ఏఐ.. అద్భుతమని కొందరి మాట! ఆగం చేస్తుందని ఇంకొందరి అభిప్రాయం. సరిగ్గా వాడుకుంటే కృత్రిమ మేధ ఎన్ని అద్భుతాలనైనా చేయగలదు. ప్రోగ్రామింగ్ కోడింగ్ రాయడం ఏఐకి చిటికెలో పని. వైద్యంలో సాయం అందించడంలోనూ ముందుంది. మసకబారిన మేధస్సుతో పుట్టి, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఆటిజం చిన్నారుల జీవితాలను అదే కృత్రిమ మేధతో తీర్చిదిద్దుతున్నది ‘పినాకిల్ బ్లూమ్స్’. ఆటిజం బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి పట్టుదల నుంచి వచ్చిన ఈ సాంకేతిక శస్త్రం.. ఎందరెందరో తల్లుల గుండె బాధను తగ్గిస్తున్నది. లక్షలాది మంది ఆటిజం చిన్నారుల ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నది.
కడుపులో ఓ నలుసు పడింది మొదలు.. తల్లికీ, బిడ్డకూ మధ్య దూరాన్ని ఎంతో దగ్గర చేసింది నేటి ఆధునిక టెక్నాలజీ! పిండం ఎలా రూపుదిద్దుకుంటున్నది, అవయవాలు ఆకృతి దాల్చడం, కాన్పు ఎప్పుడు.. అన్ని విషయాల్లోనూ తల్లిని అంటిపెట్టుకొని ఉంటున్నది. కానీ, ఇవేం అంతగా లేని రోజుల్లో డాక్టర్ శ్రీజారెడ్డి సరిపల్లి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ముద్దులొలికే బిడ్డ బోసినవ్వులు చూసిన మురిపెం తీరకముందే.. ఆ చిన్నారి ఆటిజం (వీఓసీ ఆబ్సెంట్)తో పుట్టిందని తెలిసింది. కన్నీరుమున్నీరైంది.
తన బిడ్డను ఆటిజం ఉచ్చు నుంచి బయటపడేయాలని నిశ్చయించుకుంది. ఆస్పత్రులన్నీ తిరిగింది. వైద్యులందరినీ సంప్రదించింది. ఈ క్రమంలో కారణం తెలియకుండా ఆటిజం సమస్యతో బాధపడుతున్న చిన్నారులు ఎందరో ఉన్నారని శ్రీజారెడ్డికి అర్థమైంది. చిన్నారుల ముచ్చటైన బాల్యాన్ని చిదిమేస్తున్న ఈ సమస్యపై యుద్ధం ప్రకటించింది. తన శక్తియుక్తులన్నీ ఒడ్డి ఏండ్ల తరబడి దానిపై పరిశోధనలు చేసింది. దేశదేశాలన్నీ పర్యటించింది. నూతన విధానాలను అధ్యయనం చేసింది. సొంతంగా భారత్ హెల్త్ కేర్ సంస్థను ప్రారంభించింది. ‘పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్’ పేరుతో థెరపీ సెంటర్లను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.
ఆటిజం చికిత్సా విధానానికి సాంకేతికత జోడించింది శ్రీజారెడ్డి. థెరపాటిక్ ఏఐ ఆవిష్కరణతో బుద్ధి మాంద్యం ఉన్న చిన్నారుల తలరాతలను మార్చగలుగుతున్నది. ఏదైనా సమస్య మూలాల్లోకి వెళ్తేనే తెలుస్తుంది దాని లోతెంతో. పుట్టిన బిడ్డకు బుద్ధి మాంద్యం ఉందని తల్లిదండ్రులకు తెలిసినప్పుడు ఆ బాధ కడుపుకోత కన్నా తీవ్రంగా ఉంటుంది. అభం శుభం ఎరుగని ఆ చిన్నారిని ఎలా పెంచాలో తెలియక నిత్యం నరకం అనుభవిస్తుంటారు. దీనికి పరిష్కారమే పినాకిల్ బ్లూమ్స్. ఇక్కడ నిపుణులైన థెరపిస్ట్‌లు ఆటిజం చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుతుంటారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో చేపట్టే థెరపీలు చిన్నారుల మస్తిష్కాన్ని సానబెడతాయి. బిడ్డ మానసిక స్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తారు.
చిన్నారుల ప్రవర్తనలో మార్పునకు దోహదం చేసే ప్రత్యేక ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్, థెరపీ గోల్స్, డైలీ థెరపీ, మెటీరియల్ ఇలా రకరకాల విధానాలను అవలంబిస్తూ ఆటిజం ఛాయలను తగ్గిస్తారు. 400కు పైగా ఇన్నోవేటివ్ విధానాలతో బుద్ధి మాంద్యాన్ని మొగ్గలోనే తుంచేసే ప్రయత్నం చేస్తున్నారు. 160కి పైగా పేటెంట్ టెక్నాలజీ ఆవిష్కరణలను సృష్టించి, వాటిని వివిధ థెరపీల్లో ఉపయోగిస్తూ పిల్లల మానసిక వికాసానికి దోహదం చేస్తున్నారు. గడిచిన పదిహేనేండ్లలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారుల మానసిక స్థితిని మెరుగుపర్చడమే కాకుండా శారీరకంగా వారి ఎదుగుదలకు తగిన తోడ్పాటును అందించింది పినాకిల్ బ్లూమ్స్.
పినాకిల్ ద్వారా అందిస్తున్న థెరపీలు, సేవా కార్యక్రమాలకు గానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘నెంబర్ #1 ఆటిజం థెరపీ సెంటర్స్ నెట్వర్క్-2023’ పురస్కారాన్ని అందుకున్నది శ్రీజారెడ్డి బృందం. ‘ఏ రంగంలో చూసినా.. ఏఐ ఇప్పుడు ట్రెండింగ్. మేం రూపొందించిన థెరపాటిక్ ఏఐ ఇంజన్ కూడా అలాంటిదే. ఆటిజం థెరపీ రంగంలో, ఇది ప్రపంచంలోనే తొలి ఆర్టిఫీషియల్ సెర్చింజన్. ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో థెరపాటిక్ ఏఐ విధానాల్ని ఫాలో అవుతున్నాం.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 97 శాతం సక్సెస్ రేట్‌తో 10.3 మిలియన్ థెరపీలను అందించాం. ఇది ఆటిజం నుంచి పిల్లల జీవితాలను రక్షించాలనే మా యజ్ఞంలో మేం అందుకున్న మైలురాయి. థెరపీల తర్వాత తమ చిన్నారుల్లో వచ్చిన మార్పును చూసినప్పుడు తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించే సంతోషం మాటల్లో చెప్పలేని తృప్తిని కలిగిస్తుంది. ఒక తరం రంగుల కలలను, ఒక కుటుంబం ఆశలను కృత్రిమ మేధతో రక్షించగలుగుతున్నాం’ అని చెబుతున్నది సంస్థ సీఈవో శ్రీజారెడ్డి. మరిన్ని మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో
బ్లూమ్స్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నారు. నిరంతర పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అలాగే, ఓ ప్రత్యేక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారైనా పినాకిల్ బృందాన్ని సంప్రదించొచ్చు. ఫ్రాంచైజీల ద్వారా కూడా దేశవ్యాప్తంగా థెరపీ సెంటర్లను నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నారు శ్రీజారెడ్డి. తనలాంటి బాధ ఇంకే తల్లిదండ్రులూ పడకూడదన్న ఉద్దేశంతో ఈ డాక్టరమ్మ చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం.
ఆటిజం చిన్నారులు తమ కాళ్లపై తాము నిలబడేందుకు, తమకంటూ ఒక చక్కని జీవితం ఏర్పరచుకునేందుకు తల్లిదండ్రులతో పాటు సమాజమూ సాయమందించాలి. అందుకే మనమందరం ఆటిజం చిన్నారుల పక్షాన నిలబడదాం. వారికి కొత్త జీవితాన్ని ఇద్దాం.
‘పినాకిల్ బ్లూమ్స్’ అదే పని చేస్తున్నది! ఎవరైనా మా సంస్థతో కలిసి పనిచేయాలనుకుంటే… 9100 181 181 కాల్ చేయొచ్చు. https://www.pinnacleblooms.org వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.