HomeSuccess-storyNisha Agarwal Is The Managing Director Of Ck Pearls And Gems
పగడమంత ప్రతిభ
‘అందరిలా ఉండలేను. అలా అని నా ఉనికిని ప్రశ్నార్థకం కానివ్వలేను.అందుకే, సాధారణ మార్వాడీ మహిళలకు భిన్నంగా వ్యాపారంలో అడుగుపెట్టాను. అక్కడితో ఆగిపోతాననే భయానికి తావులేకుండా... ఆత్మీయుల ప్రోత్సాహంతో 100 ఏండ్ల కుటుంబ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టాను.
‘అందరిలా ఉండలేను. అలా అని నా ఉనికిని ప్రశ్నార్థకం కానివ్వలేను.అందుకే, సాధారణ మార్వాడీ మహిళలకు భిన్నంగా వ్యాపారంలో అడుగుపెట్టాను. అక్కడితో ఆగిపోతాననే భయానికి తావులేకుండా… ఆత్మీయుల ప్రోత్సాహంతో 100 ఏండ్ల కుటుంబ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టాను. అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటూ… ఎంతోమందిని ముత్యాలు, పగడాల నగల తయారీలో శిక్షణనిచ్చే స్థాయికి తీసుకొచ్చాను. సాదాసీదా జమాఖాతాలు చూసుకోవడంతో మొదలుపెట్టి .. మా సంస్థను ఖండాంతరాలకు విస్తరించాను’ అంటూ తన విజయ గాథ వివరిస్తున్నారు సీకే పర్ల్స్ అండ్ జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నిషా అగర్వాల్.
నిషా అగర్వాల్
సంప్రదాయ మార్వాడీ కుటుంబంలో పుట్టాన్నేను. తరాలుగా మావారి కుటుంబానికి ముత్యాల వ్యాపారం ఉంది. కాకపోతే మా ఇండ్లలో కాలేజీ చదువుల వరకూ వెళ్లేవారు అతి తక్కువ. నాన్న చార్టర్డ్ అకౌంటెంట్ కావడంతో.. నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఉస్మానియా నుంచి ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. అత్తగారింటికి వచ్చిన తర్వాత ఎంతో ఇష్టంగా వ్యాపారంలో అడుగుపెట్టాను. మా పుట్టింటికి పూర్తి భిన్నమైన కుటుంబ నేపథ్యం కావడంతో.. మొదట్లో ఇంటి దగ్గరే ఉండేదాన్ని. మావారి భరోసా బిజినెస్ వైపు దృష్టి పెట్టేలా చేసింది. నాలుగు తరాలుగా కొనసాగుతున్న ముత్యాలు, పగడాల ఆభరణాల వ్యాపారాన్ని దిగ్విజయంగా నడిపించే స్థాయికి తీసుకెళ్లింది. ఒకటిన్నర దశాబ్దంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. ప్రతి సమస్యలోనూ ఓ వ్యాపార అవకాశాన్ని వెదుక్కున్నాను.
సమాజం అన్నాక పరిమితులు ఉంటాయి. కుటుంబం అన్నాక సమస్యలూ ఉంటాయి. వాటిని అధిగమిస్తేనే.. ఏ మహిళ అయినా తన కలల్ని నిజం చేసుకుంటుంది. తన ఉనికిని నిరూపించుకుంటుంది. అదే సమయంలో కుటుంబ బాధ్యతల్ని, వ్యాపారాన్నిసమతౌల్యం చేసుకునే సామర్థ్యమూ పెంచుకోవాలి.
హైదరాబాద్ ముత్యాలు
గోల్కొండ సుల్తానుల కాలం నుంచీ ఇరాన్, ఇరాక్ వ్యాపారులే ముత్యాలు విక్రయించేవారు. ముత్యాలకు పుట్టినిల్లుగా చెప్పే బస్రా నుంచి వచ్చిన వర్తకులు… వాటిని ఏం చేయాలో తెలియక కుప్పలుగా పోసి అమ్మేవారు. మనవాళ్లు వాటికి మెరుగులద్ది, ఆభరణాలను తయారు చేసి మహారాణులకు, బేగం సాహిబాలకు అందించేవారు. అలా హైదరాబాద్‌కు ముత్యాలతో అనుబంధం ఏర్పడింది. ఇప్పటికీ హైదరాబాద్‌లో నాణ్యమైన ముత్యాలను విక్రయించే వర్తకులు ఎంతోమంది. నాసిరకం ముత్యాలతో మోసాలు చేసేవారు అంతకు రెట్టింపు ఉన్నారు. ఇలాంటి పనులే నగర ఖ్యాతిని మసకబారేలా చేస్తున్నాయి. రెడ్, సౌత్ సీ, కల్చర్, కేషీ వంటి సహజసిద్ధమైన ముత్యాలే నిఖార్సయినవి.
కానీ ఇటీవల కాలంలో, ఆల్చి
ప్పలను ప్రాసెస్ చేసి కృత్రిమ ముత్యాలు తయారు చేస్తున్నారు. వాటినే అమాయ కులకు అంటగడుతున్నారు. కానీ, మాచంఘమాల్-కేదారీనాథ్ (సీకే పర్ల్స్ అండ్ జెమ్స్) మాత్రం తరాలుగా విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్నది. గతంలో బంగారానికి, ముత్యాల ఆభరణాలకు అపారఆదరణ ఉండేది. అయితే, పెరుగుతున్న బంగారం ధరల కారణంగా కరోనా తర్వాత ముత్యాలకు ఒక్కసారిగా
డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచీ కేవలం ముత్యాలతో చేసిన ఆభరణాలను కూడా మగువలు ఇష్టపడుతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం, జపాన్, హాంకాంగ్, చైనా, వియత్నాం వంటి దేశాల్లో ఉత్పత్తి పడిపోవడంతో ముత్యాల ధరలు కూడా పెరుగుతున్నాయి.
విస్తరణపై దృష్టి..
ఐఐఎం- బెంగళూరు ఉమెన్ ఆంత్రప్రెన్యూర్షిష్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు హాజరైన తర్వాత వ్యాపార విస్తరణపై మరింత దృష్టిసారించాను. శతాబ్దాలుగా ముత్యాల వ్యాపారానికి కేంద్రంగా ఉన్న చార్మినార్ నుంచి ఐటీ కారిడార్ వైపు విస్తరిస్తున్నాం. ఈ కామర్స్‌పైనా దృష్టి పెట్టాం. అయితే ఈ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఆ సమస్యకు పరిష్కారంగానే కాదు, మహిళల ఆర్థిక స్వేచ్ఛను ప్రోత్సహిస్తూ.. జువెలరీ
డిజైనింగ్‌తో పాటు, రత్నాభరణాల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషిస్తున్న కొవే (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్ర ప్రెన్యూర్స్) -తరఫున ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించే ఆలోచనా ఉంది.