కళతో సామాజిక మార్పు సాధ్యమే అంటారు హైదరాబాద్కు చెందిన ఆర్టిస్ట్ వరుణిక సరాఫ్. తన చిత్రకళకు వన్నెలు దిద్దడానికి వస్లి అనే ప్రత్యేకమైన కాగితాన్ని ఎంచుకోవడం ఆమె వైవిధ్యత. మొఘల్ కాలం నాటి ఈ విధానంలో కాగితం మీద కాగితం ఉంచి కళను ఆవిష్కరిస్తారు. వరుణిక చిత్తరువులు మంచి పేరే తెచ్చుకున్నాయి. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 11వ ఆసియా పసిఫిక్ ట్రయానియల్లో ప్రదర్శనకు నోచుకున్నాయి. ‘స్కై సెట్ అబ్లేజ్’, ‘ఇట్ రెయిన్డ్ దిస్ వింటర్’ చిత్రాలు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
‘స్కై సెట్ అబ్లేజ్’లో కొవిడ్ సమయంలో తన భావనలను చిత్రించే ప్రయత్నం చేశారు. మన పూర్వికులు ఆకాశంలో కనిపించే సూచనలను, నేల మీద అరిష్టాలకు చిహ్నంగా ఎలా భావించారో అనే ఊహ ఆధారంగా దీన్ని రూపొందించారు. ‘ప్రస్తుతం సమాజంలో హింస పెరిగిపోతున్నది. అది సహజం అనుకునే ధోరణీ పెరుగుతున్నది. అందరూ తమ కండ్ల ముందు జరిగే సంఘటనలను చూడటమే కానీ, స్పందించడం మానేశారు. ఈ పరిస్థితి మారాలంటే, మనుషులలో స్పందన పెరగాలంటే చిత్రకళ ఓ మంచి మాధ్యమం అంటారు’ వరుణిక.