సిటీబ్యూరో: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యంపై బీఆర్ఎస్ కొన్ని రోజులుగా గర్జిస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నది. ప్రజల గొంతుకై పోరాడుతున్నది. అందులో భాగంగానే ఆదివారం నగరంలోని నియోజకవర్గాల వారీగా ఆటో, క్యాబ్, లారీ, వ్యాన్ తదితర వాహన సంఘాల డ్రైవర్లందరూ పెద్ద ఎత్తున నిరసన తెలుపనున్నారు. నియోజకవర్గాల వారీగా ఆటో ర్యాలీలు ఉండనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేండ్లు సమీపిస్తున్నా డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వాపోయారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ ఆటో, క్యాబ్,లారీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందర మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు దాని ఊసేలేదని చెప్పారు. ఉచిత బస్సు ప్రవేశపెట్టి ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధి దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటక ట్రిప్లు, గిరాకీ లేక వాహనాల ఈఎంఐలు చెల్లించలేక వాపోతున్నట్టు పేర్కొన్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పించినప్పటికీ డ్రైవర్ల గురించి కూడా ఆలోచించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. అసెంబ్లీలో సైతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు.