గుప్పెడు మట్టిని చేతిలోకి తీసుకుంటే ఏం చెబుతుంది? మట్టిలో పుట్టి, అందులోనే కలిసిపోయే మనిషి జీవితాన్ని సూచిస్తుంది! తినే ప్రతి మెతుకూ, వాడే ప్రతి ధాతువూ తన నుంచే వచ్చిందని గుర్తుచేస్తుంది. అంతేకాదు! అజాగ్రత్తగా ఉంటే సిరులు పండించే భూమి కాస్తా బీడువారిపోతుందని హెచ్చరిస్తుంది. ఆ మాట వినే విచక్షణ అందుకోకపోతే.. విపత్తుకి సిద్ధంగా ఉండాల్సిందే! ప్రతి సమస్యకీ యంత్రమే పరిష్కారం అనుకుని మురిసిపోతే.. ప్లాస్టిక్ బియ్యంతో కడుపు నింపుకోవాల్సిన రోజులను చూడాల్సిందే!
మనం రోజూ కాలుష్యం పెరుగుతున్న ఆకాశాన్నీ, విషపూరితం అవుతున్న గాలినీ, నాణ్యత తగ్గిపోతున్న ఆహారాన్నీ తలుచుకుంటున్నాం! కానీ, మన కాళ్ల కింద నేల కూడా మన చేతలకు బాధితురాలే అని మర్చిపోతున్నాం. దీనికి ఏదో ఒక చర్య మాత్రమే కారణం కాదు. దురదృష్టం ఏమిటంటే.. ఏ కారణాలైతే భూసారాన్ని, మట్టి నాణ్యతని తగ్గిస్తున్నాయో.. అవన్నీ కూడా మనకు తెలిసినవే! చాలావరకు మన చేతలే! కాకపోతే, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంది. చిన్నపాటి జాగ్రత్తలతో తిరిగి భూసారాన్ని బలోపేతం చేయవచ్చు.
ఫలానా మొక్కను తింటే ఇన్ని ఖనిజాలు లభిస్తాయి. ఓ పండుని తింటే అద్భుతమైన పోషకాలు అందుతాయి అని వింటూనే ఉంటాం. నిజమే! కానీ, అదంతా ఆ మొక్కలే నేరుగా ఉత్పత్తి చేసుకుంటాయి అనుకోవడం భ్రమ. వాటిలో విటమిన్లను మాత్రమే అవి ఉత్పత్తి చేసుకుంటాయి. ఆ మొక్క బతికేందుకు, ఎదిగేందుకు, తగిన పోషకాలను ఉత్పత్తి చేసుకునేందుకు కావాల్సిన ఖనిజాలు, లవణాలు దాదాపుగా నేల నుంచే అందుతాయి. మరి మట్టిలోకి అన్ని ఖనిజాలు ఎలా కలుస్తున్నాయనేది ఆసక్తికరం. దానికి చాలా కారణాలే ఉన్నాయి.
రాళ్లు కరిగి : మట్టిలో ఉండే పొటాషియం, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం లాంటి ఎన్నో ఖనిజాలకు మూలం రాళ్లే. ఒక రాయి మట్టిలో కరుగుతూ దానిలోని ఖనిజాలు భూమిలో కలవడం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. ఎండల వల్ల బీటలువారుతూ, గాలితో కొట్టుకుపోతూ, వర్షంలో కరుగుతూ, రసాయన చర్యల వల్ల నేలలో కలుస్తూ ఉన్న ఆ అవశేషాల చుట్టూ అల్లుకునే వేళ్లు వాటిలోని ఖనిజాలను గ్రహిస్తాయి.
ప్రాణం పోసుకుని : ఎండిన ఆకులు, కళేబరాలు, సూక్ష్మజీవులు అన్నీ కుళ్లిపోతూ తమలో ఉన్న ఖనిజాలను తిరిగి మట్టికే ఇస్తాయి. మరో జీవికి సాయపడతాయి.
వ్యర్థం కాదు : పశువులు తిరిగిన నేల చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. కారణం వాటి వ్యర్థాలతో కలిసిన అక్కడి నేల మరింత సారవంతం కావడమే. మట్టిలో కనిపించే నత్రజని, ఫాస్పరస్ లాంటి పోషకాల మూలం ఈ వ్యర్థాలే.
గాలినీ మార్చుకుని : గాలిలో ఉండే ఆక్సిజన్ లాంటి వాయువులు ఎలాగూ నేలలో కలుస్తాయి. వాటితో పాటు మట్టిలో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా గాలిలో ఉండే నత్రజని వాయువును మొక్కలకు ఉపయోగపడేలా మారుస్తాయి.
వానావరదా : వర్షపు నీటి ద్వారా, మనం మొక్కలకు పోసే నీటి ద్వారా, వరదలో కొట్టుకువచ్చే ఖనిజాల ద్వారా.. మట్టి మరింత సారవంతం అవుతుంది.

FAO సంస్థ అంచనా ప్రకారం దాదాపు మూడో వంతు వ్యవసాయ భూమిలో సారం ప్రమాదకరమైన స్థాయికి పడిపోయింది. ఇలా భూసారం తగ్గిపోయిన ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా ఏకంగా 170 కోట్లు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి మన వ్యవసాయ భూముల్లో 90-95 శాతం సారాన్ని కోల్పోతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకు కారణాలేంటో గమనిస్తే పొరపాటు ఎక్కడ ఉందో తేలిపోతుంది.
హద్దులు దాటిన సేద్యం: రోజురోజుకీ జనాభా పెరిగిపోతున్నది. గత శతాబ్దంలోనే మన దేశ జనాభా అయిదు రెట్లయింది. అందుకు తగ్గ ఆహారాన్ని పండించాలంటే మరిన్ని భూముల్లో, మరింత ఉధృతంగా సేద్యం తప్పదు మరి. ఈ ఉద్దేశంతో మొదలైన హరిత విప్లవం, ఎరువుల వాడకం, ఆధునిక పరికరాలు అనుకున్న లక్ష్యాలను సాధించాయి. 1950లో మన ఆహార ధాన్యాల దిగుబడి కేవలం 51 మిలియన్ టన్నులైతే, 2025 నాటికి అది 360 మిలియన్ టన్నులను దాటింది. కానీ ఈ విస్తృత సేద్యం వల్ల నానాటికీ భూమిలో సారం పలచబడిపోతున్నది.
దిశ లేని దశ: ఓ పంట పండాక తిరిగి సారాన్ని పుంజుకునేందుకు నేలకు తగినంత సమయాన్ని ఇవ్వాలి. పై పొరను తిరగతోడుతూ, సేంద్రియ ఎరువును కలుపుతూ దానికి సత్తువను అందించాలి. ఓ నేల ఎలాంటి పంటకు అనువో తెలుసుకునేందుకు మట్టిని పరీక్షించాలి. పాటించి తీరాల్సిన ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మార్కెట్లో గిరాకీ ఉన్న పంటను (mono cropping) పదేపదే పండించే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది. దానివల్ల కొన్నిరకాల పోషకాలు త్వరగా క్షీణించిపోతాయి. నేల కూడా నీటిని సైతం నిలపలేనంతగా పొడిబారిపోతుంది.
ఎరువుల అరువు: నత్రజని, ఫాస్ఫరస్, జింక్, ఇనుము, సల్ఫర్, పొటాషియం, మాంగనీస్… ఓ మొక్క ఎదిగేందుకు ఇలాంటి చాలా ఖనిజాలు అవసరపడతాయి. ఒకప్పుడు వాటిని సేంద్రియ ఎరువుల ద్వారా భర్తీ చేసేవాళ్లు. ఇప్పుడలా కాదు. మార్కెట్లో దొరికే ఆ రసాయనాలన్నిటినీ ఎడాపెడా చల్లుతున్నారు. చాలా సందర్భాలలో తాము పండించే పంటకు ఎలాంటి ఖనిజాలు కావాలి? అవి అప్పటికే అక్కడి నేలలో ఏమేరకు ఉన్నాయి? అనే పరీక్ష కూడా జరగడం లేదు. ఉదాహరణకు నత్రజని చల్లితే పంట ఏపుగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అప్పటికే నేలలో అది తగినంత ఉండవచ్చు. అధికంగా పేరుకుపోయే రసాయనాలు నేలలో సమతుల్యతను దెబ్బతీయడంతో పాటు సూక్ష్మజీవులను కూడా చంపేస్తాయి. నీటి కాలుష్యానికీ దారితీస్తాయి.
మందులా కాకుండా: సైన్స్ డైరక్ట్ అనే పరిశోధనా పత్రం ప్రకారం.. 2022లో మన దేశం 61 వేల టన్నుల పురుగు మందులను వాడింది. చైనా, బ్రెజిల్ లాంటి దేశాలతో పోలిస్తే ఈ వాడకం చాలా తక్కువే. కానీ, సాధారణం మాత్రం కాదు. మనిషికి యాంటీ బయాటిక్స్ లాగా.. ఓ చివరి ఎంపికలా వాడాల్సిన పురుగు మందులను ప్రతి చిన్న సమస్యకీ గురిపెట్టడం అలవాటుగా మారింది. మన పూర్వికులు వేప నుంచి పొగాకు వరకూ ఎన్నో సేంద్రియ పురుగు మందులతో సమర్థంగా పంటలు పండించారు. ఇప్పటి పెస్టిసైడ్స్‌తో ఏకంగా మనుషుల హార్మోన్లే దెబ్బతింటాయని తేలింది. ఇక వాటిని తట్టుకునే మట్టి సంగతి ఏం చెప్పగలం. అది మట్టిలో కాలుష్యం పెంచడమే కాకుండా.. ఓ మొక్క చుట్టూ ఉండే సంక్లిష్టమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది.
కళ్లలో దుమ్ము: వర్షపు నీటికో, గాలికో.. నేల పైపొర కొట్టుకుపోవడం గమనిస్తాం. ఇది కేవలం ధూళి మాత్రమే కాదు. ‘Top Soil’ గా పిల్చుకునే మట్టి పైభాగం. అది జారిపోగా మిగిలిన భాగం గట్టిగా ఉంటుంది కాబట్టి, అందులోకి నీరు ఇంకడం కష్టం. ఫలితం! నేల బీడువారిపోతుంది. సేద్యానికి శాపమవుతుంది. సారవంతమైన మట్టి కొట్టుకుపోవడానికి ప్రకృతి విపత్తులు మాత్రమే కారణం కాదు. ఓ ప్రాంతంలో ఉండే అడవులనీ, చెట్లనీ కొట్టిపారేసినప్పుడు వరద నీటినీ, సుడిగాలినీ తట్టుకునే రక్షణ మిగలదు.
ఫలితమే ఈ Soil Erosion.
ఇవే కాదు! కాలుష్యంతో నిండిపోయిన నీరు మట్టిలో కలవడం, సేద్యానికి ఉపయోగిస్తున్న భారీ వాహనాలు, పశువ్యర్థాలను పొలానికి దూరంగా ఉంచడం… లాంటి మరిన్ని సందర్భాలూ భూసారం తగ్గిపోవడానికి కారణం
అవుతున్నాయి.

నేలలో సారం తగ్గిపోవడం అంటే భూదేవికి స్తన్యం ఎండిపోవడమే. ఏటా పదికోట్ల హెక్టార్ల నేల ఇలా ఉడిగిపోతోందని అంచనా. ఇందులో సంతోషించదగ్గ ఒకే ఒక్క విషయం.. ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉండటమే! పైన పేర్కొన్న ప్రతీ కారణానికీ ఓ మార్గం ఉంది.
పంటలో వైవిధ్యం: ఒకటే పంటతో దానికి ప్రత్యేకంగా అవసరమయ్యే ఖనిజాలు అడుగంటిపోవడమే కాదు, ఆ పంటలు చీడపీడల్ని త్వరగా ఆకర్షిస్తాయి. పొలంలో ఉండే జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతర్ పంటలు వేయడం, ఏడాది తర్వాత ఏడాది పంట మార్పిడి ద్వారా మట్టిని కాపాడుకోవచ్చు.
నేల కోత పడకుండా: ప్రధాన పంట లేనప్పుడు జనుము, పెసర, పప్పు ధాన్యాలు, జీలుగ లాంటి మొక్కలు పెంచితే అదనపు రాబడితో పాటు నేల కోతను ఆపొచ్చు. అంతేకాదు కలుపును అడ్డుకునేందుకు, మట్టిలో తేమని పట్టి ఉంచేందుకు, మట్టిలో నత్రజనిలాంటి పోషకాలు బలపడేందుకు ఇది సాయపడుతుంది. దీంతోపాటుగా మల్చింగ్, కౌంటర్ ఫార్మింగ్ లాంటి ప్రక్రియలూ ఉన్నాయి. పంటల చుట్టూ రంపపు పొట్టు, ప్లాస్టిక్ కవర్ల లాంటివాటితో కప్పుతారు. పొలంలో జారుడుగా ఉన్న అంచుల్లో, మట్టి జారిపోకుండా చెట్లు నాటడమే కౌంటర్ ఫార్మింగ్.
రసాయనాలకి బదులు: కొత్తగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఈ సూచన రోజూ వింటున్నదే. కృత్రిమ ఎరువులకి బదులు సేంద్రియ పదార్థాలు వాడటమే. అలాగే చీడపీడల్ని తట్టుకునే విత్తనాలని వాడవచ్చు. చీడపీడలకు సహజమైన శత్రువులని ఉపయోగించడాన్ని జీవనియంత్రణ అంటారు (Biological control). విత్తన శుద్ధి, పంటమార్పిడి లాంటి విధానాలూ ఉన్నాయి. సందర్భం ఏదైనా రసాయనాలని వాడటం వీలైనంత తక్కువగా, అరుదుగా వాడటమే చిట్కా.
యంత్రాలతో భద్రం: కాలం మారుతున్న మాట నిజమే! సాగు కోసం యంత్రాలు తప్పనిసరి అయిన సందర్భం ఇది. కానీ భారీ యంత్రాలు.. అందులోనూ తడి మట్టి మీద నడిస్తే, అది గట్టిపడిపోతుంది. యంత్రాలు ఎక్కడ, ఏ సందర్భంలో, ఎలాంటి నేల మీద వాడుతున్నాం అనే ఎరుక కూడా అవసరం.
ప్రభుత్వం సేద్యం మీదా, రైతుల సంక్షేమం కోసం లక్షల కోట్లు ఖర్చుపెడుతున్నది. వారికి సాయంగా ఉండే ప్రతి సాంకేతికతకీ, మౌలిక వసతులకీ అండగా నిలుస్తున్నది. ఉదాహరణకు National Bureau of Soil Survey and Land Use Planning సంస్థ ఇప్పటికే మన దేశంలోని ప్రతి హెక్టారులో ఉన్న వ్యవసాయ భూమి తీరును మ్యాప్ చేసింది. ఇలాంటి సమాచారం అంతా క్షేత్రస్థాయిలో ఉన్న రైతులకు, అధికారులకు చేరితీరాలి. అలాగని దీన్ని కేవలం వారి బాధ్యతగా వదిలేయకూడదు. కాస్త చదువు, సేవ ఇక్కడ అవసరం. గ్రామాల్లో ఉన్న యువత, స్వచ్ఛంద సంస్థలు అందుకు ఉపయోగపడతాయి. మట్టి గురించి తెలిసిన మనలో ప్రతి ఒక్కరికీ, దాని గురించి అవగాహన కల్పించాల్సిన, సందర్భం కనిపించినప్పుడు సాంకేతికంగా సాయపడాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఉంది.

చెట్లు వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ వాయువును పీల్చుకుంటాయని తెలుసు. వీటిలో కొంత భాగం నేలలోకి వెళ్తుంది. అలాగే మట్టిలో ఉండే బ్యాక్టీరియా కొంత బొగ్గుపులుసు వాయువును ఉత్పత్తి చేస్తుంది. సేంద్రియ ఎరువులు, ఎండిన పదార్థాలు మరికొంత కర్బనాన్ని నేలలోకి చేరుస్తాయి. మట్టిలో ఉండే ఈ CO2 ని కార్బన్ స్టాక్‌గా పేర్కొంటారు. ఇది మొక్కలు ఎదిగేందుకు సాయపడటమే కాకుండా… మట్టి జారిపోకుండా (soil erosion) ఉండేందుకు, తేమను నిలిపేందుకు, తగినంత నత్రజని మొక్కలకు అందేందుకు ఉపయోగపడుతుంది. ఒక ప్రదేశంలో (ఉదా: నేలలో) దాగిన కార్బన్ డయాక్సైడ్ను కార్బన్ స్టాక్ అంటారు.
అవి సందర్భాన్ని బట్టి వాతావరణంలో తిరిగి కలుస్తూ ఉంటాయి. అయితే దట్టమైన అడవులు, సముద్రాలు, చిత్తడి నేలల్లాంటి చోట్ల… వాతావరణంలోకి విడుదల అయ్యే కర్బనం కంటే, అక్కడే ఉండిపోయే CO2నే ఎక్కువగా ఉంటుంది. వీటిని కార్బన్ సింక్ అంటారు. ఇవి ప్రకృతిని కాపాడతాయి. అడవుల నరికివేత, సముద్ర కాలుష్యం వల్ల ఈ కార్బన్ సింక్ చేజారిపోతున్నది. వాతావరణంలో CO2 పెరిగిపోతున్నది. నేల మీద వేడి అధికమై, వాతావరణం తలకిందులవుతున్న గ్రీన్ హౌస్ ప్రభావానికి ఈ కార్బన్ సింక్ వినాశనం ఓ ముఖ్య కారణం.
ఇప్పటికే 52 శాతం వ్యవసాయ భూముల్లో నేల దెబ్బతిని పోయిందంటూ సద్గురు ఓ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మట్టిలో కనీసం 3-6 శాతం వరకు జీవాన్ని (organic matter) పెంచాలనేది వీరి లక్ష్యం. తమ ఉద్యమం కనీసం నాలుగు వందల కోట్ల మందికి చేరాలని ప్రయత్నం. ఇందుకోసం స్వయంగా సద్గురునే 2022లో ఓ మోటర్ సైకిల్ యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా వంద రోజుల్లో 27 దేశాల గుండా 30 వేల కిలోమీటర్లు తిరిగారు. ప్రస్తుతం ఈ ఉద్యమంలో వెయ్యికి పైగా సంస్థలు భాగస్వాములయ్యాయనీ, 193 దేశాల్లో కార్యాచరణ మొదలైందనీ ఈషా ఫౌండేషన్ పేర్కొంటున్నది.
రైతుల అవగాహన కోసం ఒకప్పుడు చాలా ప్రచారం నిర్వహించేవారు. రేడియో కార్యక్రమాలు, ఊరూవాడా
అవగాహన శిబిరాలు, క్షేత్ర స్థాయి సందర్శన, పేపరు ప్రకటనలు చాలా కనిపించేవి. కానీ, మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచారాన్ని, సాయాన్ని అందుకునే బాధ్యత రైతు మీదే పడింది. దేశంలో చాలామంది రైతులు ఇంకా సాంకేతికత అలవాటు లేని తరంవారే అని గుర్తించి, వారి అవగాహన కోసం మరింత సమాచారాన్ని దగ్గర చేయాలి.
1. ప్రభుత్వం ఇప్పటికే Soil Health Cards లాంటి మార్గాల్లో భూసారాన్ని పరీక్షించేందుకు తగిన సాయం చేస్తున్నది. ప్రతి రైతూ వీటిని తప్పనిసరిగా ఉపయోగించుకునేలా వారికి దగ్గర చేయాలి.
2. గిరాకీ ఉన్న పంటలే వేయడం, ఒక్కటే పంట ఏళ్ల తరబడి పండించడాన్ని తగ్గించేలా అవగాహన కల్పించాలి.
3. సేద్యంలో కొంతశాతం కచ్చితంగా సేంద్రియ ఎరువులు,జీవామృతం లాంటి పురుగు మందులే వాడేలా నిబంధనలు రావాలి.
4. అడవుల్ని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం వల్ల.. వాటి ప్రయోజనం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. వేల మైళ్ల వరకూ ఆ ప్రభావం ఉంటుంది.
5. ప్రభుత్వం ఎప్పటికప్పుడు హానికారకమైన రసాయనాల మీద చర్యలు తీసుకుంటున్నది. కానీ ఇవి సరిపోవడం లేదు. ఇంతలోనే వచ్చిన ఓ కొత్త రసాయనం, సరికొత్త నష్టాలను మోసుకొస్తుంది. అందుకని మార్కెట్లోకి రాబోయే పురుగుమందుల మీద కఠినమైన నిఘా ఉండాలి. వాటి వాడకం మీద కచ్చితమైన పరిమితులూ ఉండాలి.

కాలుష్యానికి వ్యతిరేకంగా, సంప్రదాయ వనరులకు అనుకూలంగా చాలా సంస్థలే పని చేస్తున్నాయి. కానీ, ప్రత్యేకించి మట్టి మీద దృష్టి పెట్టిన సంస్థలు తక్కువే. కానీ, ఆ అరుదైన సంస్థలే అద్భుతాలు సాధిస్తున్నాయి. మన దేశంలో పనిచేస్తున్న
అలాంటి కొన్ని సంస్థలు..
BAIF: మహారాష్ట్ర కేంద్రంగా దాదాపు ఆరువేలమంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ భూసారాన్ని పెంచడంలో కృషి చేస్తున్నది. ఏకంగా మూడున్నర లక్షల హెక్టార్లలో రైతులకు భూసారాన్ని పెంచడంలో ప్రత్యక్షంగా సాయపడింది. BAIF భూసారాన్ని పెంచిన చోట 30-40 శాతం అధిక దిగుబడి కనిపించింది.
WOTR: తెలంగాణ సహా పది రాష్ర్టాల్లో పనిచేస్తున్న ఈ సంస్థ ఎక్కడికక్కడ నీటిని ఒడిసిపట్టుకోవడం, పంటలను ప్రణాళికా బద్ధంగా సాగు చేయడంలో సాయపడుతున్నది. ఓ ప్రత్యేక యాప్ ద్వారా రైతులకు కావాల్సిన సూచనలు ఇవ్వడమే కాకుండా వారి ఉత్పత్తులు విపణిలోకి వెళ్లేందుకు కూడా అండగా నిలుస్తున్నది. దాదాపు 25 లక్షల హెక్టార్లలో వ్యవసాయాన్ని క్రమబద్ధీ కరించినట్టు సంస్థ చెబుతున్నది.
Deccan Development Society (DDS): తెలంగాణకు చెందిన ఈ సంస్థ నాలుగు దశాబ్దాలకు పైగా ఇటు సేద్యానికీ అటు చిన్నరైతులకీ అండగా నిలుస్తున్నది. తన లక్ష్యంలో దళిత బిడ్డలకు ప్రాధాన్యమిస్తున్నది. బోరుల మీదా, రసాయనాల మీదా ఆధారపడకుండా సంప్రదాయిక పద్ధతులు, విత్తనాలను ఉపయోగించి భూసారాన్ని కాపాడుతున్నది. అనూహ్యమైన దిగుబడినీ అందిస్తున్నది. సేంద్రియ సాగు ఆధారంగా రూపొందించిన Permaculture అనే విధానాన్ని ప్రచారం చేస్తూ జీవవైవిధ్యానికి పాటుపడుతున్నది.
ఇవే కాదు Timbaktu Collective, Foundation for Ecological Security, WASSAN.. ఇలా చాలా సంస్థలు నిశబ్దంగా నేలతల్లికి భరోసాగా నిలిచే కృషి చేస్తున్నాయి.
– కె.ఎల్.సూర్య