దాదాపు రెండు వందల ఏండ్లు సాగిన బ్రిటిష్ వారి వలస పాలన, దానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం, దేశ విభజన, మత కలహాల నేపథ్యంలో భారత రాజ్యాంగం రూపొందింది. కాబట్టి, ప్రజల ఆకాంక్షలు, దేశ సమగ్రత, ఐక్యతను దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్య సమాజ స్థాపన లక్ష్యంగా రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించారు. రాజ్యాంగ నిర్మాతల్లో కొంతమంది గాంధేయవాదులు, ఇంకొంతమంది సామ్యవాదులు, మరికొంతమంది ఏదో ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించే వారు ఉన్నారు. అయినప్పటికీ రాజ్యాంగ రచన విషయంలో అందరూ గొప్ప ఆలోచనలతోనే పనిచేశారు. వారి లక్ష్యం అంతా ఒక్కటే… ప్రజల ఆలోచనలు, ఆదర్శాలను ప్రతిబింబించేలా భారతదేశానికి ఓ మంచి రాజ్యాంగాన్ని రూపొందించడమే. దేశ ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ వజ్ర కవచంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి సరిగ్గా 75 ఏండ్లు. ఈ సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాణ విశేషాలను తెలుసుకుందాం.
భారతదేశ పరిపాలనకు అవసరమైన మౌలిక పుస్తక రచన కోసం వివిధ రంగాల ప్రముఖులతో 1946లో ఓ రాజ్యాంగ సభ ఏర్పాటైంది. ఇందులో అప్పటి బ్రిటిష్ పాలిత భారతదేశ రాష్ర్టాల నుంచి పరోక్షంగా ఎన్నికైన ప్రతినిధులతోపాటు స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయిన వాళ్లూ సభ్యులుగా ఉన్నారు. పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా విడిపోవడంతో స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. దీనికి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ‘డ్రాఫ్టింగ్ కమిటీ’ (రచనా లేదా ముసాయిదా సంఘం)కి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో భారత రాజ్యాంగ రచనను రాజ్యాంగ సభ పూర్తిచేసింది.
భారత రాజ్యాంగం రాతపూర్వకమైనది. అంటే నిర్ణీత సమయంలో రూపొందించుకుని, ఓ నిర్ణీత తేదీ నుంచి అమలులోకి వచ్చిన పుస్తకం అన్నమాట. రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26 నాడు పూర్తయింది. అయితే, ఇది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం 448 అధికరణలు, 12 షెడ్యూళ్లు, 25 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలతో పోలిస్తే భారతదేశ రాజ్యాంగమే అతిపెద్దది.
భారత ప్రజలమైన మేము,
భారతదేశాన్ని…
సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య,
గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి;
పౌరులందరికీ…
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో స్వాతంత్య్రాన్ని;
అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చడానికి;
ప్రజలందరిలో…
వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యత, సమగ్రతను
సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి…
మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న మాకు మేము సమర్పించుకుంటున్నాం.
భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నది. మనం పార్లమెంటరీ విధానాన్ని బ్రిటిష్ వారినుంచి తీసుకున్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎన్నికైన సభ్యుల నుంచే ప్రభుత్వం ఏర్పడుతుంది. అలా కార్యనిర్వాహక వర్గం (ప్రభుత్వం), శాసన విభాగాల మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది. ప్రభుత్వం పార్లమెంట్ (లోక్‌సభ, రాష్ర్టాల్లో అయితే విధానసభ) శాసన విభాగానికి బాధ్యత వహిస్తుంది. చట్టసభ విశ్వాసం ఉన్నంత వరకే ప్రభుత్వం మనుగడలో ఉంటుంది. ఈ తరహా వ్యవస్థలో రాజ్యాధిపతి (రాష్ట్రపతి) నామమాత్రపు అధికారాలనే కలిగి ఉంటాడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి విశేషమైన అధికారాలు ఉంటాయి. కానీ, వాస్తవంలో మాత్రం అధికారాలు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలికి ఉంటాయి. ప్రధానమంత్రి, మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి నడుచుకుంటాడు.
భారతదేశం సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నది. సమాఖ్య వ్యవస్థలో రెండు స్థాయుల్లో ప్రభుత్వాలు ఉంటాయి. దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ప్రతి రాష్ర్టానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. ప్రస్తుతం మనదేశంలో 28 రాష్ర్టాలు ఉన్నాయి. మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో… ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్‌లలో కూడా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అయితే భారత రాజ్యాంగంలో ఎక్కడా ‘సమాఖ్య’ (ఫెడరల్) అనే పదాన్ని వాడలేదు. మొదటి అధికరణంలో మాత్రం ‘ఇండియా దట్ ఈజ్ భారత్… యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అంటే రాష్ర్టాల సమాహారంగా పేర్కొన్నారు. దీని గురించి వివరిస్తూ డాక్టర్ అంబేద్కర్… “మనదేశం రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం కారణంగా ఏర్పడలేదు. మన అవసరాల కొద్దీ దేశ భూభాగాన్ని రాష్ర్టాలుగా విభజించుకున్నాం. ఏ రాష్ర్టానికీ దేశం నుంచి విడిపోయే హక్కులేదు. అయితే రాష్ర్టాలను మాత్రం పరిస్థితులను బట్టి విభజించే హక్కు కేంద్రానికి ఉంది” అని పేర్కొన్నారు.
రాజ్యాంగంలో ఏడో షెడ్యూల్లో కేంద్రం, రాష్ర్టాల మధ్య అధికారాల విభజన ఉంది. కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చు. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చట్టాలు చేసుకోవడానికి ఉమ్మడి జాబితా కూడా ఉంది. అయితే వీటిపై కేంద్ర రాష్ర్టాల మధ్య వివాదం తలెత్తితే కేంద్ర ప్రభుత్వ చట్టమే చెల్లుబాటు అవుతుంది. ఇక ఏ జాబితాలోనూ పేర్కొనని అంశాలపై చట్టాలు చేసే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే ఉన్నది.
సమాఖ్య తరహా దేశాల్లో రెండు పౌరసత్వాలు ఉంటాయి. ఒకటి దేశ పౌరసత్వం. ఇంకొకటి పౌరుడు నివాసం ఉండే రాష్ర్టానికి సంబంధించింది. కానీ, భారతదేశంలో మాత్రం రాష్ర్టాలకు విడిగా పౌరసత్వం ఉండదు. ఏ రాష్ట్రంలో ఉన్నా భారత పౌరులే.
భారత ప్రజాస్వామ్యం ‘ఒక వ్యక్తి ఒక ఓటు’ ప్రాతిపదికన పనిచేస్తుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హుడే. అలా సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా భారత రాజ్యాంగం రాజకీయ సమానత్వానికి పెద్దపీట వేసింది. అయితే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 21 ఏండ్లు నిండిన వారికే ఓటుహక్కు ఉండేది. దాన్ని 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1989లో 18 ఏండ్లకు తగ్గించారు. కాగా, దేశంలో ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ అధికరణం 324 ప్రకారం 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పాటైంది. అందుకే జనవరి 25ను ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’గా జరుపుకొంటున్నారు.
భారత రాజ్యాంగం సమగ్రమైన స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటుచేసింది. సుప్రీంకోర్టు అత్యున్నత స్థాయిలో ఉంటుంది. రాష్ర్టాల్లో హైకోర్టులు మధ్య స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం దేశంలో 25 హైకోర్టులు పనిచేస్తున్నాయి. హైకోర్టుల పరిధిలో జిల్లా స్థాయి, ఇంకా దిగువ స్థాయి న్యాయస్థానాలు ఉంటాయి. ప్రాథమిక హక్కులకు ప్రమాదం ఏర్పడితే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. అంతేకాకుండా మన రాజ్యాంగానికి సుప్రీంకోర్టు సంరక్షకురాలిగా వ్యవహరిస్తుంది. చట్టపరమైన సమస్యలు తలెత్తినప్పుడు రాజ్యాంగానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చెబుతుంది. అలా సుప్రీంకోర్టు మన రాజ్యాంగానికి పరిరక్షణకర్తగా భావించవచ్చు.
రాజ్యాంగంలో మూడో భాగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ఇవి ప్రతి పౌరుడూ సహజంగా అనుభవించాల్సినవి అన్నమాట. వీటిని రాజ్యాంగంలో 12వ అధికరణ నుంచి 35 వరకు పేర్కొన్నారు. మొత్తం ఆరు రకాలైన ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి. అవి.
సమానత్వపు హక్కు: ఇవి దేశ పౌరులందరికీ సమాన అవకాశాలను ప్రసాదిస్తున్నాయి. అంటరానితనాన్ని నిషేధించాయి. భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సైనిక గౌరవాలు తప్ప ఇతర బిరుదులను రాజ్యాంగం నిషేధించింది.
స్వాతంత్య్రపు హక్కు: 19 నుంచి 22 అధికరణల్లో దీని గురించి ప్రస్తావించారు. దేశంలో ఎక్కడైనా తిరగడానికి, నివసించడానికి, నచ్చిన వృత్తిని చేపట్టడానికి, ఆయుధాలు లేకుండా సభలు, సమావేశాలు జరుపుకోవడానికి, సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. 23, 24 అధికరణలు అన్ని రకాల పీడనల నుంచి ప్రజలకు విముక్తిని ప్రసాదించాయి. 25, 26, 27, 28 అధికరణల్లో మత స్వాతంత్య్రం గురించి పేర్కొన్నారు. నచ్చిన మతాన్ని ఆచరించి, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. 29, 30 అధికరణల్లో విద్య, సంస్కృతికి సంబంధించిన రక్షణలు కల్పించారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాన్ని 32వ అధికరణం ఇస్తున్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దీన్ని ‘రాజ్యాంగానికి ఆత్మ’ అని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనే పేర్కొన్నది. న్యాయ సంరక్షణ లేని ఆదేశిక సూత్రాల్లో మాత్రం 40వ అధికరణలో పంచాయతీల ఏర్పాటు గురించి ప్రస్తావించారు. వీటి ఏర్పాటుకు పార్లమెంటు చట్టం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థకు, 74వ సవరణ ద్వారా పట్టణాల్లో మునిసిపాలిటీలకు కూడా రాజ్యాంగ హోదా కల్పించారు. అలా దేశంలో మూడో అంచె ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. పరిపాలన మరింతగా ప్రజలకు దగ్గరయ్యింది.
ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో నాలుగో భాగంలో అధికరణలు 36 నుంచి 51 వరకు పేర్కొన్నారు. దేశ పౌరుల పట్ల రాజ్యం ఏది చేయకూడదో ప్రాథమిక హక్కులు చెబుతాయి. ఆదేశిక సూత్రాలేమో ప్రజల సంక్షేమానికి రాజ్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్దేశిస్తాయి. అందుకే వీటిని ‘రాజ్య విధాన నిర్దేశక నియమాలు’ (డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ) అని కూడా పిలుస్తారు. వీటిని ఐర్లాండ్ దేశపు రాజ్యాంగం నుంచి గ్రహించారు. ప్రాథమిక హక్కులు రాజకీయ న్యాయానికి వీలు కల్పిస్తే.. ఆదేశిక సూత్రాలు సామాజిక, ఆర్థిక న్యాయానికి హామీ ఇస్తాయి. అయితే, వీటిని ప్రభుత్వాలు వీలును బట్టి అమలుచేస్తాయి. కాబట్టి, ఆదేశిక సూత్రాలకు న్యాయస్థానాల నుంచి రక్షణ లేదు. అందుకే వీటిని మనం జనవరి 1వ తేదీనాడు తీసుకునే తీర్మానాల వంటివి అనే విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ… ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోతే ఎన్నికల సమయంలో ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వీటిని విస్మరించలేరనేది రాజ్యాంగ నిర్మాతల ఆలోచన.
ఆర్థిక, సామాజిక, అవకాశాల పరంగా అసమానతలు లేని సమాజ నిర్మాణం, స్త్రీలు, పురుషులకు సమాన పనికి సమాన వేతనం, వనరులు ఒక్కరు లేదా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడటం, శ్రమదోపిడీని నివారించడం, పేదలకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ పంచాయతీల ఏర్పాటు, దేశ ప్రజలందరికీ ఉమ్మడి (ఒకే) పౌరస్మృతి లాంటివి ఆదేశిక సూత్రాల్లో భాగం. న్యాయ సంరక్షణ లేనప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏర్పాటైన ప్రభుత్వాలు వీటి అమలుకు కృషిచేస్తూనే ఉన్నాయి.
* * *
ఒక దేశ పాలనలో అనుసరించాల్సిన మౌలిక చట్టమే రాజ్యాంగం. దేశ ప్రజల హక్కులు, సంక్షేమం దృష్ట్యా చూస్తే భారత రాజ్యాంగం అత్యుత్తమమైన రచన. అయితే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు “రాజ్యాంగం ఎంత గొప్పది అయినప్పటికీ, దాన్ని అమలు చేసేవాళ్లు మంచివాళ్లు కాకపోతే ప్రయోజనం ఉండదు. ఒకవేళ రాజ్యాంగం ఎంత చెడ్డది అయినప్పటికీ, అమలు చేసేవాళ్లు మంచివాళ్లయితే అది గొప్పగా ఉంటుంది”. కాబట్టి, ప్రభుత్వాలు, ప్రజలు రెండు వైపుల నుంచి రాజ్యాంగ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తేనే ఒక దేశంగా భారతదేశం గొప్పదిగా నిలుస్తుంది.
కేశవానంద భారతి కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లాలో ఓ హిందూ మఠానికి అధిపతి. ఆ మఠంలో భూమికి ఆయన యజమాని. అయితే, 1969లో కేరళ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం తీసుకువచ్చింది. దీనికింద మఠానికి చెందిన కొన్ని భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కు తమకు ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో 1970 మార్చిలో కేశవానంద భారతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు 14, 19 (1) (f), 25, 26, 31 అధికరణల కింద ఆస్తిని కలిగి ఉండటం ప్రాథమిక హక్కు అని ఆయన వాదించారు.
ఈ నేపథ్యంలో 1973 ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రకటించింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం. సిక్రి నేతృత్వంలోని 13మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 7:6 తేడాతో… రాజ్యాంగంలోని ఏ అధికరణాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని తీర్పుచెప్పింది. అయితే, రాజ్యాంగ ప్రాథమిక స్వరూపం దెబ్బతినకుండా ఆ సవరణలు ఉండాలని షరతు విధించింది. రాజ్యాంగ ఆధిక్యత, న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు, అధికారాల విభజన, న్యాయ వ్యవస్థ స్వతంత్రత మొదలైన అంశాలు రాజ్యాంగ మౌలిక స్వరూపం కిందికి వస్తాయి. చివరికి 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలోంచి తొలగించారు.
రాజ్యాంగాన్ని పరిశీలించి, ఒక రూపం ఇచ్చింది ముసాయిదా కమిటీయే అయినప్పటికీ, రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించింది రాజ్యాంగ సభ సలహాదారుడు బెనెగల్ నరసింగరావు (బీఎన్ రావు). ఇండియన్ సివిల్ సర్వీస్ మాజీ అధికారి అయిన బీఎన్ రావు ప్రపంచంలోని ముఖ్యమైన రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. భారత రాజ్యాగ రచనలో కీలక పాత్ర పోషించారు.
రాజ్యాంగ రచన కోసం డ్రాఫ్టింగ్ (ముసాయిదా) కమిటీని రాజ్యాంగ సభ నియమించింది. ముసాయిదా కమిటీలో అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో కలుపుకొని మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారు… అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, కేఎం మున్షి, సయ్యద్ మహ్మద్ సాదుల్లా, బీఎల్ మిత్తర్, డీపీ ఖేతాన్. తర్వాత బీఎల్ మిత్తర్ స్థానంలో మాధవ రావును సభ్యుడిగా నియమించారు. రాజ్యాంగ సభ సలహాదారుడు బీఎన్ రావు సహాయంతో రూపొందించిన ప్రతిని 1947 అక్టోబర్ చివరికల్లా డ్రాఫ్టింగ్ కమిటీ క్షుణ్నంగా పరిశీలించడం మొదలుపెట్టింది. ముసాయిదా కమిటీ రూపొందించిన చివరి ప్రతి 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదం పొందింది. 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.
జాతీయ నాయకులు స్వాతంత్య్ర ఉద్యమ సమయంలోనే భారతదేశ పాలనకు ఓ రాజ్యాంగం ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం కూడా వివిధ కమిటీలను, 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకువచ్చింది. చివరికి 1946లో లార్డ్ పెథిక్ లారెన్స్ అధ్యక్షుడిగా బ్రిటిష్ ప్రభుత్వం ‘క్యాబినెట్ మిషన్’ను భారతదేశానికి పంపించింది. ఇదే భారతదేశ పాలన కోసం ఓ రాజ్యాంగ సభ ఏర్పాటుచేయాలని సూచించింది.
ఈమేరకు 1946లోనే రాజ్యాంగ సభ ఏర్పాటైంది. ఇందులో మొత్తం 389 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 292 మందిని బ్రిటిష్ ఇండియాలోని 11 రాష్ర్టాల శాసనసభల సభ్యులు పరోక్ష ఎన్నిక విధానంలో ఎన్నుకున్నారు. మరో 93 మంది సభ్యులు స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయ్యారు. ఇంకో నలుగురు సభ్యులు చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ (ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల వంటివి) నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే, 1947 ఆగస్ట్ 14న దేశ విభజన జరిగి పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. దీంతో భారత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. వీరిలో 229 మంది బ్రిటిష్ ఇండియాలోని రాష్ర్టాల నుంచి, 70 మంది స్వదేశీ సంస్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు.
అది గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం జరుగుతున్న సమయం. 1929 డిసెంబర్ 31 అర్ధరాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా జాతీయ పతాకం ఎగరవేశారు. అదేరోజున 1930 జనవరి 26ను ‘స్వాతంత్య్ర దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రకటించారు. నిజానికి మనదేశానికి బ్రిటిష్ వారినుంచి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం వచ్చింది. అయినప్పటికీ, 1930 నుంచి 1947 వరకు జనవరి 26ను స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుతూ వచ్చారు. ఈ సంఘటనకు గుర్తుగానే భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26 నాటికే పూర్తయినా, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని రాజ్యాంగ సభ ప్రకటించింది. ఈ రోజు నుంచి భారతదేశం గణతంత్రంగా అవతరించింది. అలా మనదేశంలో ఆగస్ట్ 15, జనవరి 26 జాతీయ దినోత్సవాలుగా నిలిచిపోయాయి. ఇక రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26ను ‘భారత రాజ్యాంగ
దినోత్సవం’గా జరుపుకోవాలని 2015లో నిర్ణయించారు.
– చింతలపల్లి హర్షవర్ధన్