‘తల నీలాలు ఇవ్వమని ఏ దేవుడూ అడగడు. ఇచ్చినా, ఏం చేసుకుంటాడు? నిజంగా ఇచ్చే మనసుంటే పరమాత్మకు ఇంకేమైనా సమర్పించండి. జుట్టును మాత్రం క్యాన్సర్ బాధితులకు ఇవ్వండి’ అని పిలుపునిస్తారు ద్రోణంరాజు ఛాయ. కేశదానాన్ని ఆమె ఓ ఉద్యమంలా జనంలోకి తీసుకెళ్తున్నారు. అసలైన అందం జుట్టులో లేదని, మరొకరి కోసం ఆ జడను త్యాగం చేయడంలో ఉన్నదని తోటి స్త్రీలకు వివరిస్తున్నారు.
Chaya Dronamraju | అమ్మాయి అందం జడలోనే ఉందంటారు. నేనూ ఆ మాటే నమ్మాను. చిన్నప్పుడు నాకు కూడా పొడవాటి జుట్టు ఉండేది. ముచ్చటగా జడ గంటలు కట్టుకుని, ఇష్టంగా పూలు పెట్టుకునేదాన్ని. అటూ ఇటూ కదిలే వాలుజడను చూసుకుని మురిసిపోయేదాన్ని. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లకూ జడ అల్లి ముస్తాబు చేసేదాన్ని. వ్యాధి దుష్ప్రభావంతో, కీమో ప్రభావంతో జుట్టు కోల్పోయిన క్యాన్సర్ బాధితులను చూసిన తర్వాత.. నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఆరేండ్ల క్రితం మా అమ్మ రుక్మిణికి రొమ్ము క్యాన్సర్ వచ్చింది. అప్పటికి ఆమెకు ఎనభై ఏండ్లు. చికిత్స కోసం బెంగళూరులోని ఓ పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్లాం. సర్జరీ చేశారు. కీమోథెరపీ అవసరం పడొచ్చేమో అన్నారు. రేడియేషన్ చాలని, ఈ వయసులో కీమోథెరపీతో ఆమెను బాధపెట్టడం ఇష్టం లేదనీ చెప్పాం. వీలైతే కీమోకు ప్రత్యామ్నాయం చూడమని అడిగాం. జుట్టు రాలి
పోతుందనే ఉద్దేశంతోనే మేము కీమోథెరపీ వద్దనుకుంటున్నామని అక్కడి డాక్టర్లు భావించారు. ఆ మాటలు నా మనసుకు గుచ్చుకున్నాయి. చికిత్సలు పూర్తయిన తర్వాత అమ్మను హైదరాబాద్ పంపాను. తనకు కీమో అవసరం రాలేదు.
అమ్మ వైద్యం కోసం హాస్పిటల్కు వెళ్తున్నప్పుడు చాలామంది క్యాన్సర్ బాధితులను గమనించే దాన్ని. ముఖమంతా పాలిపోయి, జుట్టంతా రాలిపోయి, బక్కచిక్కిపోయి నిరాశగా కనిపించేవారు. జుట్టు రాలిన విషయం ప్రపంచానికి తెలియడం ఇష్టంలేక.. స్కార్ఫ్ తలకు చుట్టుకునేవారు. మా అమ్మాయి శ్రావ్య క్యాన్సర్ బాధితులకు కౌన్సెలింగ్ చేస్తుంది. దీంతో వాళ్ల కష్టాలు పరోక్షంగా తెలిసేవి. మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు నా వంతు రీసెర్చ్ చేశాను.
‘గ్రీన్ ట్రెండ్స్’ అనే సంస్థ చెన్నైలోని అడయార్ క్యాన్సర్ హాస్పిటల్ రోగులకు విగ్గులు అందిస్తుందని ఎవరో చెప్పారు. వాళ్లకు ఫోన్ చేసి నా జుట్టు దానం చేస్తానని చెప్పాను. అలా వరుసగా రెండేండ్లు ఇచ్చాను. 2021లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. చెన్నైలో గ్రీన్ ట్రెండ్స్లా, ఇక్కడ ఎవరైనా పని చేస్తున్నారా అని వెదికాను. శివ అనే అబ్బాయి గురించి తెలిసింది. తనకు (96664 06586) ఫోన్ చేశాను. ‘ఓసారి వచ్చి నా కార్యక్రమాలు చూడండి’ అన్నాడు. నిరుపేద క్యాన్సర్ రోగుల కోసం శివ చేస్తున్న ప్రయత్నాలు నాకు బాగా నచ్చాయి. వాళ్లకు క్యాన్సర్ చికిత్సకే డబ్బులు ఉండవు. విగ్గులు ఎక్కడి నుంచి కొంటారు? తన వరకూ రాలేని పేదల దగ్గరికి తానే వెళ్లి విగ్గులు అందిస్తాడు. అతణ్ని మనసారా అభినందించి, ‘ఇక నుంచి నా జుట్టు నీకు దానం చేస్తాను. ఎవరో ఒకరికి ఉపయోగపడితే చాలు’ అని చెప్పాను.
మా కుటుంబంలో ఆడపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించరు. ఏవైనా మొక్కులుంటేనే తలనీలాలు ఇస్తారు. దీంతో ఎప్పుడూ గుండు గీయించుకోలేదు. క్యాన్సర్ బాధితుల కోసం తొలిసారి గీయించుకున్నప్పుడు.. ‘అదేమిటే, ఈ వయసులో జుట్టు తీసేస్తున్నావ్?’ అని ఆక్షేపించింది అమ్మ. ‘అమ్మా! తిరుపతిలో ఇస్తే ఇలా అంటావా?’ అని సూటిగా అడిగాను. ‘దేవుడికిస్తే ఎందుకు అంటాను?’ అన్నది.
‘ఈ సేవ నాకు పవిత్రమైంది, ఇదే నా దైవం’ అని స్థిరంగా చెప్పాను. మా ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. నాన్న బాగా సపోర్ట్ చేశాడు. బతికినంత కాలం, జుట్టు పెరిగినంత కాలం.. దానం చేయాలని నిర్ణయించుకున్నాను.
ఏడాదిన్నరలో జుట్టు భుజాల దాకా పెరిగింది. నాలుగో సారి మళ్లీ దానం చేశాను. ఈ సారి కూడా గుండే. చూసినవాళ్లు ‘తిరుపతి వెళ్లారా?’ అని అడిగారు. ‘లేదు. క్యాన్సర్ పేషెంట్ల్లకు దానం చేశాను’ అని చెప్పాను. జుట్టును కూడా దానం చేయవచ్చని చాలామందికి తెలియదు. తెలిశాక, కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
కొందరు శివకు ఆర్థిక సాయం చేశారు. తాజాగా, ‘షో ఆఫ్ సాలిడారిటీ’ కార్యక్రమంలో అయిదో సారి దానం చేశాను. నా జుట్టుతోనే పూర్తి విగ్గు తయారు కాదు. నాలాంటి నలుగురు దానం చేస్తేనే ఒకరి అవసరం తీరుతుంది. కాబట్టి జుట్టు దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాను. దానం చేయదలిస్తే నన్ను సంప్రదించమని చెబుతున్నాను. మా అమ్మ 83 ఏండ్ల వయసులోనూ ఎంతో సంతోషంగా ఉంది. నేనూ తృప్తిగా ఉన్నాను. మాలా ఇంకొందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బోల్డ్ ఈజ్ బ్యూటిఫుల్!
ఓసారి పుణె వెళ్లాను. ఓ రెస్టారెంట్లో 19 ఏండ్ల అమ్మాయి మా ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది. తన దగ్గరికి వెళ్లి, ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని చెప్పాను. ‘లేదండీ. నాకు బ్లడ్ క్యాన్సర్. కీమోతో జుట్టంతా పోయింది’ అని బాధపడుతూ చెప్పింది. ‘మరి, మీ జుట్టుకు ఏమైంది? అని నన్ను ప్రశ్నించింది. ‘నేను మీలాంటి వాళ్ల కోసం దానం చేశాను’ అనగానే, ఆ అమ్మాయి కంట బొటబొటా కన్నీళ్లు .
…? నాగవర్ధన్ రాయల
– చిన్న యాదగిరి గౌడ్