అది కాకులుదూరని కారడవి కాదు. చీమలు దూరని చిట్టడవీ కాదు. యాదగిరిగుట్ట సమీపంలోని ‘అరణ్య’ ఓ మోస్తరు అర్బన్ ఫారెస్ట్. ఈ వనంలో ఏనుగులు కనిపిస్తాయి. వెంటాడని పులులు తారసపడతాయి. సింహం రాజసంగా కనువిందు చేస్తుంది. ఖడ్గ మృగం గంభీరంగా ఎదురు పడుతుంది. ఈ వన్యమృగాలన్నీ కదలక మెదలక కనువిందు చేసేవే! ఓ కళాకారిణి సృజనకు అద్దంపడుతూ బండరాళ్లపై తిష్ట వేశాయివి. రాళ్ల తొంపుల మీద వంపులు గీయడం అలకగయ్యే పనికాదు. కానీ, భువనగిరి బిడ్డ నామోజు లావణ్య కుంచెలోంచి జాలువారిన వర్ణాలు.. ఈ శిలలకు జీవం పోశాయి. స్వయంకృషితో రాక్‌స్టార్‌గా ఎదిగిన ఈ చిత్రకారిణి కథాకమామీషు ఆమె మాటల్లోనే…

మా నాన్న నామోజు సురేందర్ ఆర్టిస్ట్. బోనగిరిలోనే సైన్ బోర్డులు, ఫ్లెక్స్ బోర్డ్స్ రాసేవాడు. ఆర్టిస్ట్ ఇంట్లో పుట్టి పెరిగిన కాబట్టి చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడానికి ఇష్టపడేదాన్ని. మా నాన్న పట్టుబట్టి నాకు ఆర్ట్ నేర్పలే. నేనే ఆసక్తితో నేర్చుకున్నాను. స్కూల్లో చదివేప్పుడు పోటీలకు పోతుంటి. ప్రతి పోటీలో ఫస్ట్ ప్రైజ్ నాదే! ఎన్నికల కమిషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆర్ట్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న.
నేను దేన్నైనా తొందరగా గ్రహిస్త. మనసులో అనుకున్ననంటే పర్ఫెక్ట్గ చేసేదాంక వదిలిపెట్ట. పెన్సిల్, స్కెచ్, బొగ్గు, బ్రష్.. ఏ మీడియంతో ఏ ైస్టెల్ వర్క్ అయినా చేస్త. అన్నీ సొంతంగా నేర్చుకున్న. నాకు నేనే గురువు. ఇంటర్ తర్వాత… తెలుగు యూనివర్సిటీకి ఎంట్రన్స్ రాసిన. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) కోర్స్ చదివితే కెరీర్ ఎట్లుంటదని కనుక్కున్న. అది చదివితే పెద్దగా లాభం లేదని చాలామంది చెప్పినరు. నాలుగేళ్లు యూనివర్సిటీలో చదవాలె.
టైమ్ వేస్ట్ అనుకుని చేరలె. ఆర్టిస్ట్‌కి సర్టిఫికెట్ ముఖ్యం కాదనుకున్న. స్కిల్స్ ఉంటే ఎక్కడైనా రాణిస్తమని భావించిన. అన్నీ అబ్జర్వ్ చేస్తే నాలెడ్జ్ అదే వస్తదనుకున్న. బీకామ్‌లో చేరి ఇంటిదగ్గరే ఉండి ఆర్ట్‌ని ఇంప్రూవ్ చేసుకున్న. కరోనా టైమ్‌లో మా నాన్న పోయిండు. ఆ సమయంలో ఇంట్లనె బొమ్మలు గీసుకుంట ఉన్న. కొంతమంది వాళ్ల పోర్ట్రెయిట్ గీసిపెట్టమని అడిగారు. బొమ్మకు ఆరు వేల నుంచి పన్నెండు వేలు తీసుకున్న. ఈ ఫీల్డ్ గురించి చానామందికి తెలియక ‘ఆర్ట్‌కి ఆదరణ లేదు. బతకడం కష్టం’ అని అనుకుంటున్నరు. అది నిజం కాదు.

ఏదో ఒక ఉద్యోగంలో చేరితే నెలకు ఇంత జీతం వస్తది. అప్పుడు ఆఫీస్, ఇల్లే ప్రపంచమైతది. అదే ఆర్ట్ మీద వంద శాతం ఫోకస్ చేస్తే సక్సెస్ ఉంటదనుకున్న. ఒకవేళ సక్సెస్ కాకపోయినా కళాకారిణిగా ఆత్మసంతృప్తి ఉంటదనుకున్న. ఆర్ట్‌ని ఇంప్రూవ్ చేసుకుని, ఎక్కువ కష్టపడాలనుకున్న. డిగ్రీ తర్వాత పక్కాగా ఆర్టిస్టుగనే బతకాలనుకున్న. డిగ్రీ అయిపోయింది. అప్పటికే అడిగినోళ్లకు అడిగినట్టు బొమ్మలు గీసి పెడుతున్న. ఆ రోజుల్లో బయట మార్కెట్ తెలియదు. అవకాశాలు పెద్దగా ఉండవని నా మైండ్‌లో నెగెటివ్ ఉండె. నా అంచనా తప్పని కొద్ది రోజుల్లోనే రుజువైంది. వాల్ పెయింటింగ్, ఇంటీరియర్ ఆర్ట్ వర్క్స్ కాంట్రాక్ట్ తీసుకునే ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం మొదలుపెట్టిన. మార్కెట్ క్రియేట్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటదని తెలిసొచ్చింది.

ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నా వర్క్ చూసింది. ఆ మేడమ్‌కి నా బొమ్మలు బాగా నచ్చినయి. ఈ అమ్మాయి బొమ్మలు భలేగ వేస్తున్నదనీ, నన్ను ఎంకరేజ్ చేయాలనుకున్నది. ఆ మేడమ్ నన్ను పిలిచి… ‘పెద్ద పెద్ద రాళ్ల మీద యానిమల్స్ బొమ్మలు వేయాలె. గీస్తవా?’ అనడిగింది. సరేనని చెప్పిన. వెంటనే ఆ మేడమ్ ‘నీ టాలెంట్ అంతా చూపిచ్చెయ్’ అని ఒక మంచి అవకాశం ఇచ్చింది. యాదగిరిగుట్ట సమీపంలో ‘అరణ్య’ అని అర్బన్ ఫారెస్ట్ ఉంది. అందులో ఉన్న రాళ్ల మీద వన్యప్రాణుల బొమ్మలు గీసే పని ఇచ్చింది. ఉత్సాహంగా పని మొదలుపెట్టాను. బండరాళ్లనే నా కాన్వాస్‌గా మార్చుకున్న.
బండల మీద బొమ్మలు గీయాలంటే ఎండాకాలం అనుకూలం. మండే ఎండల్లో రాళ్లు భగభగ మండుతుంటయ్. అయినా ఓపికతోని పనిచేసిన. ఇట్లాంటి బొమ్మలు ఇంతకుముందెన్నడు గీయలె. వాల్ పెయింటింగ్ ఎంత తేలికో, రాక్ పెయింటింగ్ అంత కష్టం. వాల్ ఫ్లాట్గ ఉంటది. రాక్ ఎగుడు దిగుడుగా ఉంటది. గుంటలు, పెచ్చులుంటయి. అయినా బొమ్మ గీస్తే.. గోడ మీద ఎట్ల కనిపిస్తదో అట్ల కనిపించాలె. నిలువు, అడ్డు గీతలు కొట్టి గ్రిడ్‌లో బొమ్మలు గీయడం బండల మీద సాధ్యం కాదు. కళ్లతో చూసి మనసులో ఊహించుకుంట ఫ్రీ హ్యాండ్ ఆర్ట్ చేయాలె. బ్రెయిన్ వర్కే కాదు ఫిజికల్ వర్క్ కూడా చేయాలె. ఒక పెద్ద రాయి మీద బొమ్మ గీయాలంటె పైకి ఎక్కి బొమ్మ కొద్దిగ గీయాలె. కిందికి దిగి, దూరంగ పోయి బొమ్మ ఎట్లుందొ చూడాలె. బండల మీద తొంపులు ఉంటయి. కాబట్టి దాన్ని బట్టి గీతని వంచుతం. అది చూసేప్పుడు ఎట్ల కనిపిస్తదో తెలుసుకోవాల్నంటె బొమ్మ పూర్తయిపోయ్యేలోపు ఇట్ల వందలసార్లు తిరగాలె.
ఆ అడవిల మనుషులు ఉండేది కాదు. వందల కోతులు చుట్టుముట్టేవి. నేల మీద పాములు తిరుగుతుండె. పొద్దుగూకుతుంటె అడవి పందులు తిరిగేవి. భయం భయంగ బొమ్మలు గీసిన. వాటిని చూసి ఫారెస్ట్ ఆఫీసర్ మేడం మస్త్ ఖుషీ అయింది. నేను వేసిన వాటిలో ఒక బండపై గీసిన ఏనుగు బొమ్మ చానా పెద్దది. ఎలిఫెంట్ వర్క్ ఇరవై అడుగుల ఎత్తు, ఇరవై తొమ్మిది అడుగుల వెడల్పు ఉంది. ఇంతపెద్ద రాక్ పెయింటింగ్ మరెక్కడా లేదంట. రికార్డ్ కోసం దరఖాస్తు చేసిన.
ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలంటే చానా కష్టపడాలె. ఆర్ట్ కెరీర్ల ఆదాయం మంచిగనే ఉంటందని ఎవరూ చెప్పరు. పైగా కష్టాలుంటయని భయపెడతరు. నిరాశపరిచే మాటలే చెబుతరు. ఒకరి సక్సెస్ చూసి జలసీగా ఉంటరు. తప్పుడు సమాచారంతో తప్పుదారి పట్టిస్తరు. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండ అనుకున్న పని చేసుకుంట పోయిన. ఒక ఆంత్రప్రెన్యూర్ ఎట్ల ఆలోచిస్తడో అట్ల ఆర్టిస్ట్ ఆలోచించాలె. కొత్తదనం, కొత్త ఆలోచనలు, కొత్త గోల్స్ ఉండాలె. లేకపోతే ఆర్టిస్ట్‌గా ఎదగలేరు. రిస్క్ తీసుకోవాలి. ప్రయోగాలు చేయాలి. జీవితం ఒకేసారి వస్తుంది. ఏదో చేయాలంటే మళ్లా మళ్లా రాదు. అనుకున్నది చేసుకుంట పోవాలె. సేఫ్ సైడ్ చూసుకోవాలె. ఇదే నేను ఎంచుకున్న దారి.
– నాగవర్ధన్ రాయల