మనదేశంలో ఉద్యోగాల్లో లింగ వివక్ష ఇంకా కోరలు చాస్తూనే ఉన్నది. ముఖ్యంగా, ప్రైవేట్ రంగంలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రైవేట్ రంగంలోని ఎంట్రీ లెవల్ స్థాయుల్లో మహిళల వాటా మూడింట ఒకవంతు మాత్రమే ఉన్నదని మెకిన్సే అండ్ కంపెనీ ‘ఉమెన్ ఇన్ ద వర్క్‌ప్లేస్’ నివేదిక పేర్కొన్నది. ఇక మేనేజర్ స్థాయి పదవుల్లో వారి వాటా 24 శాతమేనని తెలిపింది. విశ్వవిద్యాలయం నుంచి పురుషులతో సమానంగా మహిళలు కూడా డిగ్రీలు పొందుతున్నారు. కానీ, ఉద్యోగాలు సాధించడం, ప్రమోషన్ల విషయంలో మాత్రం వెనకబడిపోతున్నారు. సర్వేలో భాగంగా.. భారత్‌తోపాటు నైజీరియా, కెన్యాలో దాదాపు 14 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న 324 సంస్థల నుంచి డేటా సేకరించారు. దీని ఆధారంగా నివేదిక రూపొందించారు. ఇందులో మనదేశం నుంచి 77 ప్రైవేట్ రంగ సంస్థలు, 9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సందర్భంగా.. భారతదేశంలో ఉద్యోగుల్లో లింగ అసమానత్వం ఏడేళ్ల వయసు తేడాతో మొదలవుతున్నదని సర్వే ప్రతినిధులు వెల్లడించారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారి సగటు వయసును తీసుకుంటే.. పురుషులు 32 ఏళ్లు ఉండగా, మహిళలు సగటున 39 ఏళ్లకు ఉద్యోగంలో చేరుతున్నారట.
అంటే చాలామంది మహిళలు అధికారిక ఉద్యోగాలను ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. అధ్యయనం చేసిన మూడు దేశాలలో ఇదే అతిపెద్ద అంతరం. అంతేకాకుండా, పదోన్నతిలోనూ ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతున్నట్లు వెల్లడైంది. పురుషులతో పోలిస్తే.. మహిళలు పదోన్నతి పొందే అవకాశం 2.4 రెట్లు తక్కువగా ఉంటున్నదని తేలింది. అదే సమయంలో పదవులను వదిలేయాల్సి వస్తే.. మహిళలే బాధితులుగా మిగులుతున్నారట. పురుషుల కన్నా 1.3 రెట్లు ఎక్కువగా మహిళలు ప్రమోషన్లను వదులుకుంటున్నారట. ఇక కెరీర్ ప్రారంభంలో వారి ప్రతిభ గుర్తింపునకు నోచుకోవడం లేదని సర్వే ప్రతినిధులు వెల్లడించారు. ఫలితంగా కేవలం 24శాతం మంది మహిళలు మాత్రమే మేనేజర్ స్థాయికి చేరుకుంటున్నారని వెల్లడించారు. అయితే, 2035 నాటికి మనదేశం 8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యాన్ని చేరాలంటే.. అధికారిక శ్రామిక శక్తిలో మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం ప్రమోషన్లు, ఇతర ప్రోత్సాహకాలతో వారి అభివృద్ధికి పునాది వేయాల్సిందేనని అంటున్నారు.