Sandhya Sriram | సంధ్య శ్రీరామ్.. స్టెమ్‌సెల్ సైంటిస్ట్. తన నైపుణ్యమంతా జోడించి కృత్రిమంగా సముద్ర ఆహారాన్ని తయారు చేయాలి అనుకున్నారు. ‘షిఓకే మీట్స్’ పేరుతో కంపెనీని నమోదు చేయించారు. ఇప్పటికే సింగపూర్‌లోని తన ల్యాబ్‌లో పీతలు, రొయ్యలు, చేపలు సృష్టిస్తున్నారీ ప్రవాస భారతీయురాలు.
ఏ చెరువులోనో రొయ్యలు, పీతలు, చేపలు పెంచాలంటే.. ఎన్ని నీళ్లు వృథా, ఎన్ని రసాయనాలు కుమ్మరించాలి, ఎంత కాలుష్యాన్ని ప్రకృతిలో కలపాలి. నేరుగా సముద్రం మీదికి వెళ్లాలన్నా.. ఎంతో ఇంధనం అవసరం. కొన్నిసార్లు ఆ ఆటుపోట్లకు మత్స్యకారుల ప్రాణాలూ నీటిపాలు అవుతాయి. మన స్వార్థం కోసం జలచరాలను జల్లెడపట్టే కొద్దీ.. సముద్ర జీవరాశిలో సమతౌల్యం తగ్గుతుంది. ఇది ఏమంత మంచి పరిణామం కాదు.
అదే సముద్ర ఆహారాన్ని ల్యాబ్‌లోనే పండించగలిగితే.. ఇబ్బందే ఉండదు. ఇప్పటికే అనేక బహుళజాతి సంస్థలు సంధ్య శ్రీరామ్‌కు మద్దతు పలికాయి. పెట్టుబడుల వర్షం కురిపించాయి. కాకపోతే, సహజ మాంసాహారంతో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్లు ధర ఎక్కువ.‘మన పొట్ట నింపుకోవడం కోసం ఓ ప్రాణిని హతమార్చిన అపరాధభావంతో పోలిస్తే ఇది చాలా తక్కువే’ అంటారు సంధ్య. ‘గైయా’ పేరుతో సెల్ బేస్డ్ మీట్ కంపెనీని కూడా నడుపుతున్నారీమె. గతంలో ‘సైగ్లా’ అనే సైన్స్ ఎడ్యుకేషన్ స్టార్టప్‌ను నిర్వహించారు. తనకు ఇద్దరు పిల్లలు. ఒక బాబు, పాప. ‘జస్ట్ డూ ఇట్’.. మహిళలకు ఇదే తన సందేశం.