Ramanujamma | సిరిసిల్లలో మరమగ్గాలు నిరంతరం పరిగెడుతూనే ఉంటాయి. పట్నం ముందుండే మానేరు వేగంగా పరుగులు తీస్తుంటుంది.అదే సిరిసిల్లలో అలుపెరగని పరుగులు తీస్తున్న ఓ పెద్దావిడా ఉంది! ఆమె పేరు టమాటం రామానుజమ్మ. బాల్యంలో సరదాగా మొదలైన ఆమె పరుగు వయసు పెరిగే కొద్దీ.. కొత్త శక్తి పుంజుకుంది. ఏ పోటీకి వెళ్లినా.. పతకం గెలుచుకునేంత వేగం అందుకుంది. ఏడు పదుల వయసులోనూ ఓటమెరుగని పరుగుల రాణిగా పేరు గడించిన రామానుజమ్మ కథ ఇది..
ఈ రోజుల్లోనూ బడిలో పరుగు పందెం ఉందంటే పేర్లు ఇవ్వడానికి విద్యార్థులు తటపటాయిస్తారు. ఈ తరం ఆడపిల్లలు కూడా.. పరుగు మనకు సంబంధించిన క్రీడ కాదనుకుంటారు. కానీ, అరవై ఏండ్ల కిందట.. ‘పరుగు పందెంలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇవ్వండి’ అనగానే రామానుజమ్మ టక్కున లేచి నిల్చునేది. పేరు ఇవ్వడంలోనే కాదు.. తన పేరును నిలబెట్టుకోవడంలోనూ అంతే ఉత్సాహం కనబరచేది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రామానుజమ్మ తండ్రి చిన్నపాటి ప్రైవేట్ పాఠశాల నడిపేవాడు. ఆ రోజుల్లోనే ఆమె డిగ్రీ వరకు చదివింది. తర్వాత తండ్రి పాఠశాల బాధ్యతలు భుజానికెత్తుకుంది. చాలీచాలని జీతంతో బతుకు పందెంలో పరుగులు తీస్తూనే ఉంది.
చిన్నప్పటి నుంచీ రామానుజమ్మకు ఆటలంటే ఇష్టం. అందులోనూ పరుగంటే ప్రాణం. ఇంటి నుంచి బడికి, బడి నుంచి ఇంటికి తిన్నగా నడుచుకుంటూ వెళ్లడం చాలా అరుదుగా కనిపించేది. చిరుతలా పరుగులు తీసేది. బడిలో జరిగే పరుగు పందెంలో ఆమె బరిలో దిగితే, మిగతావాళ్లంతా రెండో స్థానం కోసమే పోటీపడేవారు. అంత మెరుపు వేగం ఆమె సొంతం. స్వతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పాఠశాలలో జరిగే ఆటల పోటీల్లో రామానుజమ్మ తప్పకుండా ఉండాల్సిందే! ప్రైజు గెలవాల్సిందే!! మరోవైపు బయట ఎక్కడ పరుగు పోటీ ఉన్నా… బడి ఎగ్గొట్టి మరీ అందులో పాల్గొనేది. గెలిచి తీరేది!! డిగ్రీ పూర్తయ్యాక.. తండ్రి నిర్వహిస్తున్న పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. బడిలో పనిచేస్తూనే.. ఎక్కడ పరుగుల పోటీలు జరిగినా స్కూల్‌కు సెలవు పెట్టి వాటిలో పాల్గొనేది. ఆరోగ్యశాఖలో సూపర్వైజర్గా పనిచేసే భాషయ్యతో రామానుజమ్మ వివాహమైంది. పెండ్లి తర్వాత కూడా ఆమె తన పరుగు ఆపలేదు. భర్త కూడా ఆమెకు మద్దతుగా నిలిచాడు. మరింత పట్టుదలతో రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటిందామె.
రామానుజమ్మ 1996లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పరుగుల పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించింది. అప్పటికి ఆమె వయసు సుమారు నలభై ఏండ్లు. 1997లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన ఏపీ అమెచ్యూర్ అథ్లెటిక్స్‌లో బంగారు పతకం గెలుపొందింది. 1998-99లో హైదరాబాద్‌లో నిర్వహించిన అథ్లెటిక్స్‌లోనూ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నది. 2004, 2005లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి (100, 200 మీటర్ల) పోటీల్లోనూ రెండుసార్లు బంగారు పతకాలను గెలుపొందింది. 2007లో వరంగల్, 2012లో విశాఖపట్టణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో భారత్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందెంలో 70 ఏండ్ల విభాగంలో రెండు పతకాలు (800, 1500 మీటర్లు) సాధించింది. తాజాగా, కర్ణాటకలోని మంగళూరులో నిర్వహించిన సౌత్ ఆసియా మాస్టర్ అథ్లెటిక్ ఓపెన్ చాంపియన్‌షిప్ అంతర్జాతీయస్థాయి పోటీల్లో (800 మీటర్లు) పాల్గొని కాంస్య పతకం పొందింది. మలేషియాలో జరిగిన అంతర్జాతీయ పోటీలో (200 మీటర్ల) పాల్గొని తృతీయ స్థానంలో నిలిచి తెలంగాణ కీర్తిపతాకాన్ని ఎగరేసింది. ఏటా నిర్వహించే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాలు దక్కించుకున్నది. మొత్తంగా 300 బంగారు, 250 వెండి, 50 కాంస్య పతకాలు సాధించింది.
‘చాలామందికి నాలుగు పదుల వయసు దాటగానే.. బీపీ, షుగర్ పలకరిస్తుంటాయి. మేమున్నామంటూ మోకాళ్ల నొప్పులు వచ్చేస్తాయి. పరుగును మించిన ఔషధం లేదు. నాకు ఏ బీపీ, షుగర్ లేదు. ఈ పరుగు నాకు పతకాలను మాత్రమే కాదు.. ఆరోగ్యాన్నీ అందించింది. సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాను. ఉదయం అల్పాహారానికి బదులు వివిధ ఆకుల కషాయాలు తీసుకుంటాను. రాగులు, కొర్రలతో చేసిన పదార్థాలే తింటాను. మాంసాహారానికి దూరంగా ఉండటమే నా ఆరోగ్య రహస్యం’ అంటున్నది రామానుజమ్మ. పరుగుతోపాటు జావెలిన్ త్రో, కరాటే, కర్రసాము, యోగా లాంటి పోటీల్లోనూ రామానుజమ్మ ప్రవీణురాలే. ఎన్నో పాఠశాలల్లో పిల్లలకు ఉచితంగా కరాటే, కర్రసాము, యోగాపై శిక్షణ ఇస్తున్నది. సిరిసిల్లవాసులంతా ఆమెను ‘పరుగుల బామ్మా!’ అని ఆప్యాయంగా పలకరిస్తారు.
..? రాపెల్లి సంతోష్‌కుమార్, సిరిసిల్ల