Inspiration | ‘ఇంటి ఆవరణలో తోటలు పెంచడం, రుచికరమైన వంటలు చేయడం ఆమె అభిరుచి. ఆ ఇష్టాన్నే వ్యాపారంగా మలుచుకున్నారు. తొలుత ‘కలగూరగంప.కామ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఆ తర్వాత మార్కెటింగ్‌లో అడుగుపెట్టారు. అదే బ్రాండ్‌తో సేంద్రియ పద్ధతిలో పండించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్లతో దాదాపు 400 రకాల ఉత్పత్తులను పద్నాలుగు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరుకు చెందిన పట్లోళ్ల శ్రీదేవి విజయ పరంపర ఆమె మాటల్లోనే..
అమ్మ వాళ్లది వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని పల్లెటూరు. నా బాల్యమంతా గ్రామీణ ప్రాంతంలోనే గడిచింది. అమ్మానాన్న టీచర్లు అయినా, స్థూలంగా మాది వ్యవసాయ నేపథ్యమే. బడికి సెలవులొస్తే పొలానికి వెళ్లేదాన్ని. సేద్యం పనులన్నీ తెలుసు నాకు. ఉద్యోగాల వల్ల తల్లిదండ్రులకు తీరిక లేకపోతే.. పిల్లలు కోల్పోయేదేమిటో చిన్నప్పుడే గ్రహించాను. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం చేయకూడదని పదో తరగతిలోనే నిర్ణయించుకున్నాను. ఎమ్మెస్సీ తర్వాత కూడా నా అభిప్రాయం మారలేదు. నేను ఉద్యోగం వైపు వెళ్లలేదు. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ప్రయోగాలు చేయడంపైనే నాకు ఆసక్తి. నేను ఎంచుకున్న ఆ మార్గమే నేడు, నాతోపాటు ఓ పదిమందికి ఉపాధి చూపుతున్నది.
ఎమ్మెస్సీ క్లాస్మేట్ కల్యాణ్‌తో పరిచయం .. ప్రేమగా మారింది. ఇరువైపుల పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నాం. హైదరాబాద్విద్యానగర్లోని అద్దె ఇంట్లో కాపురం పెట్టాం. ఏదో ఒకటి చేయాలి కాబట్టి, బ్యాంక్ లోన్ తీసుకుని బ్యూటీపార్లర్ పెట్టాను. అదే సమయంలో మావారు ఎంటెక్‌లో చేరారు. ఆయన చదువులకూ నా బ్యూటీపార్లరే ఆధారమైంది. నెలకు మహా అయితే మూడువేల ఆదాయం వచ్చేది. ఇంటి అద్దె, అప్పు వాయిదా పోనూ ఆరేడు వందలు మిగిలేవి. ఉన్నంతలోనే సర్దుకుని బతికాం. మా వారు ఐటీ ఉద్యోగంలో చేరాక ఆర్థిక ఇబ్బందులు తీరాయి. నా ఐడియాలతో అనేక వ్యాపారాలు ప్రాంభించినా.. రకరకాల కారణాలతో పూర్తిస్థాయిలో కొనసాగించలేకపోయాను. దానికితోడు, రూ.కోటి ఇరవై లక్షలతో ప్రారంభించిన చీరల వ్యాపారంలో నష్టాలొచ్చాయి. ఆర్థికంగా చితికిపోయాం.
ఆ సమయంలో మావారు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కుదుటపడుతున్న సమయంలోనే యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించాను. వ్యవసాయం, వంటలు, సౌందర్య పోషణ, ఆరోగ్య సూత్రాలు.. సాధారణంగా ఒక్కో ఛానెల్లో ఒక్కో అంశమే ఉంటుంది. కానీ, మా ఛానెల్లో అన్నీ కలగలిసి ఉంటాయి. ఛానెల్‌కు ఏ పేరు పెడితే బాగుంటుందని నా కూతురు అడిగినప్పుడు ‘ఏదో ఒకటి కలగూర గంపలెక్క పెట్టరాదూ..’ అని జవాబిచ్చాను. చివరికి అదే స్థిరపడింది. పొలం దున్నిన దగ్గర్నుంచి నారు వేసి..నీరు పోసి.. పంట పండించి.. ఇంట్లో వండే వరకు అంతా మా ఛానెల్లో కళ్లకు కట్టినట్లు వివరిస్తాను. పల్లె సంస్కృతిని దేశదేశాలకు పరిచయం చేస్తాను. నా బాల్య జ్ఞాపకాలను అన్వయిస్తూ చెబుతాను కాబట్టి, నా వీడియోలు నోస్టాల్జియాను తలపిస్తాయి. మా ఛానెల్‌కు 5.4 లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు.
అవి లాక్డౌన్ రోజులు. మా ఉత్పత్తులను సూపర్ మార్కెట్లో పెట్టడం వల్ల పెద్దగా మిగులుబాటు కనబడలేదు. దీంతో నా ఛానెల్లోనే పరిచయం చేయాలని అనుకున్నా. జుట్టు నల్లగా మారేందుకు నీలి ఆకుతో తయారు చేసిన ఉత్పత్తిని అలా జనంలోకి తీసుకెళ్లాను. చాలా మంది కనెక్ట్ అయ్యారు. పోస్ట్ చేసిన గంటల వ్యవధిలో రెండువేల వరకు ఆర్డర్లు వచ్చాయి. ఒక్కరోజులోనే రూ. 28 లక్షలు నా బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యాయి. ఇది ఊహించని స్పందన. కస్టమర్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నా వంతు ప్రయత్నం చేశాను.
సకాలంలో డెలివరీ చేశాను. వ్యాపారం విస్తరించడంతో మా ఆయన ఉద్యోగం వదిలిపెట్టి నాకు మద్దతుగా నిలిచారు. సుభాష్ పాలేకర్ శిక్షణ తరగతులకు హాజరై సేంద్రియ వ్యవసాయం గురించి కూడా ఆకళింపు చేసుకున్నాను. కలగూరగంప.కామ్‌లో ప్రస్తుతం 400 వరకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. పద్నాలుగు దేశాలకు మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. కూకట్పల్లి, ఎల్బీనగర్, చిలుకూరులో ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటు చేశాం. దాదాపు వందమందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. నా కలల ఆంత్ర ప్రెన్యూర్షిప్ ప్రయాణం సంతృప్తికరంగా
సాగుతున్నది.
నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నది. రెండో కూతురు ఐదో తరగతి. చిలుకూరులో సొంతిల్లు కట్టుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పెద్ద నర్సరీ ఏర్పాటు చేయడంతోపాటు వ్యాపారాన్ని మరింత విస్తరించాలని అనుకుంటున్నా. నా వ్యాపారానికి నేనే బ్రాండ్ అంబాసిడర్. వచ్చే ఐదేళ్లలో రూ. 500 కోట్ల టర్నోవర్ సాధించాలన్నది నా లక్ష్యం.
– గంజి ప్రదీప్ కుమార్
– ఉప్పర శివ