‘ఇఫ్తార్’ అంటే విందు కాదు.. దానం. ఆ మాటను నిజం చేస్తున్నది లుఖ్మా కమ్యూనిటీ కిచెన్. ఇక్కడివంటవాళ్లంతా మహిళలే.. భర్తను కోల్పోయినవారు, లేదంటే భర్తకు దూరమై బతుకుతున్నవారు. ఆ తల్లులు ఆత్మగౌరవంతో జీవించేందుకు, పిల్లల జీవితాల్ని మంచిగా తీర్చిదిద్దేందుకు తనవంతు భరోసా ఇస్తున్నదీ వంటశాల.
హలీం.. ఇఫ్తార్‌కు మరో పేరు. ఇక, హైదరాబాదీ విందు అంటే బిర్యానీ పసందే. వీటికి తోడుగా మటన్ షామి, చికెన్ షామి, లుక్మా చికెన్, దమ్ కా ఖీమా, కటీ దాల్, కుబానీ కా మీఠా, డబుల్ కా మీఠా, ఫ్రూట్ సలాడ్.. సకల రుచులూ సకాలంలో సిద్ధం చేయడానికి హెడ్ చెఫ్ రజియా బేగం ఓ యుద్ధమే చేస్తున్నారు. కమ్యూనిటీ కిచెన్‌ను ఓ వార్ రూమ్‌లా మార్చేశారు.
చార్మినార్ సమీపంలోని సఫా అనే ఎన్జీవో కార్యాలయం పై అంతస్తులో ఉన్న లుఖ్మా కమ్యూనిటీ కిచెన్‌లో రంజాన్ మాసమంతా ఇదే హడావుడి. మహిళా బృందం తెల్లవారు జాము నుంచే వంటలు మొదలుపెడుతుంది. ‘రాత్రి వచ్చిన ఆర్డర్లకు సరిపడా సరుకులున్నాయా, లేదా?’ అంటూ కిచెన్ మేనేజర్ నాహిద్ బేగం లెక్కలేస్తుంటే.. మధ్యాహ్నానికి తయారు చేయాల్సిన వంటకాలకు మసాలాలు నూరుతూ, కూరగాయలు తరుగుతూ మరికొందరు బిజీగా ఉంటారు. చకచకా వండేయడం, తయారైన వాటిని అందమైన బాక్సుల్లో ప్యాక్ చేయడం, ఆర్డర్ల వారీగా లెక్కలు చూసుకుని సరైన చిరునామాకు అందేలా సకల జాగ్రత్తలూ తీసుకుని.. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలకు అప్పగించడం..ఇలా ప్రతి పనీ పక్కాగా జరుగుతుంది అక్కడ. హైదరాబాద్‌లోని వందలాది కుటుంబాలకు ఇఫ్తార్ విందులు ఇక్కడి నుంచే వెళ్తాయి.
‘లుఖ్మా’ అంటే అరబిక్‌లో అమ్మచేతి ముద్ద. ఎంతోమందికి అమ్మలా అన్నం పెడుతూ ఈ అమ్మలు తమ బిడ్డల ఆకలి తీరుస్తున్నారు. విజయానికి ప్రమాణాలు లేవు. అనుకున్నది సాధించడానికి, సంతృప్తిగా జీవించడానికి మించిన గెలుపూ లేదు. ఎన్నో అడ్డంకుల్ని దాటి ఈ స్థాయికి చేరుకున్నారు లుఖ్మా కమ్యూనిటీ కిచెన్ చెఫ్‌లు.
లుఖ్మా కమ్యూనిటీ కిచెన్ విజయం పాతబస్తీ పేద మహిళల సమష్టి శ్రమ ఫలితం. ఈ ఫలాలకు బీజాలు వేసిన ‘కార్వాన్’ (ప్రయాణం) కార్యక్రమం 2018లో మొదలైంది. రుబీనా నఫీస్ ఫాతిమా ఆధ్వర్యంలోని ‘సఫా’ సంస్థ పహాడీ షరీఫ్ ప్రాంతంలోని పేద మహిళల కుటుంబ పరిస్థితులపై అధ్యయనం చేసింది. వితంతువులు, ఒంటరి మహిళల కష్టనష్టాలను తెలుసుకున్నది. స్థానిక మహిళలు తమ పిల్లలకు సరైన తిండి కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నారనీ, విద్య, వైద్యం కూడా అందడం లేదనీ ఆ బృందానికి అర్థమై పోయింది. తగినంత ఆదాయం లేకపోవడమే దీనికి కారణమని తీర్మానించారు. ఆ విష వలయం నుంచి వారిని బయటికి లాగాలనుకున్నారు.
మహిళకు పుట్టుకతోనే అబ్బే కళ.. పాకశాస్త్రం. ఆ నైపుణ్యమే ఆయుధంగా పేదరికంపై యుద్ధం ప్రకటిం చింది. సఫా మొదలుపెట్టిన ‘కార్వాన్’ కార్యక్రమంతో వాళ్ల జీవితాల్లో నిజంగానే ముందడుగు పడింది. నిరుపేద మహిళలకు నెల రోజులపాటు శిక్షణ ఇప్పించారు. కొత్త వంటలు నేర్పించారు. సంప్రదాయ రుచుల తయారీలో తర్ఫీదు ఇచ్చారు. ఇప్పుడు విశాలమైన వంటశాలలో, హైదరాబాదీ రుచులే కాదు కాంటినెంటల్ డిష్‌లు కూడా వండి మెప్పిస్తున్నారు వాళ్లంతా. ఫంక్షన్లు, బర్త్ డే పార్టీలకు క్యాటరింగ్ సర్వీస్ మొదలుపెట్టారు. బహుళజాతి కంపెనీల ఈవెంట్స్‌కు ఆర్డర్లు సంపాదిస్తున్నారు. యూఎస్ కాన్సులేట్ (హైదరాబాద్)ను కూడా లుఖ్మా కమ్యూనిటీ కిచెన్ ఆకర్షించింది. కాన్సులేట్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో.. వివిధ దేశాల రాయబారులు, రాజకీయ ప్రముఖులకు హైదరాబాదీ రుచులు వడ్డించే అవకాశం ఇచ్చింది.
‘పాకశాస్త్ర నైపుణ్యం పెంచుకుని వంట మనిషిగా పని చేయాలనుకునే వారికి, చిన్న హోటల్ పెట్టుకుని ఆర్థికంగా స్థిరపడాలనుకున్న వారికి.. మేం ఉచితంగా పాఠాలు బోధిస్తాం. ఎక్కడ ఉపాధి అవకాశాలున్నా.. చెబుతాం. మా దగ్గర శిక్షణ తీసుకున్న చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆన్లైన్ యాప్‌ల పుణ్యమాని.. ఇంటి దగ్గరే కమ్యూనిటీ కిచెన్లు పెట్టుకున్నారు. క్యాటరింగ్ సర్వీస్ నడిపిస్తున్నారు’ అని వివరిస్తారు లుఖ్మా కమ్యూనిటీ కిచెన్ మేనేజర్ నాహిద్ బేగం. నిజమే, అనేక జీవితాలు మారి పోయాయి. ఇక్కడే హెడ్ చెఫ్‌గా పనిచేస్తున్న రజియా బేగం సంగతే తీసుకోండి. భర్త చనిపోయాడు. ఆస్తులేమీ లేవు. అయిదుగురు పిల్లలు. అత్త మామల బాధ్యతా కూడా తనపైనే పడింది. తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకుంటున్న సమయంలో సఫా గురించి తెలిసింది. వంటలో శిక్షణ తీసుకున్నది. లుఖ్మాలోనే చెఫ్‌గా ఉద్యోగం దొరికింది. పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నది. స్కూటర్ కూడా నడిపిస్తున్నది. ఆ ఆవరణలో ఇలాంటి గెలుపు కథలు, మెరుపు కథలు వందలకొద్దీ. ఈ పవిత్ర రంజాన్ మాసం ఆ మహిళలకు అల్లాహ్ అనుగ్రహాన్నే కాదు, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చింది.
…? నాగవర్ధన్ రాయల
– నర్రె రాజేశ్