‘ఒకే దేశం.. ఒకే లక్ష్యం.. సర్వైకల్ క్యాన్సర్ అంతం కోసం.. ఒక యాత్ర’ అంటూ ఇద్దరు మహిళలు నడుం బిగించారు. దూరమైనా, భారమైనా సరే.. దేశమంతా తిరుగుతూ సర్వైకల్ క్యాన్సర్ గురించి.. తల్లీ బిడ్డలకు అవగాహన కల్పించే లక్ష్యంతో సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టారు. నలభై రోజుల్లో భారత దేశం నలుదిశలూ చుట్టిరావాలనే పట్టుదలతో ‘ఫోర్ కార్నర్ ఇండియా డ్రైవ్’ మొదలుపెట్టారు మీనాక్షి, ప్రియ.
దేశంలో పెరిగిపోతున్న సర్వైకల్ క్యాన్సర్‌పై యుద్ధం ప్రకటించారు ఈ ఆడబిడ్డలు. ప్రాణాలు హరించే సర్వైకల్ క్యాన్సర్‌పై తల్లులకు, యువతకు అవగాహన కల్పించాలని, రేపటి ప్రమాదాన్ని తప్పించాలన్నదే వాళ్ల లక్ష్యం. ఇందుకోసం 15 వేల కిలోమీటర్ల యాత్రకు బయల్దేరారు. రోటరీ క్లబ్ సహకారంతో ముంబయిలోని నారిమన్ పాయింట్ దగ్గర ఈ యాత్ర మొదలైంది. పదిహేను రాష్ర్టాలు చుట్టి వచ్చే భారత యాత్ర మహారాష్ట్రను దాటి, గుజరాత్‌లోని అహ్మదాబాద్ మీదుగా భుజ్ పట్టణానికి చేరుకుంది.
సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించేందుకు ముందుకొచ్చిన వారిలో ఒకరు మీనాక్షి అరవింద్. ఎక్స్పీడీ ఇండియా అండ్ బియాండ్ వ్యవస్థాపకురాలామె. సుదూర యాత్రలు విజయవంతంగా పూర్తి చేయడంలో మీనాక్షికి సుదీర్ఘకాల అనుభవం ఉంది. ఈ యాత్రకు కో పైలట్‌గా ఉన్న ప్రియా రాజగోపాల్ న్యాయవాది. రోటరీ క్లబ్ ముంబయి శాఖ సభ్యురాలు కూడా. ఆరోగ్య పరిరక్షణ గురించి సామాన్య మహిళలకు అవగాహన కల్పించడం ఆమె అభిరుచి. అందుకే వీరిద్దరూ కలిసి ‘ఫోర్ కార్నర్ ఇండియా డ్రైవ్’ స్టీరింగ్ పట్టారు.
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) రకం వైరస్లు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. వీటి వల్ల అనేక వ్యాధులు తలెత్తుతాయి. ఈ వైరస్ల కారణంగా కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కానీ, ఈ సంగతి వైద్యరంగంలో ఉన్న వారికే తెలుసు. సామాన్య జనానికి తెలియదు. అందువల్లే మన దేశంలో ఏటా 67 వేల మంది సర్వైకల్ క్యాన్సర్ బారినపడి చనిపోతున్నారు. ఈ మరణాలను నివారించేందుకు, లక్ష మంది పేద ఆడపిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్లను ఉచితంగా అందించాలని సిద్ధమయ్యారు మీనాక్షి, ప్రియ. సర్వైకల్ క్యాన్సర్‌ని నివారించవచ్చని, వ్యాక్సిన్లతో ఆ జబ్బు రాకుండా జాగ్రత్తపడవచ్చని, ప్రాథమిక స్థాయిలో నిర్ధారణతో మరణాలను తగ్గించవచ్చని అందరికీ అర్థమయచ్యేలా ప్రచారం చేపట్టారు.
ఇందుకోసం ఎరుపురంగు ఇసుజు ఎస్యూవీ వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. దీనికి ‘లాల్ ప్యారీ’ అని పేరు పెట్టుకున్నారు. ‘లాల్ ప్యారీ ప్రయాణానికి ఉద్దేశించిన పేరు కాదు. స్త్రీ శక్తిని, స్త్రీల ఆకాంక్షల్ని చాటే సంకేతం’ అని చెబుతున్నది ప్రియ. స్త్రీలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే కరపత్రాలు, కిట్లు, వ్యాక్సిన్లు, ఆరోగ్య సిబ్బందిని ఈ లాల్ ప్యారీ మోస్తుంది. ఈ యాత్ర సాగిపోయే మార్గంలోని పట్టణాలు, పల్లెల్లోని వైద్య సిబ్బందిని కలుపుకొని స్థానిక ప్రజల వద్దకు వీళ్లు వెళ్తున్నారు. వాళ్లకు అవగాహన కల్పించడంతోపాటు పేద కుటుంబాల్లోని యువతులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తున్నారు. పద్దెనిమిది నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ముందే నిర్దేశించుకుని బయలుదేరారు.
పలు సంస్థల ఆర్థిక సహకారం, పట్టణాలు, నగరాల్లోని వైద్యులు, వైద్య సిబ్బంది సహకారంతో ‘ఫోర్ కార్నర్ ఇండియా డ్రైవ్’ దూసుకెళ్తున్నది. ఆగస్టు 19 నాటికి అనుకున్న దూరాన్ని మాత్రమే కాదు, సంకల్పించిన లక్ష్యాన్ని కూడా చేరుకోవాలని కోరుకుందాం. ఈ అవగాహన ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందితే సర్వైకల్ క్యాన్సర్, హెచ్‌పీవీ వైరస్ల వల్ల వచ్చే అనేక రకాల ప్రమాదాల నుంచి ఆడపిల్లలు రక్షణ పొందుతారు.
ఇది ఒక రోడ్డు ప్రయాణం మాత్రమే కాదు. అనేక ఆశలతో కూడిన ఆరోగ్యయాత్ర. మార్గమధ్యంలో ఎన్నో కుటుంబాలను పలకరిస్తున్నాం. మా యాత్ర మీ బిడ్డల జీవితానికి సంబంధించినదని వారికి చెబుతున్నాం. రేపటి మంచి జీవితం కోసం నేడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తల్లులకు, పిల్లలకు వివరిస్తున్నాం.
– మీనాక్షీ అరవింద్
సరైన సమయంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్‌ని నివారించవచ్చు. ఈ జబ్బు గురించే తెలియని సామాన్య జనానికి వ్యాక్సిన్ గురించి తెలుస్తుందా? తెలిసినా వ్యాక్సిన్లు సామాన్యులకు, పేదలకు అందుబాటులో లేవు. ఇలాంటి స్థితిలో ఉన్న ఆడవాళ్లు సర్వైకల్ క్యాన్సర్‌తో పోరాడేందుకు మా యాత్ర ఓ అవకాశం. ప్రతి బాలికనూ సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించడం, ఆడపిల్లకు గౌరవప్రదమైన జీవితం కల్పించడం మా యాత్ర లక్ష్యం.
– ప్రియా రాజగోపాల్