అన్ని రంగాల్లో స్త్రీలు తమదైన ముద్ర వేస్తున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా.. పురుషులకు దీటుగా పనిచేయగలం అని నిరూపిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు.. మార్గరేట్ బారు, సంగీత సిక్రా. మార్గరేట్ ఒడిశా రాష్ట్రంలోనే తొలి మహిళా సఫారీ డ్రైవర్ కాగా, మరొకరు తొలి ఫారెస్ట్ గైడ్. ఈ ఇద్దరూ బ్రేక్ ది బారియర్స్ అంటూ ఈతరం అమ్మాయిలకు ప్రేరణనిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మార్గరేట్ చదువు పదో తరగతితోనే ఆగిపోయింది. తన కుటుంబానికి అండగా నిలవడం కోసం అటవీ సంరక్షణ కేంద్రంలో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. సఫారీ డ్రైవర్‌గా ఉద్యోగం సంపాదించింది. అడవిలో డ్రైవింగా అంటూ కుటుంబసభ్యులు ఆక్షేపించారు. మార్గరేట్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒడిశాలోని దిబ్రూగఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సమీపంలోనే మార్గరేట్ వాళ్ల ఊరు ఉంటుంది.
అధికారుల సహకారంతో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంది. పరీక్షలో ఉత్తీర్ణత పొంది వైల్డ్‌లైఫ్ సఫారీ డ్రైవర్‌గా కొలువు సంపాదించింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆమె జీవితం పగలంతా అడవిలోనే సాగుతున్నది. ప్రతి రోజూ ఉదయం సఫారీ జీపులో పర్యాటకులను అడవిలోకి తీసుకెళ్తుంది. ఘాట్ రోడ్డులో దూసుకెళ్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ‘అడవి నాకు చాలా బలాన్ని ఇచ్చింది. ప్రతి రోజూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను’ అని మార్గరేట్ చెబుతున్నది. తన కుటుంబాన్ని ఆదుకుంటూనే, తన గ్రామంలోని అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తున్నది. మార్గరేట్ లాగానే, సంగీత అనే మరో మహిళ కూడా ఇదే దిబ్రూగఢ్ శాంక్చురీలో సందర్శకులకు గైడ్‌గా సేవలు అందిస్తున్నది. వీరిద్దరూ రూమ్మేట్స్ కూడా! గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ అతివలు.. విభిన్నమైన రంగాలను ఎంచుకొని, మహిళాశక్తికి ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు!