హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, హెచ్ఆర్ రంగాలలో సుదీర్ఘ అనుభవం మోనికా మిశ్రాను స్థిమితంగా ఉండనీయలేదు. ఏదో ఓ సంస్థలో పనిచేయడం కాదు, తనదైన ఓ కంపెనీ స్థాపించాలనే లక్ష్యంతో.. అప్పటివరకూ కార్పొరేట్ దిగ్గజాలు సైతం దృష్టి సారించని ఆఫీస్ స్పేస్ రంగంపై ఫోకస్ చేశారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరాన్ని వేదికగా చేసుకుని ఐకేవాకు ప్రాణం పోశారు. అనతి కాలంలోనే తెలుగు రాష్ర్టాలతోపాటు బెంగళూరు, ముంబై నగరాలకూ వ్యాపారాన్ని విస్తరించారు.
ప్రతి ఒక్కరిలో ఓ వ్యాపారవేత్త ఉంటారు.
టీ కొట్టు మొదలు సెలూన్ వరకు ప్రతి వృత్తిలోనూ వ్యాపార కోణం ఉంటుందని చెబుతారు మోనికా మిశ్రా. ఆమెది మధ్యతరగతి కుటుంబం. స్వస్థలం విశాఖపట్నం. ఇరవై ఏండ్ల క్రితమే హైదరాబాద్‌తో అనుబంధం ఏర్పడింది. అప్పటినుంచి పెద్దపెద్ద హాస్పిటాలిటీ, టూరిజం, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పలు హోదాల్లో పనిచేశారు. ఆ అనుభవంతో సొంతంగా ‘ఐకేవా’ను ప్రారంభించారు. తనలాంటి ఎంతోమంది యువ వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలకు తక్కువ ధరకే, సకల సౌకర్యాలతో ఆఫీస్ స్పేస్ అందించాలన్నది ఆమె ఆలోచన.
అవసరమే నాంది..
స్టార్టప్ రంగం కొత్తగా పుంజుకుంటున్న రోజులవి. పూర్తి స్థాయిలో ఆఫీస్ స్పేస్ వ్యవస్థ బలపడలేదు. ఇదే ఐకేవా స్థాపనకు కారణమైందని అంటారు మోనికా. తనదైన ఆలోచనతో, పక్కా ప్రణాళికతో, గుండెనిండా ఆత్మవిశ్వాసంతో సరైన ఇన్వెస్టర్ల కోసం వెతుకుతున్న సమయంలో ఆమెకు సతీష్ ఆండ్ర తారసపడ్డారు. అప్పటికే చిన్న, మధ్య తరహా కంపెనీలకు ఇన్వెస్టర్‌గా వ్యవహరిస్తున్న సతీష్‌ను సైతం ఓ దశలో ఆఫీస్ స్పేస్ కొరత ఇబ్బంది పెట్టింది. దీంతో మోనికా ఐడియాతో ఇట్టే కనెక్ట్ అయ్యారు. ఆమెకు మద్దతు అందించారు. ఇద్దరూ కలిసి.. మంచి పని వాతావరణం, ఇంటర్నెట్, వైఫై, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, డైనింగ్ హాల్, కాఫీ రూమ్, క్యూబికల్స్.. ఇలా అన్ని వసతులతో ఐకేవాను డిజైన్ చేశారు.
ప్రధాన కేంద్రం హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, చెన్నై, గుర్‌గ్రామ్ తదితర నగరాలలో ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు అందిస్తూనే.. వ్యాపారాన్ని మరిన్ని చోట్లకు విస్తరిస్తున్నారు. ఇప్పుడంటే కో వర్కింగ్ స్పేస్‌లకు కొదవ లేదు. తొలినాళ్లలో ఇవి స్టార్టప్‌లకు అందుబాటులో లేనంత ఖరీదైన వ్యవహారంగా ఉండేవి. కాబట్టే, అద్దెల విషయంలో ఐకేవా ఓ విప్లవాన్ని తీసుకొచ్చింది. అత్యంత తక్కువ ధరలో సామూహిక కార్యా లయాలు అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల స్టార్టప్స్‌కు ఓ అడ్రస్ అంటూ లభించింది. లక్షలకు లక్షలు అద్దెలు కట్టాల్సిన పని ఉండదు. నెలకు నాలుగువేలతో నగరం నడిబొడ్డులో ఉన్న అద్దాల మేడలో తమకంటూ ఓ సీటు ఏర్పాటు చేసుకోవచ్చు. నెలకో ఇరవై వేలతో నలుగురు ఉద్యోగులకు జాగా సంపాదించవచ్చు. చుట్టూ తమలాంటి ఐడియా జీవులే ఉంటారు కాబట్టి.. ఆలోచనలు సానబెట్టు కోడానికి మంచి అవకాశం. భావాలు కుదిరితే.. కొత్త వెంచర్లు ప్రారంభించవచ్చు. అలా ఊపిరి పోసుకున్నవీ అనేకం.
పెట్టుబడుల ప్రవాహం
సొంతంగా నిధులు సర్దుబాటు చేసుకునే దశ నుంచి పలు సంస్థల పెట్టుబడులను ఆకర్షించే స్థాయికి చేరింది ఐకేవా. 2019లో మీనాక్షి గ్రూప్ నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులు ప్రవహించాయి. ఇప్పటివరకు ఐటీ అనుబంధ రంగాలకే పరిమితమైనా.. ఇకపై లాయర్లు, సీఏలు, రిక్రూటర్లు, హెచ్ఆర్ కన్సల్టెంట్లకు కూడా ఆఫీస్ స్పేస్ అందించాలన్నది మోనిక ఆలోచన. ఇప్పటికే 1,200 సీటింగ్ కెపాసిటీతో 70 వేల చదరపు అడుగుల స్పేస్‌ను అందుబాటులోకి తెచ్చింది ఐకేవా. తమ ఛత్రం కింద 250కి పైగా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని సగర్వంగా ప్రకటిస్తారు మోనికా. ఆధునిక సాంకేతికతతో వర్చువల్ మీటింగ్ హాల్స్‌నూ సమకూరుస్తున్నారు.
…? కడార్ల కిరణ్