గాలి, నీరు, వెలుతురు… వీటికి ఖర్చేం అవ్వదు. అవసరాలకు వాడేస్తాం. అవసరానికి మించి వృథా చేస్తాం. కలుషితం చేసేస్తాం. కానీ, అవి దొరకని రోజున అల్లాడిపోతాం. రకరకాల సమస్యలు, అనారోగ్యాలు, ఆకలి… ఆఖరికి బతుకే ముగిసిపోతుంది. శరీరానికి అవి ఎలాగో… మన ఉనికికి స్వాతంత్య్రమూ అంతే! ఉన్నరోజున దాని విలువ తెలియదు. లేని జీవితం నరకమే! అలాంటి ఒక్క రోజును ఊహించుకుని చూడండి. ఉదయం లేచి బయటకి అడుగుపెట్టేసరికి ఓ అధికారి మనల్ని అజమాయిషీ చేసేందుకు సిద్ధంగా ఉంటే? మనం ఎక్కడికి వెళ్లాలో, ఏం తినాలో, ఏ పని చేయాలో, ఏ దుస్తులు ధరించాలో ఎవరో నిర్ణయిస్తుంటే? ఓ పాలకుడు కనిపించగానే బానిసలా తనకు సలాం కొట్టి, ఊడిగం చేయాలంటే? ఇంతా చేసి, అంతా సహించి చివరికి కూడబెట్టిన రూపాయినీ వాడు లాక్కుపోతుంటే… మన ఆస్తిపాస్తులు మొదలుకొని పెళ్లాం బిడ్డల వరకూ ఏదైనా లాక్కునే ధైర్యం చేస్తుంటే! తనకు నచ్చని మాటంటే తన్నులు, దేశానికి జైకొడితే జైలు, ఎదురుతిరిగితే కాల్పులు… ఊహించడానికే కష్టంగా ఉంటుంది. స్వాతంత్య్రం లేని జీవితమే వృథా. అందుకే లక్షల మంది మాన, ప్రాణాలను సైతం లెక్కచేయక దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. వాళ్లకు తెలుసు! తాము నష్టపోతామని, తమ ప్రాణాలు పోతాయని. అయినా.. ముందుతరాలకు అందించగలిగే స్వాతంత్య్రాన్ని అమూల్యమైన నిధిగా గుర్తించారు.
– కె.సహస్ర
శతాబ్దం నాటికి సముద్రయానం ఊపందుకుంది. వేర్వేరు దేశాలకు వెళ్లి, అక్కడి వస్తువులను తీసుకురావడం లాభాసాటిగా మారిపోయింది. కానీ నౌకాయానం అంటే మాటలు కాదు. రవాణా కోసం భారీ ఓడను నిర్మించాలి. సముద్రయానంలో ఓడని రక్షించే యోధులు కావాలి. వాళ్లకు ఆయుధాలు కావాలి. నెలల తరబడి సాగే ఈ ప్రయాణాల్లో ఖర్చుతో పాటుగా అనిశ్చితి కూడా ఎక్కువే. ఆ సముద్రయానం విజయవంతమైతే వచ్చే లాభాలతో జీవితాలే మారిపోయేవి! అందుకే వీటికి పెట్టుబడి పెట్టేందుకు ధనికులు ఆసక్తి చూపించేవారు. కంపెనీలకు కంపెనీలే స్థాపించేవారు. అలా 1600 సంవత్సరంలో మొదలైనదే ఈస్ట్ ఇండియా కంపెనీ. హిందూ మహాసముద్రంలో కొత్తగా తెలుసుకున్న దేశాలకు వెళ్లి వర్తకం చేయడమే దీని ఉద్దేశం. అలా ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున బయల్దేరిన ఓడలు 1608లో మన దేశాన్ని చేరుకున్నాయి. అప్పటి నుంచి మొదలైంది అసలు కథ, శతాబ్దాల వ్యథ!
ఇక్కడి రాజులను మచ్చిక చేసుకుని… స్థానికంగా వ్యాపారాలు చేసుకునేందుకు, స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు, ఫ్యాక్టరీలు నిర్మించుకునేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒప్పందాలు చేసుకునేది. పనిలో పనిగా వ్యాపారంలోనూ, ఆధిపత్యంలోనూ తమకు పోటీగా ఉన్న డచ్, పోర్చుగీస్, స్పానిష్, ఫ్రెంచ్ వ్యాపారులతో యుద్ధాలు చేసేది. ఒక్కో ఏడాది బలపడుతూ, లాభాల బాట పడుతూ… తమకంటూ సొంతంగా కోటలు నిర్మించుకుని, సైనికులను నియమించుకునే స్థితికి చేరుకున్నారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యాపారం మొదలుపెట్టారో… చివరికి వాళ్ల మీదే పోరు మొదలుపెట్టారు. ఓడిపోయిన సందర్భాల్లో కాళ్లావేళ్లా పట్టుకుని తిరిగి కాటేయడానికి సిద్ధపడ్డారు. మొగల్ సామ్రాజ్య పతనం తర్వాత ఏర్పడిన అస్థిరత వారికి అద్భుత అవకాశంగా మారింది. ఎదుగుదలకు తిరుగులేకపోయింది. ఒకానొక సందర్భంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా, నాటి బ్రిటిష్ సైన్యం కంటే ఎక్కువమంది సైనికులు ఉన్న శక్తిగా ఎదిగింది. వ్యాపారం కోసం ఎవరి ముందైతే చేయి చాచిందో… వారినే వినియోగదారులుగా మార్చుకుంది. లాభాలు అందించినవారి మీదే పన్నులు వేసింది. కానీ ఎక్కడైతే పీడన ఉంటుందో… అక్కడ పోరు కూడా ఉంటుంది. అదే జరిగింది.
చాలామందికి స్వాతంత్య్రం అంటే 1857 సిపాయిల తిరుగుబాటే గుర్తుకొస్తుంది. వారసులు లేని రాజ్యాలను కబ్జా చేసుకోవడం, సిపాయిల మధ్య వివక్ష, సైనికుల మతభావనలు దెబ్బతీయడం లాంటి రకరకాల కారణాలతో అది రాజుకుంది. ఢిల్లీ మీద మళ్లీ మొగల్ రాజును నిలబెట్టి, ఈస్ట్ ఇండియా కంపెనీని వణికించింది. ఈ తిరుగుబాటును పూర్తిగా అణచేయడానికి ఏడాది పట్టిందంటే అదెంత బలంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రాజుల మధ్య అనైక్యత, దక్షిణాదికి విస్తరించకపోవడం లాంటి కారణాలతో అది విఫలమైంది. ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీని జాతీయం చేసిన బ్రిటిష్ సామ్రాజ్యం… తానే భారతదేశ పగ్గాలు తీసుకుంది. అసలైన బ్రిటిష్ రాజ్యం మొదలైంది అప్పుడే. కానీ 257 ఏళ్ల పాటు మనం ఎదిరించకుండా ఉన్నామా? లేదు!
దేశంలోనే తొలి విప్లవం చేసింది సైనికులో, స్థానిక పాలకులో కాదు… సన్యాసులు అని తెలియడం ఆశ్చర్యమే! అప్పట్లో దేశం అంతా పర్యటించే సన్యాసులకు స్థానిక పాలకులు, మోతుబరులు, జమీందార్లు పదోపరకో ఆర్థిక సాయం చేసేవారు. ఇది బ్రిటిష్ పాలకులకు కంటగింపు అయ్యింది. ప్రతి రూపాయినీ పన్ను రూపంలో గుంజుకోవాలనుకునేవారికి ఈ దానధర్మాలు నచ్చలేదు. దాంతో సన్యాసులను వేధించడం, వారితో అమానుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. నిష్కారణంగా వందల మందిని చంపేవారు. ఫలితంగా సన్యాసులు తిరగబడ్డారు. దేశంలోనే తొలి ఆధునిక నవలాకారుడిగా భావించే బంకిం చంద్రబోస్ రాసిన ఆనందమఠంలో ఈ ఘర్షణ కనిపిస్తుంది. ఆ సందర్భంగా రాసిన వందేమాతరం గీతాన్నే జాతీయ గేయంగా మలుచుకున్నాం. పూర్తిస్థాయి యుద్ధంగా కాకపోయినా… చెదురుమదురు సంఘటనలతో నలభై ఏళ్ల పాటు ఈస్ట్ ఇండియా కంటి మీద కునుకు లేకుండా చేసిందీ పోరాటం. ఇప్పటి తరం పూర్తిగా మర్చిపోయిన ఈ పోరాటాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ 1770: Ek Sangram పేరుతో సినిమాగా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మీద ఈ సన్యాసుల తిరుగుబాటు పెద్దగా ప్రభావం చూపకపోయినా… మరిన్ని తిరుగుబాట్లకు ధైర్యాన్నిచ్చింది. హిందువుల సన్యాసుల ఉద్యమంలాగానే 1830లో అబ్దుల్ వహాబ్ అనే మతగురువు బోధల స్ఫూర్తితో ముస్లింలు చేసిన తిరుగుబాటును కూడా తలుచుకోవాలి.
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఎక్కువగా నష్టపోయింది రైతులే. వారు చెప్పిన పంట వేయాలి. చెప్పిన ధరకే అమ్మాలి. పైసా మిగలకున్నా పన్నులు కట్టాలి. మిడ్నాపూర్, గోరఖ్‌పూర్, బస్తీలాంటి చాలాచోట్ల జరిగిన తిరుగుబాట్ల వెనుక రైతుల అసంతృప్తే ప్రధాన కారణం. ఉప్పు సత్యాగ్రహం కంటే చాలా ఏండ్ల ముందే 1840లో ఉప్పును పండించేవారు, స్థానికులు కలిసి చేసిన సత్యాగ్రహం అప్పటి చట్టాన్ని మార్చేలా ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల మీద ఒత్తిడి తెచ్చింది. రైతు తన పని తాను చేసుకుపోయే సాధుజీవి. కానీ ఎవరన్నా తన పంట జోలికి వచ్చినా, పండించే హక్కు జోలికి వచ్చినా ఊరుకోడు. అందుకే 1782లో నర్కెల్బెరియా తిరుగుబాటు నుంచి 1921 మోప్లా పోరు వరకు రైతులు ఎదురు తిరుగుతూనే వచ్చారు. ఒకవైపు భూస్వాములతోనూ, మరోవైపు స్థానిక రాజులతోనూ… పోరాడుతూనే బ్రిటిషర్లను కూడా ఎదుర్కొన్నారు.
అడవిని తల్లిగా భావించే గిరిజనులను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వదిలిపెట్టలేదు. కొత్త పంటల కోసం వారి భూములను దోచుకున్నారు. అడవి ఉత్పత్తులను పంచుకున్నారు. కలప కోసం చెట్లను కూడా వారికి కాకుండా చేశారు. వారి మీదకు వడ్డీ వ్యాపారులను, భూస్వాములను ఉసిగొల్పారు. ఇప్పటి జార్ఖండ్ ప్రాంతంలో ఉన్న సంతాల్ తెగల తిరుగుబాటులో 60 వేలమంది వరకూ పాల్గొన్నట్టు అంచనా! వారిని అణచివేసేందుకు ఏనుగులను సైతం రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఇది కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా మాత్రమే జరిగిన తిరుగుబాటు కాదు… తమను నీచంగా చూస్తూ వచ్చిన ఇతర వర్ణాలు, వ్యాపారుల మీద కూడా ఎదురుతిరిగారు. బాణాలు, గొడ్డల్లే ఆయుధాలుగా మొదలైన ఈ పోరు గెరిల్లా పద్ధతులతో బ్రిటిషర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఆరునెలల పాటు సాగిన ఈ పోరులో దాదాపు 20 వేలమంది సంతాల్ వీరులు చనిపోయారట. ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్ సైతం అబ్బురపడిన సంతాల్‌ల సాహసాన్ని ఇప్పటి తరం మర్చిపోవడం దురదృష్టకరం. కేవలం సంతాల్‌లు మాత్రమే కాదు కోల్, ముండా, భిల్లు వంటి ఎన్నో తెగలు ఈస్ట్ ఇండియా కంపెనీ దాష్టీకానికి వ్యతిరేకంగా తిరగబడ్డాయి. బిర్సా ముండాలాంటి వీరులు చరిత్రలో పోరు పాఠాలు లిఖించారు. మన తెలుగునాట కూడా కోయలు, గోండ్లు వారి పాలనకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపించారు.
సిపాయిల తిరుగుబాటుకు ముందే చెలరేగిన ఇలాంటి అగ్గిరవ్వలెన్నో రాజుకోకముందే ఆరిపోయాయి. ఆ మాటకు వస్తే సిపాయిలలో కూడా 1857 మాత్రమే తొలి తిరుగుబాటు కాదు. అంతకు 50 ఏళ్ల ముందే వెల్లూరులో ఓ తిరుగుబాటు జరిగింది. 1812లో హైదరాబాదులోనూ జరిగింది. ఇక 1857 తర్వాత జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలోనూ మర్చిపోయిన మజిలీలెన్నో ఉన్నాయి. స్వదేశీ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, హోం రూల్ ఉద్యమం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ ఉద్యమం, జలియన్‌వాలాబాగ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ… ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఎక్కడో ఒకచోట పాఠ్యపుస్తకాలలోనో, సోషల్ మీడియాలోనో కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. ఇవి కాక మరపులో ఉన్న మలుపులు మరెన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గుర్తుచేసుకోవాల్సిన సందర్భమూ ఇదే! గదర్: మన స్వాతంత్య్ర వీరుల సరసన సోహన్ సింగ్ అనే పేరు కనిపించకపోవచ్చు. కానీ 1913లో గదర్ పార్టీ స్థాపించి అద్భుతమైన ఫలితాలు సాధించిన వ్యక్తిగా తనను తలుచుకోవాలి. అమెరికా, కెనడాల్లో ఉన్న భారతీయులు చురుగ్గా పాల్గొన్న ఉద్యమం ఇది. భారత స్వాతంత్య్ర పోరుకు నైతిక మద్దతు మాత్రమే కాకుండా… ఇక్కడి ప్రజలను మతాలకు అతీతంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏకం చేసే ప్రయత్నం జరిగింది. నేటి తరం హీరో భగత్ సింగ్‌ను విశేషంగా ప్రభావితం చేసిన ఉద్యమం ఇది.
చంపారన్: గాంధీ అహింసా పద్ధతులు, పోరు మార్గాలను మలిచిన సంఘటన ఇది. బీహార్‌లోని చంపారన్‌లో నీలి (ఇండిగో) పంటను పండించాల్సిందిగా రైతుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉండేది. ‘తింకాతియా’ అనే ఈ నిబంధనతో నలిగిపోయిన స్థానిక రైతు రాజ్‌కుమార్ 1917లో గాంధీని కలిసి… ఆయనను చంపారన్ తీసుకువెళ్లారు. గాంధీ నేతృత్వంలో అహింసతో జరిగిన ఉద్యమాలు… అక్కడి రైతులను బలవంతపు పంటల చెర నుంచి విడిపించాయి. ఈ విజయమే మరిన్ని సత్యాగ్రహాలకు దారితీసింది.
ఖిలాఫత్: ఒటోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పోకడలను నిరసిస్తూ ముస్లింలంతా ఐక్యమయ్యారు. పీడనకు వ్యతిరేకంగా గళమెత్తారు. గాంధీ, పటేల్, తిలక్ వంటి నాయకులు దీన్ని కేవలం ఓ మత ఉద్యమంగా మాత్రమే చూడలేదు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సంఘటితం అయ్యే సందర్భంగా భావించారు. ఆ పోరును మరింత విస్తృతం చేస్తూ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు.
నేవీ తిరుగుబాటు: ఫిబ్రవరి, 1946లో బాంబే తీరంలో ఉన్న నావికులు తమ అరకొర సౌకర్యాలు, వివక్ష లాంటి కారణాలతో ఒళ్లు మండి నిరాహార దీక్షకు దిగారు. రోజుల వ్యవధిలోనే ఇరవై వేలమంది నావికులు ఈ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. జాతీయ నినాదాలు చేస్తూ, స్వాతంత్య్ర ఉద్యమానికి కూడా మద్దతు పలికారు. అప్పటికే జాతీయ కాంగ్రెస్ మొదలుకొని బోస్ సైన్యం వరకూ ఎన్నో సవాళ్లకు తలబొప్పి కట్టిన బ్రిటిష్ పాలకులకు ఇది ఓ తుది హెచ్చరికలా కనిపించింది. సైన్యం కనుక ఎదురుతిరిగితే నామరూపాలు ఉండవని గ్రహించింది. దేశాన్ని విడిచిపెట్టడానికి ఇది కూడా ముఖ్య కారణం అయిందని చరిత్రకారులు విశ్లేషిస్తారు.
బ్రిటిష్ వారి వల్ల కీడు ఎంత జరిగిందో మేలు కూడా అంతే జరిగిందనే వాదనలు ఉన్నాయి. విద్యను విస్తరించారు. రోడ్డు మార్గాలను విస్తరించారు. రైల్వే మార్గాలు నిర్మించారు. టెలిఫోన్లు, తపాలా, న్యాయ వ్యవస్థలు ప్రవేశపెట్టారు. సాగునీటి ఆనకట్టలు నిర్మించారు. బాల్య వివాహాలు, సతీసహగమనం, అంటరానితనం నిషేధించారు. ఇలాంటి చర్యలు కనిపించినా వాటిలో చాలా తమ వ్యాపార అభివృద్ధి కోసం తలపెట్టినవే. కాటన్ వంటి మనసున్న మారాజులు నూటికొక్కరు మాత్రమే.
బంగారం నుంచి వజ్రాల వరకు… శిల్పాల నుంచి పంటల వరకు లక్షల కోట్ల విలువైన సంపదను శతాబ్దాల తరబడి తమ దేశానికి తరలించారు. ఇక్కడి సంపదతో అక్కడ విలాసమైన జీవితాలు గడిపారు.
ఆది నుంచీ బ్రిటిషర్లది ఇదే సూత్రం. చివర్లో మతాలవారీగా విభజించి… హిందూ, ముస్లింలు కలిసి ఒక దేశంలో ఉండలేరనేలా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. చివరికి దేశాన్ని ముక్కలు చేసి… దాని నెపాన్ని కూడా స్థానిక నాయకత్వం మీదకు నెట్టేశారు.
ఎవరి నుంచి ఎంత పిండుకోవచ్చో… పన్నుల రూపంలో అంతా దండుకున్నారు. దానికి సాక్ష్యం బెంగాల్ కరువు. ఒకవైపు పంటలు పండక, మరోవైపు పన్నులు కట్టలేక బెంగాలీలు ఆకలితో అల్లాడారు. ఇలా జరగబోతున్నదని తెలిసినా, అక్కడ పండిన కాస్త ధాన్యాన్ని తమ ప్రాంతాలకు తరలించుకున్నారు బ్రిటిషర్లు. జనం పిట్టల్లా రాలిపోతున్నా, ఇసుమంత సాయం చేయలేదు. ఫలితం! ఏకంగా నాటి జనాభాలో మూడోవంతు కరువుకి బలైపోయింది.
వస్ర్తాల నుంచి బొమ్మల వరకూ, తమ ఉత్పత్తుల వ్యాపారం కోసం ఇక్కడ ఉండే సంప్రదాయ పద్ధతులను, కుటీర పరిశ్రమలను నాశనం చేశారు. ఉప్పు నుంచి దుస్తుల వరకు తాము చెప్పిన ధరకే కొనే దుస్థితి కల్పించారు. ఇవే విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలాంటి ఆగ్రహాలకు
దారి తీసింది.
ఇక్కడ ఏ పంటలు పండాలో కూడా వారే నిర్ణయించేవారు. నీలం (ఇండిగో), ఓపియం (గంజాయి) లాంటివి పండించమంటూ నిబంధనలు విధించేవారు. కేవలం పంటలేకాదు… పన్నులతో, కఠినమైన చట్టాలతో రైతాంగం వెన్ను విరిచారు.
హిందూ మహాసముద్ర తీరంలో పాగా వేసిన ఆంగ్లేయులు, మొగల్ రాజులను ఎలాగో అలా మచ్చిక చేసుకుని… స్థిరపడిపోయారు. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం ఇద్దరి మధ్యా సంబంధాన్ని కుదిపేసింది. దాదాపుగా ఈస్ట్ ఇండియా కంపెనీని తరిమికొట్టేలా చేసింది. 1695లో మక్కా నుంచి సూరత్ వస్తున్న మొగల్ నౌకలలో ‘గంజి సవాయ్’ అనే భారీ నౌక ఉంది. హిందూ మహాసముద్రంలోనే అత్యంత ఖరీదైన, భారీ అయిన నౌకగా దానికి పేరు. అంతేకాదు. అది అపారమైన ధనరాశిని మోసుకువస్తున్నది కూడా! ఈ విషయం తెలుసుకున్న హెన్రీ ఎవ్రీ అనే బ్రిటిష్ సముద్రపు దొంగ, ఇంకొంతమంది దొంగలను కూడగట్టుకుని దాని మీద దాడి చేశాడు.
కొన్ని లక్షల బంగారు నాణేలను దోచుకున్నాడు. చరిత్రలో అతిపెద్ద సముద్రపు దోపిడీగా దీనికి పేరు. ఈ విషయం తెలిసి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ‘బ్రిటిషర్లు ఇంత నమ్మకద్రోహం చేస్తారా?’ అని హుంకరిస్తూ… దేశంలో వారి స్థావరాలను మూసేయమని, అధికారులను బంధించమనీ, వ్యాపారం ఆపమని ఆజ్ఞాపించాడు. అదే పట్టుదల కొనసాగి ఉంటే ఏం జరిగేదో? కానీ కొంత డబ్బు తిరిగి ఇస్తామని ఈస్ట్ ఇండియా శరణు వేడటంతో, వారిని క్షమించేశాడు. ఔరంగజేబును ప్రసన్నం చేసుకునేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ హెన్రీ కోసం గాలింపు చేపట్టింది. దీనిని మానవ చరిత్రలో తొలి ఖండాంతర నేరస్తుల గాలింపు చర్యగా పరిగణిస్తారు.
మన దేశ స్వాతంత్య్రాన్ని ఘనంగా తల్చుకునే పంద్రాగష్టున ఒక్కసారి… కాస్త ఫోన్లను పక్కన పెట్టి చరిత్రను పట్టించుకుంటే స్ఫూర్తి రగిలించే ఇలాంటి ఉద్యమాలే కాదు… ఒళ్లు గగుర్పొడిచే అద్భుత సాహసాలూ కనిపిస్తాయి! సూపర్ హీరోల సినిమాలకు, ఓటీటీ సిరీస్‌లకు దీటైన అద్భుత క్షణాలు కళ్ల ముందు నిలుస్తాయి. ఓసారి అటు కూడా అడుగువేసి చూద్దాం. మన వెనకే పిల్లల్ని కూడా నడిపిద్దాం. అప్పుడు కేవలం స్వేచ్ఛ విలువే కాదు… త్యాగం, నిబద్ధత, పట్టుదల లాంటి ఎన్నో అంశాలు వారిలో ఇంకిపోతాయి. ఇప్పటి తరానికి కావల్సినవి అవే!