ఆ చిత్రాల్లో.. నా సంతకం కనిపించాలి

‘అ!’ అంటూ తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేశారు యువ దర్శకుడు ప్రశాంత్‌వర్మ. మునుపెన్నడూ చూడని వైవిధ్య ఇతివృత్తాన్ని సృజనాత్మకంగా తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించారు. అనంతరం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘కల్కి’తో కమర్షియల్ పంథాలో ఇన్నొవేటివ్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. ఇటీవలే తెలుగులో తొలి జాంబి జోనర్ చిత్రం ‘జాంబిరెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘ప్రస్తుతం రొటీన్ సినిమాల పట్ల ప్రేక్షకులు విముఖత ప్రదర్శిస్తున్నారు. ప్రయోగాలు చేయడమే ఇప్పుడు సేఫ్. ఏ సినిమా చేసినా కథలో కొత్తదనం చూపించాలన్నదే నా లక్ష్యం’ అంటున్న ప్రశాంత్‌వర్మ ‘బతుకమ్మ’తో జరిపిన సంభాషణ..
నేను ఇంజినీరింగ్ చదివే రోజుల్లో లఘు చిత్రాలతోపాటు మ్యూజిక్ వీడియోలు చేసేవాణ్ణి. వాటికి మంచి స్పందన లభించేది. మరిన్ని షార్ట్‌ఫిల్మ్స్ చేయాలంటూ నా సన్నిహితులు ప్రోత్సహించేవారు. నేను రూపొందించిన ‘సైలెంట్ మెలోడీస్' అనే షార్ట్‌ఫిల్మ్‌కు ఆ రోజుల్లోనే రెండుకోట్ల వరకు వ్యూస్ లభించాయి. ఈ క్రమంలో లఘుచిత్రాలతోపాటు డాక్యుమెంటరీస్, కమర్షియల్ యాడ్స్ చేశాను. అలా తెలియకుండానే సృజనాత్మక రంగంపై ఆసక్తి పెరిగింది. నేను బిటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడాలనే ఆలోచన ఉండేది కానీ, అనుకోకుండా సినిమాల వైపు అడుగులు పడ్డాయి. నాని అందించిన అవకాశంతో ‘అ!’ సినిమా ద్వారా దర్శకుడిగా నా ప్రయాణం ఆరంభమైంది.
‘అ!’అనుకున్నదానికంటే...
దర్శకుడవ్వాలని నిర్ణయించుకున్నాక చాలా కథల్ని సిద్ధం చేసుకున్నా. వాటిలో చాలా వరకు భారీ బడ్జెట్ అవసరమైనవి ఉన్నాయి. అయితే దర్శకుడిగా తొలి ప్రయత్నాల్లో ఉండటంతో అధిక బడ్జెట్ కథలు వర్కవుట్ కాలేదు. ‘అ!’కథలో నవ్యతతోపాటు పరిమిత వ్యయం కావడంతో ఆ సినిమా మొదట కార్యరూపం దాల్చింది. సింగిల్ లొకేషన్లో పూర్తయ్యేలా కథను రాసుకోవడం అడ్వాంటేజ్ అయింది. కథలో కొత్తదనం, ఇదివరకెప్పుడూ చూడని వైవిధ్యమైన ట్రీట్మెంట్ వల్ల ‘అ!’ సినిమా ఆశించిన దానికంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువైంది. కమర్షియల్గానూ సక్సెస్ సాధించింది.
ఎవరూ టచ్ చేయని కథలతో..
ప్రశాంత్‌వర్మ అంటే ప్రయోగాలు చేస్తాడనే ముద్రపడింది. వాస్తవానికి నేను అన్ని జోనర్స్ చిత్రాలను ఇష్టపడతాను. ఒకవేళ పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం చేసినా అందులో ఎవరూ స్పృశించని పాయింట్‌ను చూపించాలని తపిస్తాను. ఏ తరహా సినిమాలు చేసినా రెగ్యులర్ పంథాకు భిన్నంగా ఉండాలన్నది నా ఆభిమతం. మరే చిత్ర ప్రభావమూ నా సినిమా మీద ఉండకూడదు. ‘ఇలా కూడా చేయొచ్చా!’ అని ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యపడే సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం. స్వతహాగా నేను సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడతాను. జేమ్స్ కామెరూన్, క్రిస్టోఫర్ నోలన్ నా అభిమాన దర్శకులు. తెలుగులో సింగీతం శ్రీనివాసరావుగారి శైలి నచ్చుతుంది. ‘జాంబిరెడ్డి’ తర్వాత నేను చేయబోతున్న చిత్రం కూడా ఇప్పటి వరకు చూడని కొత్త జోనర్లో ఉంటుంది.
ప్రతి ఒక్కరికీ సిగ్నేచర్
తన మస్తిష్కంలో మెదిలిన ఆలోచనను తెరపైకి తీసుకురావడమే దర్శకుడి లక్ష్యం. దర్శకులకు సాంకేతిక అంశాలపై పట్టుకంటే కథను అనుకున్న విధంగా దృశ్యమానం చేసే సృజనాత్మక ప్రతిభ చాలా ముఖ్యం. టెక్నికల్ అంశాలపై అవగాహన లేకున్నా కొందరు దర్శకులు సాంకేతిక నిపుణుల ద్వారా తాము కోరుకునే అవుట్‌పుట్‌ను తీసుకుంటారు. మరికొందరేమో టెక్నికల్ ఎలిమెంట్స్‌పై చక్కటి అవగాహనతో డైరెక్షన్ చేస్తారు. ఏది ఏమైనా అంతిమంగా దర్శకుడి శైలి సినిమాలో ప్రతిబింబిస్తుంది. రామ్‌గోపాల్‌వర్మ, మణిరత్నం, పూరి జగన్నాథ్ వంటి అగ్రదర్శకుల సినిమాలకు వారిదైన ఓ సంతకం ఉంటుంది. సినిమాలోని సీన్స్ చూస్తుంటేనే దర్శకుడు ఎవరో అర్థమైపోతుంది. సినీరంగంలో అందరూ నడిచిన దారుల్లో కాకుండా కొత్త పంథాను ఎంచుకొని ముందుకుసాగిన వారే తమదైన ముద్రను వేస్తారని నేను నమ్ముతాను.
మరింత ఇన్నొవేటివ్‌గా..
ప్రస్తుతం ఓటీటీ వేదికల ప్రభావం ఎక్కువగా ఉంది. వాటిద్వారా అన్ని భాషల్లో క్రియేటివ్ కంటెంట్ అందుబాటులోకి వస్తున్నది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎంత పెరిగినా భవిష్యత్తులో సినిమాల్ని డామినేట్ చేయలేవు. ఎందుకంటే పెద్ద స్క్రీన్‌లో, సమూహం మధ్యలో వచ్చే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎక్కడా సాధ్యం కాదు. అయితే కంటెంట్, ఇన్నొవేషన్ పరంగా మాత్రం ఓటీటీ ఇప్పటికే సినిమాల్ని అధిగమించింది. కథల్ని ఆవిష్కరించే విషయంలో సినిమాలకు కొన్ని పరిమితులు, పరిధులు ఉంటాయి. ఓటీటీ వేదికల్లో అలాంటి హద్దులు ఉండవు. ఏ కథనైనా ఆవిష్కరించే వీలుంటుంది. నేను ప్రస్తుతం ఓటీటీ కోసం ఓ స్క్రిప్ట్ ఇచ్చాను. ‘జాంబిరెడ్డి’ సినిమాతో బిజీగా ఉండటం వల్ల దర్శకత్వం కుదరలేదు. నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో కథా చర్చలు జరుగుతున్నాయి. కమర్షియల్ అంశాలున్న కథల్ని సినిమాలుగా చేసుకుంటూ పూర్తి ఇన్నొవేటివ్ సబ్జెక్ట్స్ ప్లాన్ చేస్తున్నా. నేను చేసే ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా చూసుకుంటా. తెలుగు సినిమాపై దర్శకుడిగా నాదైన సిగ్నేచర్ ఉండాలన్న సంకల్పంతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా.
సినిమా ప్రభావం తాత్కాలికం
సామాజిక సందేశం కలబోసిన సినిమాలకు ప్రేక్షకుల్లో బాగా ఆదరణ లభిస్తుందనేది వాస్తవం. అయితే, నా వ్యక్తిగత అభిప్రాయంలో మాత్రం సినిమా సమాజంలో, మనుషుల్లో పరివర్తన తీసుకురాదని నమ్ముతాను. ప్రేక్షకులపై సినిమా ప్రభావం తాత్కాలికంగానే ఉంటుంది. రెండు మూడు రోజులు మాత్రమే సినిమా తాలూకు హ్యాంగోవర్లో ఉంటాం. ఆ తర్వాత మన మనస్తత్వాల మేరకు నడుచుకుంటాం. ‘అపరిచితుడు’ సినిమా చూసిన తర్వాత కూల్‌డ్రింక్ బాటిల్‌ను బయట పడేయడానికి ఒకటి రెండు సార్లు ఆలోచించాను. సినిమాలో చూపించిన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశం అలా కొన్ని రోజులు మనపై ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే నిత్యజీవన వ్యవహారాల్లో పడిపోతామో సినిమా ప్రభావం క్రమంగా తొలగిపోతుంది.
టాలెంట్‌తో పాటు అనుభవం
వ్యక్తి ఆలోచనలు, అభిరుచుల సృజనాత్మక ఆవిష్కరణగా దర్శకత్వాన్ని అభివర్ణించవచ్చు. అయితే, ఇతర ఆర్ట్ విభాగాల మాదిరిగానే దర్శకత్వకళను సాధన, అనుభవం ద్వారా మెరుగుపరచుకోవచ్చు. కొందరు దర్శకులకు అంతగా క్రియేటివిటీ లేకపోయినా కెరీర్లో మంచి విజయాల్ని సాధిస్తుంటారు. ఎందుకంటే, వారికి అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానంతో సినీ సమీకరణాలపై మంచి అవగాహన ఉంటుంది. హీరోల్ని ఒప్పించడం మొదలుకొని కోరుకున్న సాంకేతిక నిపుణుల్ని తీసుకోవడం వరకు పద్ధతి ప్రకారం చేస్తూ సక్సెస్ అవుతారు. పరిశ్రమలో వ్యక్తిగత ప్రతిభతో పాటు అనుభవం కూడా ముఖ్యమే. దర్శకులుగా ప్రయత్నాలు చేసేవారు షార్ట్‌ఫిల్మ్స్ ద్వారా తమ ప్రతిభను చాటుకుంటే సినిమా అవకాశాలు త్వరగా వస్తాయి.
హీరో ఇమేజ్ ముఖ్యమే!
నా దృష్టిలో సినిమాకు కథే హీరో. అయితే ఆ కథకు పెద్దస్టార్ తోడైతే సినిమా రేంజ్ పెరుగుతుంది. ఎక్కువ మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలుగుతాం. మన భారతీయ సినిమాల్లో హీరో ఇమేజ్ ముఖ్యభూమిక పోషిస్తుంది. అదే సమయంలో స్టార్స్ సినిమాలంటే బాధ్యతలు కూడా ఎక్కువే ఉంటాయి. సినిమా మేకింగ్‌లో హీరోల సలహాల్ని పాటించడంతోపాటు అభిమానుల్ని మెప్పించేలా చిత్రాన్ని తీర్చిదిద్దాల్సి ఉంటుంది. అందుకే ప్రతీ దర్శకుడు సినిమా చేసేముందు అన్ని సమీకరణాల్ని బేరీజు వేసుకొని రంగంలోకి దిగుతారు.
రాజమౌళి స్థాయిలో చేయాలి
ఇన్నొవేటివ్ కాన్సెప్ట్స్‌కే నా తొలి ప్రాధాన్యం. అయినా, రాజమౌళి తరహాలో భారీ స్కేల్లో సినిమాలు చేయాలనే ఆకాంక్ష ఉంది. ఆ రేంజ్ కథల్ని కూడా సిద్ధం చేసుకున్నా. పన్నెండేండ్ల క్రితం నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక నిర్మాతకు కథ చెప్పాను. అది విన్న తర్వాత ‘ఇలాంటి కథలు రాసుకోవద్దు. ఈ స్థాయి ఉన్న సినిమాల్ని తీయడం సాధారణ విషయం కాదు’ అని అన్నారాయన. అదేవిధంగా సినిమాల మేకింగ్‌లో పూరి జగన్నాథ్‌గారి స్పీడ్‌ను ఇష్టపడతాను. నెలల వ్యవధిలోనే సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని ఉంది.
తాజావార్తలు
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!