తమిళ, తెలుగు భాషల్లో హిట్ చిత్రంగా నిలిచిన ‘సర్దార్’కు సీక్వెల్‌గా రూపొందిన ‘సర్దార్-2’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. కార్తి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. ఈ సందర్భంగా శనివారం హీరో కార్తి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ దర్శకుడు ‘సర్దార్’ కథ చెబుతూ..లుంగీ ధరించిన గూఢచారి అని చెప్పినప్పుడు వెంటనే కనెక్ట్ అయ్యాను.
తాగే నీళ్లు వ్యాపారం కాకూడదని ఓ గూఢచారి చేసిన పోరాటంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సీక్వెల్లో చర్చించిన పాయింట్ తొలిభాగం కంటే పదిరెట్లు ప్రభావవంతంగా ఉంటుంది. ‘సర్దార్’ మళ్లీ ఎందుకు తిరిగొచ్చాడనే గొప్ప ఆలోచనతో దర్శకుడు సీక్వెల్ కథను తీర్చిదిద్దాడు. ఆరంభం నుంచి ముగింపు వరకు అద్భుతమైన యాక్షన్ ఘట్టాలుంటాయి. ఇందులో నేను తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తా. ఇద్దరూ కలిసే ప్రయాణం చేస్తారు. రెండు పాత్రలు ఒకేసారి చేయడం సవాలుగా అనిపించింది.
‘సర్దార్’ రిలీజ్ తర్వాత నేను ఓ చోటుకి షూటింగ్‌కు వెళ్లాను. అప్పుడు ఓ ముగ్గురు విద్యార్థులు నా కారు వెనక వస్తూ ‘వాటర్‌బాటిల్ ప్లాంట్స్‌ని మా ఊళ్లోకి రానివ్వం సర్’ అంటూ గట్టిగా అరిచారు. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. సినిమాలోని సందేశం స్కూల్ పిల్లలకు కూడా చేరువకావడం ఆనందంగా అనిపించింది. ప్రస్తుతం తెలుగులో ‘హిట్-4’ చేస్తున్నా. ‘మార్షల్’ సినిమా యాభైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది’ అన్నారు.