డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినవాళ్లు చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు. బుల్లితెర నటి నీరజ వాలిశెట్టి కూడా అంతే! ఈ చదువుల రాణి అనుకోకుండా బుల్లితెర మీదికొచ్చింది. తన సహజ నటనతో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇరవై నాలుగేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నది. జీ తెలుగులో ప్రసారమవుతున్న అమ్మాయిగారు సీరియల్లో ముత్యాలుగా అభిమానులకు వినోదం పంచుతున్న నీరజ జిందగీతో పంచుకున్న ముచ్చట్లు..
మా సొంతూరు మచిలీపట్నం. అమ్మానాన్నలు శ్యామల, కృష్ణమూర్తి. మేం నలుగురం అక్కాచెల్లెళ్లం. 1982లో హైదరాబాద్ వచ్చేశాం. నాన్న అమెరికాలో ఉండేవారు. అక్కడే వ్యాపారం చేసేవారు. అమ్మ, మేం ఇక్కడ ఉండేవాళ్లం. ఇంట్లో నేనే చిన్నదాన్ని కావడంతో గారాబం ఎక్కువ. బాగా చదివేదాన్ని. అమీర్‌పేట్ విద్యోదయ స్కూల్లో పదో తరగతి, మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివాను. చదువులో చురుగ్గా ఉండటంతో నాన్న నన్ను డాక్టర్ చేద్దామనుకున్నారు.
కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. బాగా చదువుతాను కాబట్టి, మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతుందని అమ్మ అనుకునేది. కానీ, నేనేమో పరిశ్రమలోకి వచ్చాను. నటనలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. అనుకోకుండా అవకాశం రావడంతో ఒప్పుకొన్నా. మోడల్‌గా కెరీర్ ప్రారంభించా. తర్వాత సీరియల్లో అవకాశం వచ్చింది. నా మొదటి సీరియల్ యండమూరి వీరేంద్రనాథ్ ‘తులసీదళం’. అలా మొదలైన నా కెరీర్ 24 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది.
తనతో చెప్పకుండా సీరియల్లో నటించినందుకు అమ్మ చాలా కోప్పడింది. ఈ ఫీల్డ్ గురించి బయట చాలా అపోహలు ఉన్నాయి. అందుకే అమ్మకు నచ్చలేదు. నటిగా నేను నిలదొక్కుకుంటానని నాన్న నమ్మారు. ఎంతగానో ప్రోత్సహించారు. మూడేళ్ల తర్వాత అమ్మ నా సీరియల్స్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయింది. తెలుగు టీవీ పరిశ్రమ నాకు మంచి జీవితాన్ని ఇచ్చింది. సంఖ్యపరంగా నేను తక్కువ సీరియల్స్ చేసి ఉండొచ్చు! కానీ, అన్నీ బాగా పాపులర్ అయ్యాయి. కథలను జాగ్రత్తగా ఎంచుకుంటాను. నేను చేసిన ప్రతి పాత్రా వైవిధ్యమైనదే! అందుకే, అన్ని పాత్రలూ నాకు నచ్చేవే!!
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నటన తెలియదు కాబట్టి నా సీనియర్స్‌ని చూసి నేర్చుకునేదాన్ని. మేకప్, డైలాగ్స్, ఉచ్చారణ కూడా కనిపెడుతూ ఉండేదాన్ని. నేను సహజంగా నటిస్తానని అందరూ అనేవారు. అదే నా కెరీర్‌కి గట్టి పునాదిగా మారింది. నాలుగైదు సినిమాల్లో కూడా చేశాను. కానీ, ఎందుకో అంతగా ఆసక్తి కలగలేదు. సినిమా చాలా పెద్ద ప్రపంచం. అందులో ఇమడటం చాలా కష్టం.
సీరియల్ అయితే చాలాకాలం ఒకే టీమ్‌తో పనిచేయొచ్చు. అందరం ఒక కుటుంబంగా ఉంటాం. 12 ఏండ్ల నుంచి జీ తెలుగుతో పనిచేస్తున్నాను. పసుపు కుంకుమ, గుండమ్మ కథ, తూర్పు పడమర.. సీరియల్స్ చేశాను. ప్రస్తుతం ‘అమ్మాయిగారు’లో నటిస్తున్నా. హాస్యరస పాత్రలంటే నాకిష్టం.
ఇన్నేళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్నానంటే… అందుకు ప్రేక్షకులే కారణం. అభిమానుల వల్లే నేను ఇక్కడున్నా. చాలామంది మీ వాయిస్ బాగుంటుంది, సహజంగా నటిస్తారని మెచ్చుకుంటారు. నెగెటివ్ రోల్స్‌లో కూడా నటించాను. అయినా నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. నా ఇల్లును మించిన ఫేవరెట్ ప్లేస్ లేదు. ఇల్లే స్వర్గంలా ఫీలవుతా. జంతువులంటే ఇష్టం. నేను పెంచుకునే మూడు కుక్కలంటే చాలా ఇష్టం. నేను కనకపోయినా అవే నా పిల్లలు. చనిపోయేలోపు కుక్కల కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. ఒకప్పుడు నాన్‌వెజ్ తినేదాన్ని. కానీ అది ఫుడ్ కాదు అని రియలైజ్ అయ్యాక మానేశాను. మూడేళ్లుగా పూర్తి శాకాహారిగా ఉంటున్నాను. వీగన్‌గా కూడా మారేందుకు ప్రయత్నిస్తున్నా. అదంత ఈజీ కాదనుకోండి! శ్రావణ మాసం పూజలు, వ్రతాలు అంటే ఇష్టం. నేను చేయడం కన్నా.. ఎవరైనా పేరంటానికి పిలిస్తే వెళ్లడం ఇష్టం.
గుండె సంబంధ సమస్యతో రెండేళ్ల కిందట అమ్మ కన్నుమూశారు. ప్రస్తుతం నాన్న నాతోనే ఉంటున్నారు. ఇద్దరు అక్కలు అమెరికాలో ఉన్నారు. ఒకసారి అమెరికా వెళ్లాను. కానీ, ఎందుకో నచ్చలేదు. వాళ్లే వస్తూ ఉంటారు. మా అక్కల పిల్లలకు నేనే పేర్లు పెట్టాను. వాళ్లందరికీ నేనంటే చాలా ఇష్టం. ఈ తరం ఆడవాళ్లకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే.. మనుషుల్ని జాగ్రత్తగా అంచనా వేసి నమ్మాలి. ఒకరిమీద ఆధారపడొద్దు. మీకంటూ ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండటం ముఖ్యం. అదేవిధంగా జంతువుల బాగోగులు చూడకపోయినా ఫర్వాలేదు కానీ, వాటికి హాని చేయకుండా ఉండండి.
– హరిణి