Inspiration | ఆవిష్కరణలు ఆకాశంలోంచి ఊడిపడవు. అవసరాలే వాటికి పునాదులు. అతీతశక్తులు ఏ అద్భుతాన్నీ సృష్టించలేవు. నిర్విరామ కృషితో మానవ మాత్రులు సాధించినవే అన్నీ. నీలిమ కోనూరి గెలుపు కథా ఇలాంటిదే. తన బిడ్డ కోసం గృహ వైద్యాన్ని మొదలుపెట్టిన ఆ అమ్మ.. ఎన్నో రుగ్మతలకు పరిష్కారాలు కనిపెట్టారు. చెడు ప్రభావాలు లేని సౌందర్య ఉత్పత్తులు అందిస్తున్నారు. ఆ బ్యూటీప్రెన్యూర్ హెల్దీ కాస్మెటిక్ జర్నీ ఇది..
వ్యాపార ఆలోచనలు ఆకాశంలోంచి ఊడిపడవు. నిజ జీవిత అనుభవాల నుంచి పుట్టుకొస్తాయి. తల్లిగా, భార్యగా, ఉద్యోగిగా.. మనకు ఎదురయ్యే ప్రతి సమస్యా మనకంటూ ఓ అవకాశం ఇస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా బిడ్డకు ఎదురైన ఓ ఇబ్బందే. నన్ను ఆంత్రప్రెన్యూర్ను చేసింది.
నేను హైదరాబాద్‌లో పుట్టిపెరిగాను. సెంట్రల్ యూనివర్సిటీలో మాలిక్యులర్ బయాలజీ, క్యాన్సర్‌పై పీహెచ్డీ చేశాను. పెండ్లి తర్వాత అమెరికా వెళ్లాను. యూనివర్సిటీ ఆఫ్ టోలెడోలో క్యాన్సర్‌పై పోస్ట్ డాక్టొరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్) చేశాను. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ నుంచి మరో పీడీఎఫ్ చేశాను. దీనివల్ల క్యాన్సర్ కారకాలు, రసాయనాల దుష్ఫభావాల పట్ల అవగాహన వచ్చింది. పరిశోధనలో భాగంగా ఆ ప్రమాదకర వాతావరణంలోనే నేనూ పనిచేసేదాన్ని ఆ కోరల నుంచి తప్పించుకునేందుకు భారత్ నుంచి ఆయుర్వేద, హోమియో మందులు తెప్పించు కునేదాన్ని. అంతలోనే, మా అబ్బాయికి ఎగ్జిమా వచ్చింది. మనం చర్మానికి రాసుకునే రకరకాల క్రీమ్స్‌లో విషపూరిత రసాయనాలు ఉంటాయి. తయారీలోనూ విచ్చలవిడిగా స్ట్టెరాయిడ్స్ వాడతారు. నా బిడ్డ కోసం ఆ చెడు ప్రభావాలు సోకకుండా.. ఓ సురక్షితమైన క్రీమ్ తయారు చేశాను. దాన్ని వాడిన తర్వాత ఎగ్జిమా తగ్గిపోయింది. ఇలా, అనుకోకుండా పరిశోధన నుంచి తయారీవైపు దృష్టి పెట్టాల్సి వచ్చింది.
కాస్మెటిక్ ఇండస్ట్రీ అనేది బిలియన్ డాలర్ మార్కెట్. మనం వాడే సబ్బులు, టాల్కమ్ పౌడర్లు, క్రీములు, లిప్స్టిక్స్, డియోడరెంట్స్, లోషన్స్, షాంపూలు, ఆయిల్స్.. అన్నిటిలోనూ రసాయనాల ఆనవాళ్లు ఉంటాయి. చాలాసార్లు వాటిని జోడించడం అనివార్యం కూడా. లేకపోతే పాడైపోతాయి. కాస్మెటిక్స్‌కు ఆ సువాసనలు, రంగులు కూడా రసాయనాల మేళవింపు వల్ల వచ్చేవే. ఆ ఆకర్షణలో చిక్కుకుపోయి.. దీర్ఘకాలిక అనారోగ్యం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల రుగ్మతలు, వివిధ క్యాన్సర్ల బారిన పడే ప్రమాదమూ ఉంది. సాధారణంగా సబ్బులు, పౌడర్లు, క్రీముల తయారీ కోసం పెట్రోలియం ఉప ఉత్పత్తులు, కృత్రిమ రంగులు, కృత్రిమ పరిమళాలు, విష రసాయనాలు ఉపయోగిస్తారు. వీటివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. కాస్మెటిక్స్‌లో జోడించే సిలికోన్స్.. మన స్వేద రంధ్రాలను మూసేస్తాయి.
చెమటను, దాంతోపాటు వ్యర్థాలను విసర్జించ కుండా అడ్డుపడతాయి. దీంతో వ్యర్థాలు చర్మం లోపలి పొరల్లో వ్యాపిస్తాయి. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. ఆ ప్రభావం క్యాన్సర్ కూ దారితీయొచ్చు.
పసిపిల్లల కోసం వాడే ఉత్పత్తులనూ విష రసాయనాలు వదిలిపెట్టలేదు. వాటి నుంచి మా పిల్లలను తప్పించాలని.. పౌడర్లు, క్రీములు, సబ్బుల తయారీ కోసం కొత్త ఫార్ములేషన్స్ సిద్ధం చేసుకున్నాను. ఆ ఫలితాలు చూసి ఇరుగుపొరుగు తమకూ ఇవ్వమని అడిగేవారు. అమెరికాలో చట్టాలు కచ్చితంగా పాటిస్తారు. దీంతో, నా ఉత్పత్తుల అమ్మకానికి ఓ కంపెనీ రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. అంతలోనే, మా ఆయనకు బదిలీ అయ్యింది. ఇండియాకు వచ్చేశాం. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. ఇక్కడ కూడా నా పరిశోధనలు ఆపలేదు. భారత ప్రభుత్వం నుంచి 23 రకాల ఫార్ములేషన్స్‌కు అనుమతి సంపాదించాను.
ఆ ఆత్మవిశ్వాసంతో బాలానగర్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేశాను. ఎన్. మంత్ర బ్రాండ్‌తో మేము తయారు చేసే కాస్మెటిక్, స్కిన్‌కేర్, హెయిర్‌కేర్ ప్రొడక్ట్స్‌లో రసాయనాలు, కృత్రిమ రంగులు, పరిమళాలు ఉపయోగించం. నిలువ కోసమైనా సరే విష రసాయనాల జోలికి వెళ్లం. ఆర్గానిక్ ఉత్పత్తులకు యూఎస్డీఏ సర్టిఫికేషన్ లానే.. ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులకు ఎకోసెర్ట్ ధ్రువీకరణ వస్తుంది. ఆ సర్టిఫికేషన్ కూడా మేం సాధించాం. మా ఉత్పత్తులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎగ్జిమా దురదను తగ్గించే బాడీ క్రీమ్‌తో మొదలైన నా ప్రయాణం ఇంతవరకూ వచ్చింది. నా విజయం వెనుక కుటుంబ ప్రోత్సాహం అపారం.
– నాగవర్ధన్ రాయల