ఆమె పేరు కనిక. అస్సాం రాష్ట్రంలోని బోర్జార్ అనే పల్లెటూరువాసి. భర్తతో ఉన్నప్పుడు ఏ రందీ లేదామెకు. ఈ దంపతుల మూడేండ్ల కాపురానికి గుర్తుగా ఓ బిడ్డ పుట్టింది. చిన్నారి నెలల పాపగా ఉన్నప్పుడే ఆమె భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. భవిష్యత్తు అంధకారంగా మారింది. నెలకు ఓ రెండు వేలు సంపాదిస్తే చాలు, నా బిడ్డ బాగోగులు చూసుకోవచ్చు అనుకుంది కనిక. అలా అనుకున్న ఆవిడే.. స్వయం కృషితో ఇప్పుడు నెలకు రూ.3.5 లక్షలు సంపాదిస్తున్నది. పది మందికీ ఉపాధి కల్పిస్తున్నది. ఎవరీ కనిక… ఏమా కథ!
భర్త పోయాక కనిక రోజులు భారంగా గడవసాగాయి. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. నేత కార్మికురాలిగా పనిచేస్తూ పొట్టపోసుకునేది. ఒకరోజు అనుకోకుండా ఓ వర్క్‌షాప్‌లో పాల్గొన్నది. అక్కడ వర్మికంపోస్ట్ తయారీ గురించి తెలుసుకుంది. ఇదేదో తన తలరాతను మార్చేలాగే ఉంది అనుకుంది కనిక. స్థానిక అధికారుల సాయంతో కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించింది. ఆ సంస్థ ఆసరాతో కేవలం రూ.500 పెట్టుబడితో వర్మికంపోస్ట్ తయారీ రంగంలోకి ప్రవేశించింది. తమ గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి ఆవుపేడ, ముడి పదార్థాలు సేకరించి వర్మికంపోస్ట్ తయారీకి శ్రీకారం చుట్టింది కనిక. ‘జై వర్మికంపోస్ట్’ బ్రాండ్‌తో అమ్మకాలు మొదలుపెట్టింది.
అక్కడితో ఆగిపోలేదు ఆమె. గ్రామంలోని రైతులకు వర్మికంపోస్ట్ వాడకం ద్వారా కలిగే ప్రయోజనాలను చెప్పేది. అలా రైతులు సేంద్రియ సాగుకు మొగ్గు చూపేలా చేయగలిగింది. ఆమె కష్టం వృథాపోలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ ‘జై’ బ్రాండ్ జయకేతనం ఎగురవేసింది. వ్యాపారం మొదలుపెట్టిన తొలి ఏడాది కేవలం 35 కిలోల వర్మికంపోస్ట్ విక్రయించిన కనిక.. ఇప్పుడు నెలకు 35 టన్నుల ఎరువులు ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. పదుల సంఖ్యలో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది. అస్సాం వ్యవసాయశాఖతోపాటు మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లోని పలు నర్సరీలు ‘జై వర్మికంపోస్ట్’ను కొనుగోలు చేస్తున్నాయి.
కేవలం రూ.500 పెట్టుబడితో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు లక్షలకు చేరింది. ఒకప్పుడు నెలకు రూ.2వేలు సంపాదిస్తే చాలు అనుకున్న కనిక ఇప్పుడు నెలకు రూ.3.5 లక్షలు ఆర్జిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నది. ‘ఈ ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకుంటే సరిపోదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకు నిరంతరం పరిశ్రమించాలి. అప్పుడు విజయం తప్పక లభిస్తుంది అనడానికి నేనే ఉదాహరణ’ అని గర్వంగా చెబుతున్నది కనిక.