అక్కకోసం ప్రయత్నిస్తే అవకాశం చెల్లిని వరించింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తొమ్మిదో తరగతిలోనే నట ప్రయాణం ప్రారంభించింది. అది మొదలు రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నటి శ్వేతా షైన్. ‘చక్రవాకం’, ‘సిరిమల్లె పువ్వు’ లాంటి సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న శ్వేత.. యమదొంగ లాంటి సూపర్ హిట్ సినిమాలోనూ నటించి మెప్పించింది. జీ తెలుగు ‘పడమటి సంధ్యారాగం’లో నటిగా ప్రేక్షకులను అలరిస్తూనే ‘మేఘసందేశం’ సీరియల్‌కు ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నది. నటిగా రాణించిన చోటే నిర్మాతగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న శ్వేత ‘జిందగీ’తో పంచుకున్న కబుర్లు..
Swetha Shine | మా అమ్మది వైజాగ్, నాన్నది ఒడిశా. వైజాగ్‌లో మూడో తరగతి వరకు చదువుకున్నా. తర్వాత ఒడిశాకు షిఫ్ట్ అయ్యాం. నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య. అక్కకు నటనంటే ఇష్టం. హీరోయిన్ అవ్వాలని అనుకుంది. నేను తొమ్మిదో తరగతిలో ఉండగా హైదరాబాద్‌కు వచ్చి అక్కకు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాం. అక్కకోసం ఫొటోషూట్ చేసినప్పుడు, మేమిద్దరం ఒక ఫొటో దిగాం. దాన్ని చూసిన డైరెక్టర్ నాకు సీరియల్లో అవకాశం ఇచ్చారు.
అలా అనుకోకుండా పరిశ్రమలో అడుగుపెట్టా. నా మొదటి సీరియల్ ‘చక్రవాకం’. నిజానికి మొదటి ప్రాజెక్ట్ ఒప్పుకొన్నప్పుడు పరిశ్రమలో స్థిరపడాలనే ఆలోచన లేదు. పదిరోజులే షూటింగ్.. ఆ తర్వాత వెళ్లిపోవచ్చు అనుకున్నా. కానీ నా పాత్రకు వచ్చిన ఆదరణ వల్ల దాదాపు లీడ్ రోల్‌గా మార్చేశారు. దాంతో నటనే నా కెరీర్‌గా మారిపోయింది.
ఇండస్ట్రీకి 2004లో వచ్చాను. అప్పటినుంచి కనీసం ఒక నెలరోజులు కూడా ఖాళీగా లేను! ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అవకాశాలు పలకరిస్తూనే ఉన్నాయి. నాన్న నన్ను లా చదివిద్దామనుకున్నారు. నాకు ఆటలంటే ఇష్టం ఉండేది. కబడ్డీ, ఖోఖో, హై జంప్, రన్నింగ్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. నటనంటే ఏంటో తెలియకుండానే తెరకు పరిచయమయ్యాను. ఇక్కడే అన్నీ నేర్చుకున్నాను. నేను ఆర్టిస్ట్‌గా ఎదగడం వల్లే నా కుటుంబం స్థిరపడింది. అందుకే నాకు పరిశ్రమ అంటే ఎప్పుడూ గౌరవమే. ప్రొడ్యూసర్‌గా మారి నాలాంటి మరికొందరికి పని కల్పించాలని అనుకున్నాను.
ఇప్పటివరకు దాదాపు 15 సినిమాల్లో చేశాను. చాలా చిత్రాలకు ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. కానీ, సీరియల్స్‌లో ఉన్నంత కంఫర్ట్ సినిమాల్లో లేదనిపించింది. అందుకే ఒప్పుకోవడం లేదు. సీరియల్స్‌లో లాంగ్ జర్నీ ఉంటుంది. సినిమా అలా కాదు.. మనకు ఒక పదిరోజులో, ఐదురోజులో కాల్షీట్ ఉంటుంది. అది అయ్యిందంటే సినిమాతో, యూనిట్‌తో సంబంధం ఉండదు. కానీ, సీరియల్లో అలా కాదు.
కొత్తకొత్తగా ఉన్నా కొన్నాళ్లు పోయేసరికి ఓ కుటుంబంలా మారిపోతాం. పాజిటివ్, నెగెటివ్ అనే తేడా లేకుండా దాదాపు అన్ని రకాల పాత్రలూ పోషించా. పదహారేండ్ల వయసులోనే పాతికేండ్ల కుర్రాడికి అమ్మగా నటించా. 2016లో దూరదర్శన్‌లో ప్రొడ్యూసర్‌గా ఓ ప్రాజెక్ట్ చేశా. మళ్లీ ఇప్పుడు ‘మేఘసందేశం’ సీరియల్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నా.
ఇది కాస్త లైన్లో పడ్డాక ఇంకో ప్రాజెక్ట్ మొదలుపెట్టే ఆలోచనలోఉన్నా. ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు డబ్బులు తీసుకునేదాన్ని. ఇప్పుడు నేనే ఆర్టిస్టులకు డబ్బులు ఇస్తున్నా అంతే తేడా!
శ్రావణ మాసం వచ్చిందంటే ఇల్లంతా పండగ వాతావరణం ఉంటుంది. పొద్దున్న 4 గంటలకే లేచి పూజచేసి పాపకు అన్నీ సర్దిపెట్టాకే షూటింగ్‌కు వెళ్తాను. శ్రావణ మాసం పూజలు, వ్రతాలతోపాటు వినాయక చవితి, దసరా బాగా సెలెబ్రేట్ చేసుకుంటాం. నా అభిమానులే నా కుటుంబం. వాళ్ల ఆదరణతోనే పరిశ్రమలో నిలదొక్కుకున్నా. నా ప్రతి విజయం వెనుక వాళ్లే ఉన్నారు. సీరియళ్లలో నేను పోషించిన పాత్రల గురించి నా యూట్యూబ్ ఛానెల్ వీడియోస్ కింద కామెంట్లు పెడుతుంటారు. బయటికి వెళ్లినప్పుడు కూడా చాలామంది గుర్తుపట్టి ప్రేమగా పలకరిస్తారు. అభిమానుల ఆదరణ, దేవుడి దయ వల్ల ప్రొడ్యూసర్‌గానూ ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా.
ఒక ప్రాజెక్టు జయాపజయాలు డైరెక్టర్, రైటర్ మీద ఆధారపడి ఉంటాయి. నా వరకు.. ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. కమిట్మెంట్తో పనిచేస్తే అవకాశాలు తప్పకుండా వస్తాయి. పరిశ్రమలో చాలామంది శ్రేయోభిలాషులు ఉన్నారు. ఖాళీ సమయం దొరికితే కుటుంబానికే కేటాయిస్తాను. పాపతో ఎక్కువ సమయం గడుపుతా. ఏడాదికోసారైనా కుటుంబంతో విహారానికి వెళ్తాను. ప్రపంచం మొత్తం చుట్టేయాలని ఉంది కానీ కుదరట్లేదు. కనీసం మన దేశంలోని దేవాలయాలన్నీ దర్శించుకోవాలని అనుకుంటున్నా.
– హరిణి