సాగరిక ఘాట్గే.. మాజీ క్రికెటర్ జహీర్‌ఖాన్ జీవిత భాగస్వామి, నటి, హాకీ క్రీడాకారిణి. ఓ రాజ కుటుంబానికి వారసురాలు కూడా. ఆమె తండ్రి కాగల్ సంస్థాన వారసుడు. తమ కుటుంబ చరిత్రకు సంబంధించి ఓ పుస్తకం తీసుకొచ్చారు సాగరిక. ‘ఘాట్గేస్: రెయిజ్ ఆఫ్ ఎ రాయల్ డైనస్టీ’ ఓ పెద్ద వంశవృక్షాన్ని కళ్లముందు నిలుపుతుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పరిసరాలను పాలించిన తమ తాతముత్తాతల శౌర్యాలు, ధరించిన దుస్తులు, ఆరగించిన విందులు, చేసిన యుద్ధాలు, కట్టించిన భవంతులు, చేపట్టిన సత్కార్యాలు.. ఏదీ వదిలిపెట్టకుండా ఇందులో ప్రస్తావించారు.
అదనంగా, అరుదైన ఫొటోలు, పంచవర్ణ చిత్రాలు ముద్రించారు. ‘ఆరువందల ఏండ్ల కాలంలో మా కుటుంబం ఎంతోమంది పాలకులను, నాయకులను ఈ దేశానికి అందించింది’ అని ఇన్‌స్టాలో వ్యాఖ్యానించారు సాగరిక. ‘మా పరివారం శాఖోపశాఖలుగా విస్తరించింది. మావాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందర్నీ ఒకతాటిపైకి తీసుకురావడానికి ఈ రచన పనికొస్తుంది. నా వరకూ కొంత తెలుసు. ఈతరం పిల్లలకైతే తామెవరో, తమ ఘనత ఏమిటో కూడా తెలియదు. ఆ అజ్ఞానమే నన్ను బాధించింది’ అంటారామె. నిజమే, కుటుంబ చరిత్రను రికార్డు చేయడం మంచి ప్రయత్నమే.