‘గడ్డి మొలవని బీడులో అడవుల్ని సృష్టిస్తారట’ అని అందరూ నవ్వారు. ఆ తండ్రీకూతుళ్ల పరిశ్రమతో… ఆ నవ్విన వాళ్ల్లే ముక్కున వేలేసుకున్నారు! తండ్రి పేరు రాధామోహన్, తనయ సబర్మతి. గాంధేయవాది అయిన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పెరిగిన సబర్మతి పట్నం విడిచి పల్లెకు వచ్చింది. తండ్రితో కలిసి సాగుబాట పట్టింది. ఇద్దరూ కలిసి బీడు భూమికి అడవిని కానుకగా ఇచ్చారు. సేంద్రియ సాగులో ఆదర్శరైతులుగా కీర్తిగడించారు. సేంద్రియ సేద్యం, సుస్థిర వ్యవసాయంలో ప్రయోగాలెన్నో చేసి రైతులకు పాఠాలు చెప్పారు. పద్మశ్రీ అవార్డులే కాదు రైతుల ప్రేమాభిమానాలూ గెలుచుకున్నారు. ఆ తండ్రికూతుళ్ల కథే ఇది..
నాలుగు దశాబ్దాల క్రితం… ఒడిశాలోని నయాగర్ జిల్లా దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఆ వనంలోని ఒడగాన్ అనే ఊరిలో ఏ చెట్టూ పెరగని, గడ్డి కూడా మొలవని బంజరు విస్తరించి ఉంది. అది చూసి రాధామోహన్ అనే ఓ పెద్దాయన, ఆయన కూతురు సబర్మతి అక్కడే ఆగిపోయారు. ఒకనాడు అక్కడ ఓ కారడవి ఉందని చెప్పడానికి సాక్షిగా కొన్ని ఎండిన చెట్ల ఆనవాళ్లు ఉన్నాయి. కానీ, వీళ్లు వెళ్లేనాటికి అక్కడక్కడా పెరిగిన తుమ్మలు, వాటి ఆకులు తింటూ మేకలు, గొర్రెలు కనిపించాయి. ఒకప్పుడు సాగుబడితో దిగుబడి పంచిన నేలంతా బీడువారి దర్శనమిచ్చింది. సారమంతా పోయిన ఆ నేలలో పంటలు పండవని రైతులు ఆశలు వదులుకున్నారు. ఆ నేలను మాగాణం చేయాలని భావించారు ఈ తండ్రీకూతుళ్లు. ఆ భూమిని తమకు అమ్మమని అక్కడివారిని కోరారు. ‘ఈ బంజరు మీరేం చేసుకుంటార’ని వాళ్లడిగారు. ‘వ్యవసాయం చేస్తామ’ని చెప్పారు. ‘రైతు కుటుంబంలో పుట్టి, సాగు మీదనే ఆధారపడి బతికే మేమే చేతులెత్తేశాం. మీవల్ల ఏమవుతుంది?’ అని ఎగతాళిగా ప్రశ్నించారు. ‘ఏ తప్పులు చేసి నేలను చంపామో.. ఆ తప్పులు దిద్దుకుని ఈ భూమిని మళ్లీ బతికిస్తామ’ని వాళ్లిద్దరూ బదులిచ్చారు. ఊరివాళ్లు భూమి అమ్మడానికి సిద్ధమయ్యారు. అప్పటికే సేకరించిన విరాళాలతో 70 ఎకరాల భూమిని కొన్నారు.
ఇక సాగు మొదలుపెట్టాలి. కానీ, రాధామోహన్‌కి సాగు చేసిన అనుభవం లేదు. తాను ఓ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఏదో ఒక కాలక్షేపం చేస్తూ శేష జీవితం గడపాలని చాలామందికి ఉంటుంది. ఎక్కువమంది సుఖవంతమైన జీవితాన్ని కోరుకుని, సౌకర్యాలు సమకూర్చుకునే పని మొదలుపెడతారు. రాధామోహన్ మాత్రం కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అందరూ అసాధ్యమన్న కష్టాన్ని ఎంచుకున్నారు. తాము కొన్న భూమిని సారవంతం చేయాలన్నది వాళ్ల లక్ష్యం. అది కూడా సేంద్రియ పద్ధతిలో! ఎన్ని ఆటంకాలు ఎదురైనా తండ్రితో కలిసి పని చేయాలని సబర్మతి సిద్ధమైంది. తాము ఎంచుకున్న లక్ష్యం కోసం ఏం చేయాలో తెలుసుకునేందుకు ఇద్దరూ ఎంతోమంది నిపుణులను కలిశారు. సలహాలు అడిగాడు. వాళ్లంతా బీడుపొలాల్ని సేంద్రియ పద్ధతిలో సారవంతమైన భూములుగా మార్చడం సాధ్యం కాదన్నారు.
మీ ప్రయత్నం సఫలం కాదని నిరుత్సాహపరిచారు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని తండ్రీకూతుళ్లు సంకల్పించారు. కొనుగోలు చేసిన భూమిని సంరక్షించుకునేందుకు, భవిష్యత్ అవసరాల కోసం భూమి చుట్టూ వెదురు మొక్కలు వరుసగా నాటారు. వాటిని సంరక్షించారు. అవి పెరిగి కంచెలా ఆ భూమికి రక్షణగా మారాయి. మూడేళ్లు తిరిగే సరికి ఆ వెదురు వల్ల వారికి ఆశించని ఆదాయం వచ్చింది. అంతేకాదు మరో ఆనందమూ ఆ నేలపై చిగురించింది. అక్కడక్కడా గడ్డి మొలకెత్తింది. ఆ బంజరు కాస్తా పచ్చని తివాచీ పరచినట్టుగా మారిపోయింది. గడ్డిపువ్వులపై రకరకాల కీటకాలు, తుమ్మెదలు వాలడం మొదలైంది. అలా గడ్డి తర్వాత చిన్న చిన్న మొక్కలు మొలిచాయి. పెద్దపెద్ద చెట్లుగా ఎదిగాయి. అవి పక్షులకు ఆవాసంగా మారాయి. ఆ చెట్ల ఫలసాయమే ఆ పక్షులకు ఆహారమైంది. ఇదంతా చెప్పినంత తేలిగ్గా జరగలేదు.
ఆ నేలపై మొక్కలు పెరిగేందుకు కంచెగా పెంచిన వెదురు ఆకులు, సమీపంలోని అడవి నుంచి తెచ్చిన కొమ్మలు, ఆకులు ఈ నేలపై వేస్తుండే వాళ్లు రాధామోహన్, సబర్మతి. అవి కుళ్లిపోతూ, ఎరువుగా మారేవి. ఇలా చేయడం వల్ల నేల సారవంతం అవుతూ వచ్చింది. ఆ బీడులో నీటి లభ్యత కోసం చిన్న చిన్న జలాశయాలను ఏర్పాటు చేశారు. వాటిలోకి వర్షపు నీరు చేరేలా.. నేలను నీటి వాలుగా మలిచారు. తండ్రీబిడ్డలు ఏళ్ల తరబడి కష్టపడి నేలను సారవంతం చేశారు. రకరకాల పండ్ల మొక్కలు, కూరగాయలు పెంచడం మొదలుపెట్టారు. ఫలసాయం తీసుకోవడంతోపాటు సాగుచేసిన వ్యవసాయ వ్యర్థాలతో మళ్లీ ఆ భూమిని సారవంతం చేస్తూ వచ్చారు. ఈ క్రతువు మూడు దశాబ్దాలపాటు సాగింది. ఇప్పుడు ఆ నేలంతా దట్టమైన చెట్లతో అడవిలా మారిపోయింది. అందులో ఆకలి తీర్చే ఫల వృక్షాలెన్నో ఉన్నాయి. ఈ ఫుడ్ ఫారెస్ట్ వల్ల అటవీ ప్రాంతాల్లో పెరిగే జంతువులకు, పక్షులకు కావాల్సిన ఆహారం దొరుకుతున్నది. మరోవైపు ఈ చెట్ల మధ్య రకరకాల పంటలు సాగుచేశారు తండ్రీకూతుళ్లు. రసాయన ఎరువులు, పురుగు మందు వాడకం లేకుండా జీవామృతంతో కీటకాలు, తెగుళ్లను నివారించేవాళ్లు.
దేశంలో ఏ మూలన సుస్థిర వ్యవసాయం మొదలుపెట్టినా, సేంద్రియ పద్ధతిలో సాగు చేద్దామనుకున్నా.. రైతులు వారి సమస్యలకు పరిష్కారం కోసం రాధామోహన్, ఆయన కుమార్తె సబర్మతి వైపు చూస్తారు. వాళ్లు ఈ ఇబ్బందిని ఎలా పరిష్కరించారో తెలుసుకుని ఆచరిస్తారు. దేశంలోని లక్షల మంది సేంద్రియ రైతులు వీళ్లను అనుసరిస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు, ఫుడ్ ఫారెస్ట్ పెంచడం కోసం తండ్రీబిడ్డల కృషి కోట్లాది భారతీయ రైతులకు స్ఫూర్తినిస్తున్నది. తాము చేపట్టి పనులు, సాధించిన విజయాలను పదిమందికి చెప్పడం, నేర్పడం కూడా పనిగా పెట్టుకోవాలని తండ్రీకూతుళ్లు భావించారు. దీనికోసం ‘సంభవ్’ అనే సంస్థను స్థాపించారు. ఎలాంటి లాభాలూ ఆశించకుండా దేశం నలుమూలల నుంచి వచ్చే రైతులకు సాగు పద్ధతుల్లో శిక్షణనిస్తున్నారు. విత్తనాలను ఒకరి నుంచి మరొకరు మార్చుకునేందుకు సాయమందిస్తున్నారు. రైతు సంఘాలు సాధికారత సాధించేందుకు, సుస్థిరమైన పద్ధతులు ఆచరించేందుకు శిక్షణ మొదలుపెట్టారు.
ప్రతికూలతలోనూ నేలను సారవంతం చేసి, నీటి నిల్వలు పెంచి ఆ ప్రాంతాన్ని పచ్చదనానికి కేరాఫ్ మార్చడంలో రాధామోహన్, సబర్మతి విజయం సాధించారు. బీడు భూములను సారవంతమైన నేలలుగా మార్చేందుకు వీళ్లు చేసిన కృషి అద్భుతం. ఎడారుల్లో ఒయాసిస్సుల్లా నీటి వనరుల్ని పెంచిన పద్ధతులు ఆచరణీయం. వీరిద్దరూ పాటించిన విధానాలు అవార్డులు గెలుచుకోవడమే కాదు సేంద్రియ, సుస్థిర వ్యవసాయ విధానంలో ఓ చెరగని ముద్ర వేశాయి. ఈ కృషికి గాను సబర్మతికి నారీశక్తి పురస్కారం లభించింది. వ్యవసాయ రంగంలో వారిద్దరి పరిశ్రమకు భారత ప్రభుత్వం నాలుగో అత్యుతన్న పౌర పురస్కారమైన పద్మశ్రీని బహూకరించింది. ఇంపాక్ట్ లీడర్ అవార్డు, ప్రతిభా సమ్మాన్ అవార్డు లభించాయి. దేశంలోని రైతులను బీడు భూముల్ని ఫుడ్ ఫారెస్ట్‌గా మార్చేందుకు మార్గ దర్శకులుగా నిలిచి అవార్డుల కంటే గొప్పదైన గుర్తింపును పొందారు. గాంధేయవాద రైతు రాధామోహన్ 2021లో మరణించారు. అతని వారసత్వాన్ని కొనసాగిస్తూ సంభవ్ లక్ష్యాల కోసం సబర్మతి పనిచేస్తూనే ఉంది. ఇప్పుడు పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని పెంపొందించడం, రైతుల సుస్థిరాభివృద్ధి కోసం ఆమె కృషి చేస్తున్నది.
ఒకప్పటి బీడు చిక్కని అడవిగా మారింది. ఆ పచ్చని అడవిలో వెయ్యికిపైగా వృక్షజాతులు ఉన్నాయి. వీటి మధ్య రకరకాల పంటలు సాగవుతున్నాయి. ఈ పంటలన్నీ దేశవాళీ విత్తనాలే. మార్కెట్ మీద రైతు ఆధారపడకుండా సుస్థిరాభివృద్ధి సాధించాలని రాధామోహన్ అభిలాష. విత్తన స్వావలంబన, సేంద్రియ సాగు, సుస్థిరాభివృద్ధి ఆ తండ్రీకూతుళ్ల లక్ష్యాలు. అందుకే వాళ్లు దేశవాళీ పంటలను మాత్రమే పండించారు. దేశీయ పంటలు అంతరించి పోకుండా రకరకాల విత్తనాలు సేకరించి, వాటిని సాగు చేస్తూ విత్తన భాండాగారాన్ని సృష్టించి రైతులకు అందజేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటి వరకు 500 రకాల వరి వంగడాలు సాగు చేశారు. 100 రకాల కూరగాయలు, 40 రకాల పండ్ల చెట్లు, అన్ని రకాల పప్పు ధాన్యాలు సాగు చేశారు. వీటన్నిటి కోసం ఈ వ్యవసాయ క్షేత్రంలోనే విత్తన బ్యాంక్‌ని కూడా నిర్వహిస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం విత్తనాల నిల్వ, సాగు పద్ధతులను డాక్యుమెంట్ చేస్తున్నారు.