అతివలు లోహ విహంగాలను నడిపి ధీర అనిపించుకుంటున్నారు. యుద్ధ విమానాలనూ గింగిరాలు కొట్టిస్తూ సాహసి అని ప్రశంసలు పొందుతున్నారు. కానీ, ప్రజారవాణా సాధనం బస్సు నడపడంలో మహిళల ఊసే కనిపించదు. ఈ సంప్రదాయానికి చరమగీతం పాడుతూ.. రైట్ రైట్ అంటున్నది గిరిజన బిడ్డ సరితా నాయక్. జీవన పోరాటంలో ఆటో స్టీరింగ్ పట్టిన ఆమె.. ఇప్పుడు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా కొత్త శకానికి నాంది పలికింది. ఢిల్లీ ఆర్టీసీలో చేరి దేశంలోనే తొలి మహిళా డ్రైవర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌గా చేరిన సరిత జర్నీ ఇది..
కష్టాలే సరితా నాయక్‌ను ముందుకు నడిపించాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చక్రం తిప్పేలా ఉసిగొల్పాయి. తల్లిదండ్రులకు అండగా ఉంటూ.. వారు గర్వపడేలా చేశాయి. దేశంలోనే ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్‌గా నిలిచిన వాంకుడోత్ సరితానాయక్ది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండా. ఆమె తల్లిదండ్రులు రుక్కల, రాంకోటి. కూలిపనులే వారి జీవనాధారం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కూతురే సరితా నాయక్. ఓపెన్ టెన్త్ పూర్తిచేసింది. తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో ఇంటి బాధ్యతలను ఆమె భుజానికెత్తుకుంది. అక్కల పెళ్లిళ్లు చేయడంలో సాయపడింది. తమ్ముడి ఆలనాపాలన చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది.
కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటంతో బాధ్యతలన్నీ సరితా నాయక్ చూసుకుంది. పదో తరగతి పూర్తవగానే నల్లగొండ మహిళా ప్రాంగణంలో చేరింది. ఆ తర్వాత దేవరకొండలోని తన అక్క ఇంటికి చేరుకుంది. ఆటోడ్రైవర్‌గా పనిచేసే బావ ఆరోగ్యం దెబ్బతినడంతో సరిత ఆటో స్టీరింగ్ చేతపట్టింది. తోటి ఆటోడ్రైవర్లు సహకరించకున్నా, నలుగురూ ఎగతాళి చేసినా.. పట్టిన స్టీరింగ్ వదిలిపెట్టలేదు. దేవరకొండలోనే రెండేండ్లపాటు ఆటో డ్రైవర్‌గా ప్రయాణం కొనసాగించింది. ఆ తర్వాత సొంతంగా ఆటో కొనుక్కొని సొంతూరైన సంస్థాన్ నారాయణపురంలో నాలుగేండ్ల పాటు ఆటో నడిపింది.
నర్సుగా రోగులకు సేవ చేయాలన్నది సరిత తపన. నాలుగేండ్లు ఆటో నడిపిన తర్వాత డ్రైవింగ్‌కి కామా పెట్టేసి హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడే ఓ నర్సింగ్ కాలేజీలో చేరాలనుకుంది. అయితే, పేదరికం కారణంతో ఆమె ప్రయత్నం ముందుకు సాగలేదు. కానీ అదే నర్సింగ్ కళాశాలలో వార్డెన్‌గా ఉద్యోగం లభించింది. వార్డెన్‌గా పనిచేస్తూనే.. బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. అదే సమయంలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందింది. అనంతరం అదే కాలేజీలో బస్సు డ్రైవర్‌గా చేరింది. ఇలా ఉండగా ఓ మేడమ్ సాయంతో ఢిల్లీకి వెళ్లింది సరిత. అక్కడ వంద మంది మహిళా డ్రైవర్లతో నడుపుతున్న ఆజాద్ ఫౌండేషన్ సంస్థ-సఖీ క్యాబ్స్‌లో డ్రైవర్‌గా చేరింది. పెద్దపెద్ద కార్లను నడిపింది. ఢిల్లీలో ఉన్నప్పుడే హిందీ, ఇంగ్లిష్‌తోపాటు కరాటే కూడా నేర్చుకుంది.
కాలం గడుస్తున్న సమయంలోనే సరిత.. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్లో డ్రైవర్‌గా చేరి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 2015లో దేశంలో ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్‌గా కీర్తి గడించింది. సరోజినీ డిపోలో విధులు నిర్వహించింది. అయితే తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి, తమ్ముడి భవిష్యత్ దృష్ట్యా సొంత రాష్ర్టానికి రావాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇక్కడా ఉద్యోగం సాధించింది. ఎంజీబీఎస్ డిపోలో డ్రైవర్‌గా చేరింది. ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడకు నాన్‌స్టాప్ బస్సును నడుపుతూ ఔరా అనిపించుకుంటున్నది సరితా నాయక్.
దేశంలోనే ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా ఘనత సాధించిన సరితా నాయక్‌కు ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలు దక్కాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల నుంచి గుర్తింపు లభించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా భారత తొలి మహిళా బస్సు డ్రైవర్ అవార్డును అందుకుంది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఆమెను సత్కరించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.లక్ష నజరానాతోపాటు అవార్డు అందుకుంది. కొమ్రంభీం అవార్డును సొంతం చేసుకుంది. అదే విధంగా మాజీ డీజీపీ కిరణ్ బేడీ నుంచి ఉత్తమ మహిళా డ్రైవర్‌గా అవార్డు పొందింది. కష్టాల మలుపులు చూసి యూ టర్న్ తీసుకోకుండా.. ముందుకు సాగిన సరితా నాయక్ ఎందరికో ఆదర్శం అనడంలో సందేహమే లేదు!
కుటుంబం కష్టాల్లో ఉండటంతో స్టీరింగ్ పట్టాను. నా తల్లిదండ్రుల బాగోగులే ముఖ్యం. డ్రైవింగ్ నాకెన్నో నేర్పింది. ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్‌గా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని గర్వంగా భావిస్తున్నాను. ప్రస్తుతం ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నాను. భవిష్యత్‌లో రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తారని ఆశిస్తున్నాను.
– సరితా నాయక్
– పున్న శ్రీకాంత్