అనుభవాలే జీవిత పాఠాలు. వాటిని ఒంటబట్టించుకుంటే బతుకు పూలతోట అవుతుంది. వ్యాపారం లాభాలబాట పడుతుంది. ‘కోకోట్యాంగ్ ఇండియా’ స్టార్టప్ నేర్పుతున్న పాఠం ఇది. ఎంబీయే చదివిన ఓ యువతి రెండేండ్లు తిరిగేసరికి ఆ ఎంబీయే సిలబస్‌లోనే ఓ పాఠం కావడాన్ని మించిన విజయం ఏం ఉంటుంది? డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుని ఆంత్రప్రెన్యూర్‌గా స్థిరపడిన డాక్టర్ నీలిమా తిప్పావఝ్ఝల అనుభవాలు..
బీడీఎస్ పాసైన వెంటనే డెంటిస్ట్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టాను. రెండేండ్ల తర్వాత పెండ్లయింది. ప్రాక్టీస్ ఆపేసి ఎంబీయే (హాస్పిటల్ మేనేజ్మెంట్ ) చదివాను. గర్భం దాల్చాలనుకున్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. గర్భసంచిలో ఉమ్మనీరు తక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు. కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగాలని, బాగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో రోజూ కొబ్బరినీళ్లు తాగేదాన్ని. కానీ ఆ నీళ్లు ఒక్కోసారి ఉప్పగా, ఒక్కోసారి పుల్లగా ఉండేవి.
రుచి మారినప్పుడు అస్సలు తాగలేకపోయేదాన్ని. మా ఆయన రకరకాల పండ్లు తీసుకొచ్చి, ఆ రసాన్ని కొబ్బరినీళ్లలో కలిపి ఇచ్చేవారు. దీంతో చాలా రుచిగా ఉండేవి. మూడు నెలలు తిరిగే సరికి గర్భసంచిలో ఉమ్మనీరు సాధారణ స్థితికి వచ్చింది. అప్పుడొచ్చిందో కొత్త వ్యాపార ఆలోచన. అయినా రంగంలో దిగడానికి అది సరైన సమయం కాదు కాబట్టి, కొంతకాలం వేచి చూశాను. అమ్మాయి పుట్టింది. నా ఆరోగ్యమూ కుదుటపడింది. అదే ఏడాది కంపెనీ ఏర్పాటుపై అధ్యయనం ప్రారంభించాను.
కొబ్బరితో ప్రయోగాలు
మా ప్రయాణం పాతిక వేల పెట్టుబడితో మొదలైంది. ప్రాసెస్ చేయకుండా, రసాయనాలు
వాడకుండా కొబ్బరినీళ్లతో చేసిన పండ్లరసాలను మార్కెట్లోకి తీసుకురావడం ఎలా అన్నది తెలుసుకున్నాను. నాలుగు నెలల్లో లేత కొబ్బరి పల్ప్, కొబ్బరినీళ్లతో ఫ్రూట్ జ్యూస్ తయారుచేశాం. కోకోట్యాంగ్ బ్రాండ్ నేమ్‌తో మార్కెట్లో అడుగుపెట్టాం. పైలట్ ప్రాజెక్ట్‌గా హోటల్లోఅమ్మకాలు మొదలుపెట్టాం. వారానికి 60 వేల రూపాయల వ్యాపారం నడిచింది.
ఈ విజయంతో పెద్ద మొత్తంలో కొబ్బరి పానీయాలు తయారు చేయగలమనే నమ్మకం కలిగింది. మా ఆయన మెషినరీ ఇంజినీరింగ్ బిజినెస్ పక్కనపెట్టి, ఈ స్టార్టప్‌పై దృష్టి సారించారు. కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌లో 2017లో ప్లాంట్ నిర్మించాం. స్థానికంగా దొరికే కొబ్బరినీళ్లతో ఉత్పత్తి మొదలుపెట్టాం. మూడేండ్లపాటు ముడి పదార్థాల సేకరణ, తయారీ గురించి లోతైన పరిశోధన చేశాను. అవగాహన కోసం ఇగ్నోలో ఎమ్మెస్సీ (న్యూట్రిషన్) చదివాను.
నష్టకాలమూ ఓ అవకాశమే
రెండేండ్లకు కోకోట్యాంగ్ ఔట్లెట్స్ సంఖ్య మూడుకు పెరిగింది. మూడో ఔట్లెట్ కోసం 50 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. నెలకు లక్షన్నర అద్దె కట్టాలి. 20 మంది ఉద్యోగులు పనిచేసేవారు. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్స్ వచ్చేవి. మొత్తం సేల్స్‌లో ఆన్లైన్ అమ్మకాలే 70 శాతం ఉండేవి. అంతలోనే కొవిడ్ లాక్డౌన్ విధించారు. రెండు ఔట్లెట్స్ మూసేశాం. ఆన్లైన్ డెలివరీలకూ అవకాశం లేదు. చాలామందిలానే మేమూ నష్టపోయాం. అయినా మా మొదటి ఔట్‌లెట్‌ను, తయారీ యూనిట్‌ను కాపాడుకున్నాం. కొవిడ్ రోజుల్లో ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరిగింది. దాన్ని అవకాశంగా మలచుకుని కోకోట్యాంగ్ ఉత్పత్తుల్లో ‘ఇమ్యూన్’ కాన్సెప్ట్ తీసుకొచ్చాం.
ఆయుర్వేదంలో చెప్పిన అశ్వగంధ, అమృతవల్లి, వట్టివేరు, సుగంధ వంటివాటిని కొబ్బరినీళ్లకు జతచేశాం. ఈ ఉత్పత్తులు మాకు బూస్టింగ్ ఇచ్చాయి. కష్టాల నుంచి గట్టెక్కించాయి. లాక్డౌన్ ఎత్తేశాక… ఔట్లెట్తోపాటు వెండింగ్ మెషీన్ల ద్వారా అమ్మాలనుకున్నాం. మెట్రో స్టేషన్లలో పెట్టాం. మంచి స్పందన వచ్చింది. కంపెనీలు బల్క్ ఆర్డర్లు ఇచ్చాయి. వ్యాపారం మళ్లీ లాభాల బాటపట్టింది.
మేమే ఒక పాఠం
మా కోకోనట్ మాక్‌టెయిల్స్‌కు ‘జేఏసీ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డ్’ వచ్చింది. లండన్ నుంచి
వెలువడే ఎమెరాల్డ్ జర్నల్‌లో మా స్టార్టప్ కేస్ స్టడీ ‘Growth pains of an Indian startup Cocotang India’ పేరుతో ప్రచురితమైంది. భారత్, చైనా, జపాన్, ఉత్తర అమెరికా దేశాల్లో ఎంబీయే సిలబస్‌గా మా స్టార్టప్ ప్రస్థానాన్ని చేర్చారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన గురించీ చెప్పాలి. ఒకసారి పనిలో బిజీగా ఉన్నాను. ఫోన్ వచ్చింది.
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రాంక్ కాల్ అనుకుని పెట్టేశాను. కాసేపటికి మళ్లీ కాల్ వచ్చింది. అదే ముచ్చట. మళ్లీ పెట్టేశాను. తర్వాత మాకు లోన్ ఇచ్చిన ఎస్బీఐ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ నిజమేననీ, ప్రధానమంత్రి ఆఫీసు వాళ్లతో మాట్లాడమని చెప్పారు. మూడోసారి కాల్ చేసి, కోకోట్యాంగ్ ఇండియా ‘బెస్ట్ ఇండియన్ స్టార్టప్’ అవార్డ్‌కు ఎంపికైందని చెప్పారు. ఎంత సంతోషించామో! బ్రిటిష్ హై కమిషనర్ (చెన్నై) పిలిపించి.. ఓ వేదికపై మా స్టార్టప్ గురించి ప్రసంగించే అవకాశం కల్పించారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధుల ఆరోగ్య అవసరాలకు ప్రత్యేక పానీయాలు ఉత్పత్తి చేయాలని మా కోరిక. త్వరలోనే సిద్ధం చేస్తాం.
…? నాగవర్ధన్ రాయల