నేహ నర్ఖేడే.. అమెరికన్ సెల్ఫ్‌మేడ్ రిచెస్ట్ ఉమెన్-100 జాబితాలో స్థానం సంపాదించిన ప్రవాస భారతీయ మహిళ. ఆ వందమందిలో అతిపిన్న వయస్కురాలు కూడా తనే. నేహ వయసు ముప్పై ఎనిమిది. ఫోర్బ్స్ జాబితాలో ఎక్కడం నేహకు కొత్త కాదు. దశాబ్ద్దకాలం నుంచీ పతాక శీర్షికల్లో మెరుస్తూనే ఉంది. నేహ కన్ఫ్లుయెంట్ అనే క్లౌడ్ కంపెనీ సహ-వ్యవస్థాపకురాలు కూడా. తను పుణెలో పుట్టింది. అక్కడే చదువుకుంది. అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎమ్మెస్ చేసింది. ఆ తర్వాత ఒరాకిల్‌లో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరింది. కొంతకాలానికి లింక్డిన్కు మారింది.
అక్కడితో కొలువుల ప్రయాణం ఆపేసి.. ఆంత్ర ప్రెన్యూర్ అవతారం ఎత్తింది. మిత్రులతో కలిసి కన్ఫ్లుయెంట్ను స్థాపించింది. అందులో ఆమెకు ఆరుశాతం వాటా ఉంది. ఆ విలువ అంతకంతకూ పెరగడంతో కుబేరుల సరసన చోటు దక్కింది. సామాన్యులను నట్టేట ముంచుతున్న ఆన్లైన్ మోసాలు నేహను కలవరపాటుకు గురిచేశాయి. వాటిని అడ్డుకునేందుకు ఆసిలర్ అనే సంస్థకు ప్రాణంపోసింది. జెమ్, బ్లాక్పార్టీ, అబాకస్ ఏఐ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి అంకురాలకు అండగా నిలిచింది. నేహ నర్ఖేడే నికర ఆస్తుల విలువ దాదాపు ఐదువేల కోట్ల రూపాయలు.