న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఉక్రెయిన్‌పై దాడులను శనివారం నుంచి మూడు రోజులపాటు నిలిపివేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే యత్నాలను పునరుద్ధరించే లక్ష్యంతో జరిపే చర్చల కోసం అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కో సందర్శన ఏర్పాట్ల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కొత్తగా దౌత్యపరమైన చర్చలకు అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో శనివారం ఇద్దరు అమెరికన్ ప్రతినిధులతో పుతిన్ సమావేశం కానున్నట్టు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి ప్కెవ్ పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్థలు తెలిపాయి.
ఉక్రెయిన్ యుద్ధంపై చర్చల కోసం విట్కాఫ్, కుష్నర్ శనివారం మాస్కో చేరుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఐదవ సంవత్సరంలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో ఒక కొత్త నిర్దిష్టమైన ప్రతిపాదన తమ వద్ద ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతున్నది. ఆ ప్రణాళికకు సంబంధించిన వివరాలను ట్రంప్ వెల్లడించలేదు.
కానీ పురోగతి సాధించే అవకాశం ఉందో, లేదో తెలుసుకోవడానికి ఈ ఇద్దరు ప్రతినిదులను రష్యాకు పంపినట్టు చెప్పారు. చర్చల అనంతరం ఈ ఇద్దరు ప్రతినిధులు కీవ్‌కు ప్రయాణిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా వైమానిక దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన ప్రతిపాదించారు. చర్చలు సురక్షితంగా జరిగేందుకు రష్యా కూడా అదే విధంగా స్పందించాలని ఆయన కోరారు.