చం. తిరిపెము లెత్తనేల గుణధీరు గజాస్యుని పెండ్లి చేయకన్
దొరయక నుంచనేల బలుధూమ్రతనూ జుని వస్త్రహీనుగా
మరియును జేయనేల సుకుమార కుమారుని కుగ్గుబెట్టకన్
జరుపుటయే ల నిన్ను గనజాలరు నిర్జర మౌని సంగముల్
దొరకదు నీ మహా మహిమ దోచదయా శరభాంక లింగమా !!
ఈ పద్యం పాలకుర్తి సోమనాథుని సమకాలీనుడైన శరభాంకుడు రచించిన ‘శరభాంక లింగమా’ అనే శతకం లోనిది 12-13వ శతాబ్దానికి చెందిన ఈ కవి ఓరుగల్లు ప్రాంతానికి చెందినవారు. శరభాంకుడు తన పేరులోని ‘శరభాంక’ను తను ఆరాధించే శివునికి అన్వయించి ‘శరభాంక లింగమా!’ అని ఆత్మీయంగా సంబోధించుకున్నాడు. నరసింహస్వామి ఉగ్రతను శాంతింపజేయడానికి శివుడు ఎత్తిన అవతారమే శరభేశ్వరుడు (పక్షి, మృగం, మానవ రూపాల సమ్మేళనం). వీరశైవ ప్రతీకగా కొందరు దీనిని భావిస్తారు. అంత ప్రాచీన కాలంలోనే చిత్తశుద్ధి లేని పూజలను, మంత్ర తంత్రాలను, మూఢ నమ్మకాలను నిరసించిన కవిగా శరభాంకుడు మనకు కనిపిస్తాడు.
‘శరభాంక లింగమా! దేవతలు, మునుల సమూహాలు కూడా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేవు. నీ గొప్ప మహిమ ఎవరికీ దొరకదు, తోచదు. నీ లీలలు ఎంత విచిత్రమైనవో కదా! తిరిపెము (భిక్షాటన) లెత్తడం ఎందుకు? నీ పెద్ద కుమారుడైన, సకల గుణవంతుడు, ధీరుడైన వినాయకుడికి పెండ్లి చేయకుండా ఎందుకు ఉన్నావు? నీ రెండో కుమారుడైన కుమారస్వామిని (ధూమ్ర తనూజుడు) దుస్తులు కూడా లేకుండా దిగంబరుడిగా ఎందుకు ఉంచావు? అలాగే, ఆ సుకుమారుడైన చిన్న కుమారుడికి కనీసం ఉగ్గు కూడా పోయకుండా అలా కాలం ఎలా వెళ్లదీస్తున్నావు? సాక్షాత్తు ముల్లోకాలకూ అధిపతివైన నీవు నీ పిల్లల విషయంలో ఎందుకీ విచిత్రమైన లీలలు ప్రదర్శిస్తున్నావో! నీ అపారమైన మహిమ ఎలాంటిదో ఆ దేవతలకు, గొప్ప మునులకు కూడా అర్థం కావడం లేదు’ అంటూ వ్యాజస్తుతిలో శంకరుణ్ని స్తుతిస్తున్నాడు.
సంసార రహితుడైన ఈశ్వరుడి తాత్త్వికత తెలియజెప్పడం కవి ఉద్దేశం కావచ్చు. జననానంతరం కుమారస్వామికి పాలు పట్టింది కృత్తికలు కాబట్టి శంకరుని ఇలా నిందించవచ్చు. అలాగే అన్న వినాయకునితో జ్ఞాన పోటీలో పరాజయం పొందిన తరువాత కుమార స్వామి వస్ర్తాలు, ఆభరణాలు త్యజించి కౌపీనం ధరించి జ్ఞాన వైరాగ్యమూర్తిగా పళని కొండపై వెలిశాడన్న పురాణ కథను ఈ సందర్భంగా కవి ప్రస్తావించాడేమో!!
-చేపూరి శ్రీరాం, హన్మకొండ