ఇల్లు కట్టాలంటే సిమెంటు, ఇసుక, ఇటుకలు వగైరా నిర్మాణ సామగ్రి కావాలి. కానీ, అమెరికాకు చెందిన ఓ బామ్మ మాత్రం పనికిరాని ప్లాస్టిక్ బాటిల్స్‌తో ఏకంగా 16 ఇండ్లు నిర్మించింది. ఇంతకీ, ఆ ‘బాటిల్స్ విలేజ్’ సంగతులేమిటో చూద్దామా..
ఆ బామ్మ పేరు ట్రెస్సా ప్రిస్బే. అమెరికా, క్యాలిఫోర్నియా సమీపంలోని సిమీవ్యాలీ సొంతూరు. బామ్మకు చిన్నప్పటినుంచీ పెన్సిళ్లు, బొమ్మలు సేకరించడం సరదా. అలా పోగేసిన పెన్సిళ్ల సంఖ్య అక్షరాలా 17 వేలు. 1896లో మిన్నెసోటాలో పుట్టిన ఈ బామ్మ పన్నెండేండ్లకే చదువు మానేసింది. 15వ ఏట పెండ్లి చేసుకుంది. ఆరుగురు పిల్లలు. అయితే, 1946లో భర్త గ్రినోల్డ్స్ చనిపోవడంతో పిల్లలతోపాటు క్యాలిఫోర్నియాకు వచ్చి ఓ ఇల్లు కట్టుకుంది. కానీ ఆ ఇల్లేమో చిన్నది. చిన్నప్పటినుంచీ ఇష్టంగా సేకరించిన పెన్సిళ్లు పెట్టేందుకు సరిపడా స్థలం లేదు. దీంతో, ఏం చేయాలా అని ఆలోచించి దగ్గర్లోని డంపింగ్ యార్డ్‌లో వృథాగా పడున్న గాజు సీసాలు, ప్లాస్టిక్ వస్తువులు తెచ్చి, వాటితో స్వయంగా తానే ఓ ఇల్లు కట్టేసింది. అలా మొదలుపెట్టి తనకున్న ఎకరం స్థలంలో 16 ఇండ్లను నిర్మించింది. వాటిని చూసిన వాళ్లంతా ‘గ్రాండ్మా ప్రిస్బ్రేస్ బాటిల్ విలేజ్’ అని ముద్దుగా పిలిచేవారు. 1988లో బామ్మ చనిపోయిన తర్వాత, ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించి చారిత్రక కట్టడాల జాబితాలో చేర్చింది ప్రభుత్వం.