Tanaya Devi | ఆడపిల్ల అనే ఎరుక… ఆత్మన్యూనతకు కాదు, నమ్మకానికి దారితీయాలి. ఇందులో తల్లిదండ్రుల పాత్ర కీలకం. అందుకు సాక్ష్యమే తనయా దేవి. తనయ తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులు. తమ వృత్తిపట్ల ఎంత నిబద్ధతగా ఉండేవారో, కుటుంబం పట్ల కూడా అంతే శ్రద్ధగా మెలిగేవారు. అలాంటి వాతావరణంలో పెరగడమే తన విజయ రహస్యం అంటారు తనయాదేవి. దిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజ్లో బీఏ ఎకనామిక్స్ చేశారామె. కేలూచరణ్ మహాపాత్ర దగ్గర ఒడిస్సీ నృత్యం కూడా నేర్చుకున్నారు. ఫ్రాన్స్, బెల్జియంలాంటి దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
కేంబ్రిడ్జ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఆర్థికశాస్త్రంలో ఉన్నత విద్య పూర్తిచేశారు. ఈ సమయంలో అమెరికాలో పోలీస్ వ్యవస్థ మీద రూపొందించిన ఓ పరిశోధనా పత్రం, ప్రభుత్వ దృష్టిని సైతం ఆకర్షించింది. ఇదంతా ఒక ఎత్తయితే Sigma Squared సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా తనయ సాధిస్తున్న విజయాలు మరో ఎత్తు. ఓ కంపెనీ దగ్గర ఉన్న డేటాను సమర్థంగా, సంపూర్ణంగా వినియోగించుకునేందుకు Sigma Squared సాయపడుతుంది. ఇప్పటికే ఫార్చూన్ 500 జాబితాలో ఉన్న కంపెనీలెన్నో ఈ సంస్థ సేవలను వినియోగించుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో తనయ మరిన్ని విజయాలు అందుకోవడం ఖాయం.