సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హౌసింగ్ బోర్డు లాటరీ విధానం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన అర్హులలో ఏరివేత మొదలుపెట్టింది. దరఖాస్తుదారుల నుంచి లాటరీ ద్వారా అర్హుల గుర్తింపు పూర్తయిన వెంటనే అందులో నుంచి స్థానికత ఆధారంగా ఏరివేతను చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో పదేండ్ల నుంచి నివసించే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి వారిలో లాటరీ ద్వారా కొంతమందిని ఎంపిక చేశారు.
ఎంపికైన వారిలోనూ అందరూ ప్రస్తుతం అదే ప్రాంతాల్లో ఉంటున్నారా? లేదా వేరే ప్రాంతాల్లో ఉంటున్నారా? అని క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేస్తున్నారు. దరఖాస్తుదారుల చిరునామాల ఆధారంగా ఇండ్లకు వెళ్తున్నారు. అధికారులు వెళ్లినప్పుడు లబ్ధిదారులు ఆ చిరునామాలో లేకుంటే వెంటనే అనర్హులుగా గుర్తిస్తున్నట్లు తెలుస్తున్నది. అధికారులు వచ్చినప్పుడు ఇండ్లలేని వారి పరిస్థితి ఏంటనే అంశంపై స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే దరఖాస్తులో తాము ఉన్న నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇండ్లకే దరఖాస్తు చేసుకున్నా మళ్లీ క్షేత్రస్థాయి తనిఖీలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదనే ఆందోళనలో ఉన్నారు. లాటరీ ద్వారా అర్హత పొందినా అధికారులు కుంటిసాకులు చూపి ఇండ్లను తమకు రాకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట వివిధ దశల్లో వడపోత చేపడుతూ అర్హుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
అన్ని అర్హుతలు ఉంటేనే తొలుత లాటరీకి ఎంపిక చేసి.. ఇప్పుడు క్షేత్రస్థాయి తనిఖీల పేరిట తమకు ఇచ్చిన ఇండ్లను లాగేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు. మీసేవలో దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రస్తుతం నివాసముంటున్న వివరాలు నమోదు చేశాక మళ్లీ క్షేత్రస్థాయి తనిఖీలు దేనికోసమని ప్రశ్నిస్తున్నారు. లాటరీలో ఇండ్లు వచ్చినట్టు ఆశచూపి ఇప్పుడు వెనక్కి తీసుకునేందుకే తనిఖీల పేరిట డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుల్లోనే అర్హులను ఇబ్బందులకు గురిచేస్తుంటే.. నగరంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తిచేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
లాటరీలకు ముందు చాలా మంది అర్హులను కారు, ఇల్లు లేకున్నా ఉందంటూ అనర్హులుగా ప్రకటించారు. ఇప్పుడు లాటరీలో ఇల్లు పొందినా స్థానికత పేరిట తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అధికారులు తమ చిరునామాలకు వచ్చినప్పుడు ఇండ్లలో లేకుంటే అనర్హులుగా గుర్తిస్తారా? గత పదేండ్లుగా సంబంధిత నియోజకవర్గంలో ఉండి ఈరెండు మూడు రోజుల్లో ఇల్లు మారితే వచ్చిన ఇల్లును వెనక్కి తీసుకుంటారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.