పాదయాత్ర, సైకిల్‌యాత్ర, మోటార్ సైకిల్ యాత్ర చేసేవాళ్లున్నారు. దేశమంతా చూసి రావడానికి ఇలా ఏదో ఒక యాత్రను ఎంచుకుంటూ ఉంటారు. ఆ యాత్రా విశేషాలను కథలుగా, కవితలుగా రాసేవారూ ఉన్నారు. ఈ యాత్రికుడు మాత్రం కళల విహారం చేశాడు. దేశమంతా తిరిగి.. మార్గంలో తన మనసు దోచిన అద్భుతమైన కట్టడాలను కాగితం మీద బంధించాడు. తనకు తారసపడిన అందమైన జీవితాలను బొమ్మల రూపంలో కళాత్మకంగా వర్ణించాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన కళాపిపాసి ఏల్పుల పోచం సాగించిన కళాయాత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..
మాది మంచిర్యాల జిల్లా చెన్నూరు. అమ్మానాన్న వ్యవసాయకూలీలు. చిన్నప్పుడు నా చేతి రాత బాగుంటుందని అందరూ అనేవారు. చాలా చక్కగా రాసేవాణ్ని. కానీ, నా చేతి గీత కూడా బాగుంటుందని మా డ్రాయింగ్ టీచర్ సత్యనారాయణ సార్ చెప్పేదాక నాకు తెలియదు. చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆయన.. ‘నీ రైటింగ్ బాగుంది.. ఆర్ట్ నేర్చుకో’ అన్నారు. ఆ మాట మీద బొమ్మలు గీయడం ప్రారంభించా. ‘బొమ్మలు చక్కగా గీస్తే.. బతుకుదెరువుకు లోటుండదు’ అన్న మా సార్ మాటలు బలంగా నమ్మాను. పదో తరగతి పూర్తయ్యాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేరాను. కాలేజీ ఒక్కపూటే ఉండేది. దాంతో మధ్యాహ్నం పూట సైన్ బోర్డులు రాసే సంకీర్తన ఆర్ట్స్‌లో చేరాను. అక్కడ రాజన్న అనే ఆర్టిస్ట్ దగ్గర రాయడం నేర్చుకున్నా. ఆయనే డిగ్రీలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు ఉంటుందని చెప్పాడు. అలా జేఎన్టీయూ, తెలుగు విశ్వవిద్యాలయం ఎంట్రెన్స్ రాశాను.
నాకు జేఎన్టీయూలో సీటొచ్చింది. ఫీజు ఆరు వేల రూపాయలు. ఫస్ట్ ఇయర్‌కు హాస్టల్ కూడా ఉండదన్నారు. దాంతో ఆ సీటు వదులుకున్నా. తెలుగు యూనివర్సిటీలో చేరాను. ఊరికి వెళ్లినప్పుడు ‘ఏం చదువుతున్నావ్’ అని అడిగేవాళ్లు. ‘బొమ్మల చదువు’ అని చెబితే.. ‘అరే.. బొమ్మలగ్గూడ సదువుంటదారా!’ అనేవాళ్లు. వీడికి పిచ్చి ముదిరింది అనుకునేవాళ్లు. ఆ మాటలకు మా ఇంట్లోవాళ్లు కూడా కాస్త అనుమానంగా చూసేవాళ్లు. మొత్తానికి బీఎఫ్ఏ పూర్తయింది. డబ్బుల కోసం ఓ ఏడాదంతా బడి గోడలకు రంగులు వేసే ప్రాజెక్ట్‌లో చేరాను. ఛత్తీస్‌గఢ్‌లో ఎంఎఫ్‌ఏలో సీటు వచ్చింది. అక్కడ కూడా పార్ట్‌టైమ్ పనులు చేస్తూ చదువుకున్నా. పీజీ పూర్తయ్యాక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆర్ట్ టీచర్‌గా చేరాను. ఆ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నాకు ప్రాక్టీస్ లేకుండా పోయింది. కళలో నాకంటూ ఓ ప్రత్యేక శైలిని అభివృద్ధి చేసుకోవాలన్నది నా కల. అందుకోసం ఉద్యోగం మానేశాను. దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ జనం ఎలా బతుకుతున్నారో చూడాలనుకున్నాను. కాగితాలు, రంగులు పట్టుకొని కళాయాత్ర మొదలుపెట్టాను.
లక్ష రూపాయలతో నా యాత్ర మొదలైంది. ముందుగా వారణాసికి వెళ్లాను. అక్కడినుంచి కళాయాత్రకు శ్రీకారం చుట్టాను. ధర్మశాలలు, సత్రాల్లో బస చేసేవాణ్ని. కాశీలో సత్రాల అరుగు మీద కూర్చుని.. అక్కడి గుళ్లూ, గోపురాల బొమ్మలు గీసేవాణ్ని. ప్రయాణంలో ఏది దొరికితే అది ఎక్కి వెళ్లేవాణ్ని. ఏది దొరికితే అది తినేవాణ్ని. పట్టణాలు, పల్లెలు, గిరిజన గూడేలు, ప్రాచీన ఆలయాలు, పురాతన కట్టడాలు ఇలా ఎన్నో ప్రాంతాలను సందర్శించాను. ఎక్కడికి వెళ్లినా.. అక్కడివారితో మాట్లాడతాను. వారి ఆచారాలు, ఆహార్య వ్యవహారాలు పరిశీలిస్తాను. మనసుకు నచ్చితే ఆ సన్నివేశాన్ని కాన్వాసుపై బొమ్మగా మలిచి.. అక్కడినుంచి మరో మజిలీకి బయల్దేరుతాను. నేను అనుకున్న మార్గమంతా తిరిగి రావడానికి ఐదు నెలల సమయం పట్టింది. అలా నా కళాయాత్ర మొదటి అంకం ముగిసింది. అప్పటికే నా దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చయ్యాయి.
ఎంత చూసినా తరగని గని భారతావని. మరో యాత్రకు శ్రీకారం చుట్టాలని భావించాను. హైదరాబాద్‌లో ట్యూషన్లు చెప్పి కొంత డబ్బు సమకూర్చుకున్నా. మా తమ్ముడు కొంత ఆర్థిక సాయం చేశాడు. జమ్ముకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ మీదుగా రెండో యాత్ర మొదలుపెట్టాను. నదులు, అడవులు, పల్లెలు, పట్టణాలు తిరిగాను. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించాను. నేను పొందిన అనుభూతి నా చిత్తరువుల్లో కనిపిస్తుంది. మూడో యాత్రలో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ దర్శించాను. నాలుగో విడతలో ఈశాన్య రాష్ర్టాలన్నీ చుట్టేశాను. అక్కడి వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉండేవి. చిరపుంజి లాంటి ప్రదేశాల్లో రోజుల కొద్దీ గడపాల్సి వచ్చేది. కొన్ని రోజులు ఆగుతూ, ఇంకొన్ని రోజులు ముందుకు సాగుతూ ఈ యాత్ర సుదీర్ఘకాలం కొనసాగింది. ఐదో యాత్రలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ చూశాను.
ఈ యాత్ర చేసే రోజుల్లో ఆయా ప్రాంతాల్లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలకు వెళ్లాను. బరోడా ఎం.ఎస్. ఫైన్ ఆర్ట్స్ కళాశాల, శాంతినికేతన్ (కోల్‌కతా), జేజే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (మహారాష్ట్ర) ఇలా ఎన్నో దర్శించాను. అక్కడి విద్యార్థులతో మాట్లాడాను. కొందరు అధ్యాపకులు పుస్తకాలు, డబ్బులు ఇచ్చారు. ఈ యాత్రల్లో మొత్తంగా పదివేల వరకు డ్రాయింగ్స్ గీశాను. వాటిని మోయడం కష్టమే కదా! అందుకే, ఎప్పటికప్పుడు పోస్టులో మా ఇంటికి పంపేవాణ్ని. వాటిలోంచి ఓ రెండు వందల బొమ్మలతో హైదరాబాద్‌లో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. నేను చూసిన దేశాన్ని, నాకు అర్థమైన భారతాన్ని అందరికీ చూపించాలని భావిస్తున్నా! కళాకారుడు ఎలా పరిణతి సాధిస్తాడో నా కళాయాత్ర చెబుతుందని విశ్వసిస్తున్నా!
డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేసే రోజుల్లో ‘పెండ్లి చేసుకో’ అని ఇంట్లోవాళ్లు అడిగేవారు. యాత్రంతా పూర్తయ్యాకే పెండ్లి చేసుకుంటానని చెప్పాను. మనసులో బలంగా అనుకుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. అనుకున్న లక్ష్యం సాధించగలం. ఈ యాత్రలో నన్ను ఎందరో ఆదరించారు. రోజుల తరబడి ఆతిథ్యం ఇచ్చినవాళ్లూ ఉన్నారు. రిషికేశ్‌లో రామ్జూలా వంతెన దగ్గర డ్రాయింగ్ చేస్తుంటే.. గుజరాతీ పర్యాటకులు పరిచయం అయ్యారు. నా కథ తెలుసుకొని.. గుజరాత్‌కు వచ్చినప్పుడు తప్పకుండా కలవమని ఫోన్ నెంబర్ ఇచ్చారు.
నేను ఆ రాష్ర్టానికి వెళ్లినప్పుడు.. వాళ్లకు ఫోన్ చేశాను. వారం రోజులు వాళ్ల ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. జైన దేవాలయాలన్నీ తిప్పి చూపించారు. రాజస్థాన్‌లోనూ ఓ కుటుంబం ఎంతో ఆదరించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓ యువతి పరిచయమైంది. వాళ్ల ఇంట్లో పెద్దలను ఒప్పించి.. పది రోజులు ఆశ్రయమిచ్చింది. ఇలా నా కళాయాత్ర ఆద్యంతం ప్రేమాభిమానాల మధ్య సాగింది. మా అవ్వ మాత్రం ‘పోచులు.. గడియ రికం లేదు.. గవ్వ అచ్చుడు లేదు’ (తీరిక లేకుండా తిరుగుతున్నావ్ కానీ, రూపాయి ఆదాయం లేదు) అనేది.
– నాగవర్ధన్ రాయల
– జి. భాస్కర్