అన్నీ హాట్ కబుర్లే కానీ, స్వీటు ముచ్చటే లేదేంటని కంగారొద్దు. రుచికి రుచి, బలానికి బలం అందించే హిమాచలీ తీపి పదార్థం బబ్రూ రుచి… సిమ్లా యాత్రికులకు ఓ తియ్యటి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. గోధుమపిండి, బెల్లం, యాలకులు, సోంపు వేసి ఇంపుగా చేస్తారు. వెగటు తెప్పించే తీపి ఉండదు. తిన్నాక.. ‘బాదుషాకు బాబులా ఉంది’ అని తీర్మానిస్తాం. తీపి తర్వాత మరో హాటు రుచి చూస్తే… నీటుగా ఉంటుంది కదా! అలాంటి ఫేవరెట్టే.. తుడ్కియా బాత్. బిర్యానీకి వేలు విడిచిన చుట్టంలా ఉంటుంది దీని రుచి.
హిమాచల్ కొండల్లో లభ్యమయ్యే నాణ్యమైన మసాలా దినుసులతో ఈ పలావ్ టైప్ వంటకాన్ని వండి వారుస్తారు అక్కడి పాకయాజులు. ముద్దముద్దకూ లొట్టలేయాల్సిందే! దీనికి కాంబినేషన్‌గా సిమ్లా వెరైటీ కూరలు వేడివేడిగా సిద్ధంగా ఉంటాయి. అందులో ప్రత్యేకం సేపు బడీ కుర్మా! పొట్టు మినప్పప్పును నానబెట్టి, ముద్దగా చేసి, అందులో రకరకాల మసాలాలు దట్టించి, ముద్దగా చేసి, మందంగా ఒత్తి.. ఆవిరికి ఉడికిస్తారు. తర్వాత దాన్ని పనీర్ ముక్కల్లా కట్ చేసి.. వాటిని నేతిలో వేయించి.. కుర్మాలో వేసి ఉడికిస్తారు. మన దగ్గర శనగపిండితో బిళ్లల పులుసు, బజ్జీలతో చల్లపులుసు చేసినట్టు అన్నమాట. తుడ్కియా బాత్లోకి సేపు బడీ అద్దుకొని తింటే అద్దిరిపోద్దంతే!!
ఇలా చెబుతూ పోతే.. సిమ్లా ఆహార విహారం ఎప్పటికి పూర్తయ్యేను? ఈ పర్యాటక కేంద్రంలో కనీసం మూడు రాత్రులైనా నిద్రచేయాలని కొత్తజంటలే కాదు, ముదిమి దంపతులూ కోరుకుంటారు. అయితే ఆ మూడు పగళ్లు.. గదికే పరిమితం కాకండి. రుచుల వేట కొనసాగించండి. ఒక్క పదార్థం టేస్ట్ చేయగానే.. ‘తేరే ఘర్ కే సామ్నే’ సినిమాలో దేవానంద్ ‘మానేనా మేరా దిల్ దివానా..’ అంటూ ఇదే సిమ్లాలో వీధులన్నీ తిరిగినట్టు మనమూ అక్కడి గల్లీలన్నీ చక్కర్లు కొట్టేస్తాం.