ఆనపకాయ కూర జొన్నరొట్టెకు జోడి. పప్పుగా వండితే.. పసందు. పులుసులో వేస్తే.. అదుర్స్! ఇన్నిటిలో ఇమిడిపోయే ఆనపకాయ గుండు రకమైతే పోషకాలు మరింత మెండు! అలాంటి ఆనపకాయను వంటింటి గడప దాటించి నట్టింట వెలుగులు విరజిమ్మే గృహాలంకరణ వస్తువుగా తీర్చిదిద్దింది వారాహి హస్తకళ సీఈవో తడక సింధు. ఎండబెట్టిన గుండు ఆనపకాయే కాన్వాస్‌గా సిత్తరాల చిత్తరువులు దిద్ది ‘ఔరా!’ అనిపించుకుంది. చిత్రలేఖనంలో తనకున్న ప్రావీణ్యమే పెట్టుబడిగా గ్రీన్ప్రెన్యూర్గా గుర్తింపు సాధించిన తడక సింధు ఈ వారం మన స్టార్టప్ స్టార్..
ములుగు జిల్లా పరకాలకు చెందిన సింధు ముగ్గులు వేయడంలో దిట్ట. బొమ్మలు గీయడంలోనూ ఆమెది అందెవేసిన చేయి. ప్రభుత్వ పాఠశాలలో ఏదో చదివిందంటే చదివిందంతే! వ్యవసాయ కూలీగా రెక్కలు ముక్కలు చేసుకోవడం మినహా.. మరే ఉపాధి మార్గమూ లేదు. తెల్ల కాగితం కనిపిస్తే చాలు నిమిషాల్లో దానిని వర్ణ శోభితంగా మార్చగల నేర్పరి. అలాంటి తన ప్రతిభ అడవి కాచిన వెన్నెల కావొద్దనుకుంది సింధు. తన కలలను.. కళతో నిజం చేసుకోవాలని భావించింది. సామాజిక మాధ్యమాల ద్వారా వైవిధ్యమైన కళాకృతులను తీర్చిదిద్దడం నేర్చుకున్నది. గిరిజన ప్రాచీన హస్తకళకు చిత్రలేఖనాన్ని జోడించి.. ఆనపకాయల (బుర్రకాయలు)పై అద్భుతాలు ఆవిష్కరించింది. తీగకు బరువైన కాయలను.. తన బరువు బాధ్యతలను దించుకునే వనరుగా మలుచుకుంది. అంతేకాదు, గృహాలంకరణ వస్తువులనూ పర్యావరణహితంగా తయారు చేయవచ్చని నిరూపించింది.
సాధారణ ఆనపకాయల కంటే బుర్రకాయలు కాస్త వింతగా ఉంటాయి. ఒకప్పుడు విరివిగా దొరికే ఈ రకం.. ఇప్పుడు ఎక్కడో గానీ లభించడం లేదు. గుమ్మడికాయకు దగ్గరి బంధువల్లే కనువిందు చేస్తుందీ గుండు సొరకాయ. చూడటానికి వింతగా, కాసింత దృఢంగా ఉండే కాయలను ఆరబెట్టి… సింధు వాటిని ప్రత్యేక విధానంలో ప్రాసెస్ చేస్తుంది. తర్వాత వాటిపై చిత్రమైన పెయింటింగ్ వేసి, నగిషీలు చెక్కి అందమైన షాండిలియర్లుగా, హోల్డర్లుగా తీర్చిదిద్దుతున్నది సింధు. బుర్రలోపల రంగు రంగుల బల్బులు వెలిగించి.. అదరహో అనిపిస్తున్నది. వారాహి హస్తకళ పేరుతో చిరు సంస్థ నెలకొల్పి.. సత్తా చాటుతున్నది. ప్లాస్టిక్, మెటల్ లేకుండా ఇలా సహజసిద్ధంగా తయారైన ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్టులకు విశేషమైన ఆదరణ లభిస్తున్నదని సింధు చెబుతున్నది.
పర్యావరణహితమైన వస్తువులను వినియోగించి తయారుచేస్తున్న అ ఉత్పత్తులు సెలెబ్రిటీలకు ఎంతగానో నచ్చుతున్నాయి. వీ హబ్‌తో జట్టు కట్టిన తర్వాత తన ప్రయాణం మరింత సాఫీగా సాగుతున్నదని చెబుతున్నది సింధు. ఇటీవల తెలంగాణలో జరిగిన పలు వేడుకల్లో ఆమె చేతుల్లో ప్రాణం పోసుకున్న ఎన్నో కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీ హబ్ మద్దతుతో తన ప్రయాణాన్ని మరింత కళాత్మకంగా మలుచుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తను రూపొందించిన వాటిని @varahi hasthakala ఇన్‌స్టా పేజీ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నది. 63031 46534 ఫోన్ నంబర్ ద్వారా ఆర్డర్లు తీసుకుని, వినియోగదారులు కోరిన విధంగా ఉత్పత్తులను అందిస్తున్నది.
– కడార్ల కిరణ్