Preetha Balakrishnan | ప్రీతా బాలకృష్ణన్.. ఓ టీనేజ్ కుర్రాడికి తల్లి, ఓ నడివయసు ప్రొఫెషనల్‌కు భార్య. ప్రవృత్తిరీత్యా అడ్వాన్స్డ్ స్కూబా డైవర్. ఇన్ఫోసిస్, డెలాయిట్ లాంటి దిగ్గజ సంస్థల్లో రెండున్నర దశాబ్దాల కార్పొరేట్ అనుభవం ఉంది. లక్షమంది మహిళలను లీడర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘అలైన్ యువర్ బ్రెయిన్’ అనే కంపెనీ ప్రారంభించారు. ‘ఇరవై ఒక్క రోజుల్లో స్వయం సమృద్ధిని సాధించడం ఎలా?’ శీర్షికతో ఓ పుస్తకం రాశారు. టెడెక్స్‌లో స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చిన అనుభవమూ లేకపోలేదు.
‘రోల్స్ టు గోల్స్.. బాధ్యతల నుంచి లక్ష్యానికి’ పేరుతో ఆమె నిర్వహించే సెమినార్లు అనేక జీవితాలను మార్చాయి. ‘మనం బాధ్యతల మధ్య చిక్కుకుపోయి లక్ష్యాలకు దూరం అవుతున్నాం. ఆఫీసు బాధ్యతలు, ఇంటి బాధ్యతలు.. ఏవైనా కానివ్వండి! వాటికి న్యాయం చేస్తూనే మనవైన లక్ష్యాలకు చేరువ కావాలి. అదెలా సాధ్యం అన్నది నేను చెబుతాను. అన్నిటికంటే ముందు కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి వచ్చేయాలి. మార్పు అనివార్యం. నువ్వు కోరుకున్నా, కోరు కోకపోయినా జరిగి తీరుతుంది. కానీ ఎదుగుదల ఐచ్ఛికం. మీరు కోరుకుంటేనే మీ సొంతం అవుతుంది. లేదంటే లేదు’ అని మహిళలకు సలహా ఇస్తారు ప్రీతా.