పనికి వెళ్లకపోతే కడుపు నిండదని భయం. పనికిపోతే కడుపు పంట ఆగమైతదని ఇంకో భయం. ఇంటిపట్టునే ఉండమని అమ్మ చెప్పినా ఉరకలెత్తే బాల్యం ఉండనంటది. గడపదాటాక.. ఆకర్షించే ప్రపంచంలో ఆనందాలు కొన్నే.. అవరోధాలే ఎన్నో! వాటన్నిటినీ తప్పించుకునే తెలివిలేని బాల్యం.. మత్తుకు, మోసాలకు, అత్యాచారాలకు బలవుతూనే ఉంది. అలా పేదింటి బిడ్డల భవిత బజారుపాలు కాకుండా రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ బంగారు బాల్యాన్ని తల్లి లెక్కనే కాపాడుకుంటున్నది.
రేవంత్ తిరగనేర్చిండు. వాళ్ల నాన్న ఏడాది కింద చనిపోయిండు. అమ్మ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తది. పొద్దున ఏడు గంటలకు పనికి పోతే.. సాయంత్రం అయిదు గంటలకు ఇంటికి వస్తది. అమ్మ వచ్చిందాంక రేవంత్ బన్సీలాల్‌పేట బస్తీ గల్లీలల్ల తిరుగుతనే ఉంటడు. పిలగాళ్లతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతడు. సైకిల్ తొక్కుతడు. గల్లీలో ఆడుతుంటె వాళ్లక్క (పెద్దమ్మ బిడ్డ) చూసి.. ‘ఎప్పుడు పురుగులెక్క చేస్తున్నవేందిరా’ అని తిట్టేది. చెప్పినా వినకుంటె కొట్టేది. అయినా రేవంత్ మారలే. పని పాట లేకుండ తిరుగుతనే ఉన్నడు. వాళ్లమ్మకు బస్తీ పిలగాళ్ల కోసం ఓ బడి ఉందని తెలిసింది. రేవంత్‌ని ఆ బడికి గుంజుకపోయింది. అక్కడ తన ఈడు పిలగాళ్లెంతోమంది ఉన్నరు. వాళ్లతోటి రేవంత్‌కు సోపతి కుదిరింది. సక్కగ పోతున్నడు. ఆడుకుంటున్నడు. చదువుకుంటున్నడు.
ఆ బడిలో బాల సంఘటన్ ఉంది. అక్కడ రోజూ పొద్దున లేవంగనే పళ్లు తోముకోవాలని, స్నానం చేయాలని చెప్తరు. ‘చిరిగిన చొక్కా అయినా సరే.. ఉతికిందే తొడుక్కో’ అని అక్కడి పిల్లలకు నేర్పిస్తరు. బాల సంఘటన్ పిలగాళ్ల సోపతితో రేవంత్ ఎంతో మారిపోయిండు. సక్కగ తయారైతున్నడు. మంచిగ చదువుకుంటున్నడు. బ్రష్ చేయడం, స్నానం చేయడం అలవాటు చేసుకున్నట్టే రోజూ కాసేపు చదువుకొనుడూ అలవాటు చేసుకున్నడు. ఇప్పుడు ఎక్కాలు నోటికే చెప్తున్నడు. బడిలో బాగా చదువుతున్నవని టీచర్లు మెచ్చుకుంటున్నరు. మార్కులు పెరిగినయి. రేవంత్ మంచి పిల్లగానిగ మారిపోయిండు. ఒక్క రేవంతే కాదు తన సోపతిగాళ్లూ
బాల సంఘటన్లో చేరితే.. వ్యక్తిగత పరిశుభ్రత, చదువు, ఆటలు, పాటలు నేర్పిస్తరు. ఈ బాల సంఘటన్లో చేరి పిల్లలతోటి కలిసిమెలిసి సరదాగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉండేందుకు బస్తీల్లోని పిల్లలు వస్తుంటరు. బన్సీలాల్‌పేటలోని కమ్యూనిటీ సెంటర్లో ఉన్న బాల సంఘటన్లో సుమారు డెభ్బై మంది వరకు పిల్లలున్నరు. వాళ్లలో ఎక్కువమంది తల్లులు ఇళ్లల్లో పనిచేసే వాళ్లు, చెత్త సేకరించేవాళ్లు, వలస కూలీల పిల్లలు. తల్లిదండ్రులు పనులకు పోయిన తర్వాత ఆ పిల్లలు వీధుల్లోకి రాకుండ, చక్కగ ఓ నీడన ఉండి ఆడుకుంట, చదువుకుంట ఉండేటందుకు కమ్యూనిటీ సెంటర్ల అంగన్వాడీ లెక్కనే రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ హెల్త్ సెంటర్ పెట్టిన్రు. కమ్యూనిటీ సెంటర్ల పిల్లల్ని ఖుషీ చేసే రంగు రంగుల బొమ్మలు, రకరకాల ఆట బొమ్మలు, పిల్లల ఆసక్తికి తగినట్టు ఇక్కడే ఎన్నో రకాల క్రాఫ్ట్స్ ఉన్నయి. పొద్దున వచ్చినప్పటి నుంచి ఇంటికి పోయేదాంక ఎన్నో రకాల ఆటలు ఆడుకోవచ్చు. ఈ ఆటలు ఆడించేందుకు, అక్షరాలు, అంకెలు, చదువు నేర్పేటందుకు ట్యూటర్లు, పిల్లల సమస్యలు పోగొట్టేందుకు కౌన్సెలర్ ఉంటరు. వాళ్లు కమ్యూనిటీ సెంటర్‌కి వచ్చే పిల్లల వయసుని బట్టి వాళ్లను బృందాలుగా ఏర్పాటుచేస్తరు. ప్రతి టీమ్‌కి ఓ టాస్క్ ఇచ్చి ఆడిస్తరు, పాడిస్తరు. ఈ ఆటపాటల్లోనే పిల్లలకు లెక్కలు, సైన్స్, ఆర్ట్, క్రాఫ్ట్ నేర్పిస్తరు. ఇలా బడికి పోని పిల్లల్ని బడిలాంటి కమ్యూనిటీ సెంటర్‌కి రప్పించి భలేగా పాఠాలు చెప్తరు. అక్షరాలు, గుణింతాలు, ఎక్కాలు, చదవడం, రాయడం నేర్పిస్తరు. ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో వయసుకు తగిన తరగతి చదివేందుకు సిద్ధం చేస్తరు. ఆ తర్వాత ఇంటికి దగ్గర్ల ఉన్న బడిల చేర్పిస్తరు.
రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్‌ని బడికి పోని పిలగాళ్ల కోసమే పెట్టినా.. బడికిపోయే వాళ్లను కూడా రానిస్తరు. ఎందుకంటే.. బడికి పోని పిల్లలే కాదు బడికి పోయే పిల్లలు కూడా వీధుల్లో తిరుగుతుంటరు. దారి తప్పుతరు. మత్తుకు, మోసాలకు అలవాటవుతరు. ఒక్కోసారి లైంగిక దాడులకు గురైతరు. కిడ్నాప్ అయ్యే ప్రమాదం ఉంది. చిన్నారిని ఈ నేర ప్రపంచం నుంచి కాపాడేందుకు రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ పనిచేస్తది. అయితే.. బడికి పోయి వచ్చిన తర్వాత, అమ్మానాన్న లేరు కాబట్టి చాలామంది పిల్లలు బజార్లలో ఉంటరు. ఇలాంటి వాళ్లను కూడా కమ్యూనిటీ సెంటర్‌కి రానిస్తరు. కమ్యూనిటీ సెంటర్ పొద్దుగాల పది గంటలకు తెరుస్తరు. రాత్రి ఏడు గంటల దాంక తెరిచే ఉంటది. బడికి పోకముందు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. బడి టైమ్‌కి పోవచ్చు. మాపటికి బడి నుంచి వచ్చినంక, అమ్మానాన్న వచ్చే దాంక ఈడనే ఉండొచ్చు. బడిల ఇచ్చే హోమ్ వర్క్‌ని చేసుకోవచ్చు. ఏదైనా అర్థం కాకుంటే చెప్పెటందుకు ట్యూటర్స్ ఉంటరు. అప్పటికే బడిలో ఆడి, ఆడి అలసి వచ్చిన పిల్లలు ఆకలితో ఉంటరు. ఆకలి మంటతో చదువలేరు. కాబట్టి వచ్చిన పిల్లలందరికీ స్నాక్స్ ఇస్తరు. అది కూడా వాళ్ల ఎదుగుదల, ఆరోగ్యానికి ఉపయోగపడేట్టు పోషకాలుండేట్టుగ వండి పెడుతరు. చదువు రాని అమ్మానాన్నలకు ఆ హోమ్ వర్క్ ఏందో అర్థం కాదు. ఎట్ల చేయాల్నో పిలగాళ్లకు పాలుపోదు. పైసలు పెట్టి ట్యూషన్‌కి పోనోళ్లంత కమ్యూనిటీ సెంటర్‌కి వస్తున్నరు. బాల సంఘటన్ల చేరుతున్నరు. చదువుతోపాటు మంచి అలవాట్లు నేర్చుకుంటున్నరు!
చదువు, శుభ్రత నేర్పినట్టే.. రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ల ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తరు. మూడు నెలలకు ఓపాలి హెల్త్ చెకప్ చేయిస్తరు. పెద్ద పెద్ద దవాఖానల నుంచి డాక్టర్లు వచ్చి కంటిచూపు, ఎత్తు, బరువు చూస్తరు. జ్వరం, జలుబు, తలనొప్పి ఉంటె.. మందుగోలీలు ఇస్తరు. నేరాలు చేసేటోళ్ల కన్ను పిల్లల మీదే పడుతది. వాళ్లను నమ్మి ఈ పిల్లలు తేలికగ మోసపోతరు. పిలగాళ్లని గంజాయి, డ్రగ్స్ సప్లయికి వాడుకుంటున్నరు. ఇట్ల గాకుండ చేయాల్నని బాల సంఘటన్లోని పిలగాళ్లతోపాటు తల్లిదండ్రుల్ని కలిపి ‘పిల్లల సంరక్షణ కమిటీ’ కూడా పెట్టిన్రు. అందరికీ కిడ్నాప్, అత్యాచారం నుంచి ఎట్ల బయటపడాలె, కొత్తవాళ్ల మాటల్ని ఎంతవరకు నమ్మాలె, అనుమానమొస్తె ఏం చేయాలో నేర్పిస్తరు. బస్తీ పిల్లలు బజార్ల పడకుండ దేశంల పది మెట్రో సిటీలల్ల ఇసుంటి కమ్యూనిటీ సెంటర్లు పెట్టిన్రు. ఈ ప్రయత్నం మరిన్ని ఊళ్లకు విస్తరించాలని కోరుకుందాం.
మా నాన్న హమాలీ. అమ్మ బట్టల షాపులో హౌజ్ కీపర్‌గా పనిచేస్తది. అమ్మ పొద్దున పది గంటలకు బయలుదేరి పోతది. అమ్మ వచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటలు అయితది. వాళ్లు వచ్చేదాంక ఎదురు చూడకుండ ఇల్లు ఊకి, బోళ్లు తోమిపెడతాను. వంట కూడా చేస్తా. అన్నం, టమాటా కూర వండుత. అమ్మ కోసం ఎదురుచూస్తూ ఉండకుండా నేను తమ్ముడు తింటాం. మా ఇంటికి దగ్గర్లో రెయిన్బో కమ్యూనిటీ కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ మూడేండ్ల కిందట స్టార్ట్ అయింది. మా స్కూల్లోని ఒకమ్మాయి బాల సంఘటన్లో చేరింది. ఆమె చెప్తే నేనూ వచ్చి చేరిన. బడి నుంచి పావు గంటల ఇంటికి పోయి, ఫ్రెష్ అయ్యి, తమ్ముడిని తీసుకుని ఈడికి వస్త. హోమ్ వర్క్ చేసుకుంట. ఈడికి వచ్చినంక మార్కులు పెరిగినయి. టీచర్లు మంచిగ చదువుతున్ననని మెచ్చుకున్నరు. సమ్మర్ హాలిడేస్‌లో బడిలాగే ఇక్కడ చదువుకుంటున్నం. ఆడుకుంటున్నం.
పిల్లలు లైంగిక వేధింపుల బారినపడితే.. వాళ్లకు బాల సంఘటన్లో మనోధైర్యాన్నిచ్చే మాటలు చెబుతాం. కౌన్సెలింగ్ చేస్తాం. వాటి నుంచి బయటపడే దారి చూపిస్తాం. లైంగిక వేధింపుల బారినపడకుండా జాగ్రత్తలు నేర్పిస్తాం. పిల్లలు, తల్లిదండ్రులకు పోక్సో చట్టం, బాల కార్మిక చట్టం, విద్యా హక్కు చట్టం గురించి అవగాహన కల్పిస్తాం. పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ల నుంచి, బలాత్కారం చేసే వాళ్ల నుంచి తమను తాము కాపాడుకోవడం నేర్పిస్తాం. ఇలా చేయడం వల్ల పిల్లలకు సామాజిక భద్రతతోపాటు తల్లిదండ్రులకు భరోసా ఉంటుంది. అలాగే పిల్లల్ని దారితప్పకుండా కాపాడుకోవచ్చు. పేదింటి బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయొచ్చు.