‘ఉమ్మడి కుటుంబం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ ముద్దుగుమ్మ సాక్షి. తన అసలు పేరుతో కన్నా ‘ఉమ్మడి కుటుంబం’ శరణ్యగానే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించింది. చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ పెంచుకుని దాన్నే వృత్తిగా ఎంచుకుంది. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా తానేంటో నిరూపించుకోవాలని భావిస్తున్న సాక్షి జిందగీతో పంచుకున్న ముచ్చట్లు..
మాది కర్ణాటకలోని గుల్బర్గా. నేను పుట్టింది, పెరిగింది అక్కడే. అమ్మ గృహిణి, నాన్న వ్యాపారి. తమ్ముడు, చెల్లి ఉన్నారు. ఇంట్లో నేనే పెద్దదాన్ని కావడంతో కాస్త గారాబం ఎక్కువ. చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇష్టం. స్కూల్ డేస్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. కాలేజీ రోజుల్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. నా రీల్స్ చూసి చాలామంది సీరియల్స్ వాళ్లు నన్ను సంప్రదించారు. నాకే కాస్త సమయం తీసుకోవాలనిపించింది. కొన్నాళ్లు వెయిట్ చేసిన తర్వాత జీ తెలుగు నుంచి ‘ఉమ్మడి కుటుంబం’ సీరియల్లో హీరోయిన్గా అవకాశం రావడంతో ఒప్పుకొన్నా. మొదట్లో తెలుగు రాదని కొంచెం భయపడ్డా! కానీ, నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని తర్వాత అర్థమైంది. ప్రస్తుతం తెలుగు బాగా అర్థం చేసుకోవడమే కాదు కొద్దిగా మాట్లాడగలుగుతున్నా.
‘ఉమ్మడి కుటుంబం’ సీరియల్లో నా పాత్ర చాలా సున్నితమైనది. మొదటి ప్రాజెక్టుకే ఇంత ఆదరణ రావడం సంతోషంగా ఉంది. నిజంగా తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం మాటల్లో చెప్పలేను. ఇక సెట్లో నేను తెలుగు రాకుండా ఇబ్బంది పడుతుంటే, సహనటులు ఎంతగానో ప్రోత్సహించారు. డైలాగులు నాకు అర్థమయ్యేలా చెప్పేవారు. ముఖ్యంగా సీరియల్ డైరెక్టర్ చాలా హెల్ప్ చేశారు. ఆయనకు కన్నడ రావడంతో.. ప్రతి సన్నివేశాన్నీ నా మాతృభాషలో వివరించేవారు. దాంతో నా పాత్రను పూర్తిగా అర్థం చేసుకొని నటించగలిగా! ఇప్పుడు తెలుగు బాగా అర్థమవుతున్నది. సీరియల్ చేస్తూనే చదువు కొనసాగిస్తున్నా! బీటెక్ ఫైనలియర్ చదువుతున్నా.
భిన్నమైన పాత్రలు పోషించాలనుకుంటున్నా. బబ్లీ క్యారెక్టర్లంటే ఇష్టం. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా పాటల పోటీల్లో పాల్గొన్నా, పలు అవార్డులు కూడా అందుకున్నా. సంగీతం నేర్చుకున్నా. హార్మోనియం, పియానో వాయిస్తాను. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఒత్తిడిగా అనిపించినప్పుడు పచ్చని పరిసరాల్లో గడపడానికి ఇష్టపడతాను. నాకు ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ చిక్మంగళూరు. ఇటీవల ఒక ఆన్‌గ్రౌండ్ ఈవెంట్ కోసం వెళ్లినప్పుడు చాలామంది నన్ను గుర్తుపట్టారు. నా పేరుతో కాకుండా సీరియల్లో నా పాత్ర పేరుతో పిలవడం చాలా కొత్తగా అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది నా పాత్ర గురించి తమ అభిప్రాయం చెబుతుంటారు. వాళ్లతో చాట్ చేయడానికి ఇష్టపడతా. సెట్లో నవీన, సుస్మిత, సౌజన్య గారు చాలా బాగా సపోర్ట్ చేస్తుంటారు. తెలుగులోనే ఇంకా అవకాశాలు వస్తున్నాయి! అయితే, ఒక ఏడాదిపాటు ఒకే ప్రాజెక్ట్‌పై ఫోకస్డ్గా ఉందామని వేరే ఆఫర్లు ఒప్పుకోవడం లేదు. సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. భవిష్యత్తులో మంచి పాత్రల్లో అవకాశం వస్తే తప్పకుండా సినిమాలు చేస్తాను.
– హరిణి