ఆర్గానిక్ పంటలు.. నూటికి నూరుపాళ్లు ఆరోగ్యకరం. కానీ, సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాదు, చాలా పంటలు ఎలాంటి ధ్రవీకరణ లేకుండానే మార్కెట్లో ఆర్గానిక్ ముద్రతో చెలామణి అవుతున్నాయి. ఆర్గానిక్ విత్తనాలతో పెరట్లోనే సేంద్రియ కూరగాయల సాగు చేపడితే.. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాకు ఆదా. ఓ తల్లిగా తనకొచ్చిన ఆ ఆలోచనకు వ్యాపార రూపం ఇచ్చారు seedbasket.in వ్యవస్థాపకు రాలు చందన దుగ్గినేని.
ఎకరాలకొద్దీ అవసరం లేదు. కొద్దిపాటి స్థలమైనా చాలు. ఇంటి అవసరాలకు కూరగాయలు పండించుకోవచ్చు. నాణ్యమైన విత్తనాలతోనే నాణ్యమైన కూరగాయలు పండుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బావుంటుంది. ఇల్లాలి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కెరీర్ మీద దృష్టి సారించవచ్చు. అమ్మగా, ఆంత్రప్రెన్యూర్గా తోటి మహిళల విషయంలో ఇది నా బాధ్యత కూడా.
– చందన – www.seedbasket.in
చందన దుగ్గినేని స్వస్థలం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆమెది అచ్చమైన గ్రామీణ నేపథ్యం. బాల్యం నుంచి వ్యవసాయాన్ని దగ్గరి నుంచి చూశారే కానీ, ఏనాడూ సాగు చేసిన అనుభవం లేదు. పెళ్లి తర్వాత భర్త వెంట హైదరాబాద్ వచ్చేశారు. ఓ బిడ్డకు తల్లి అయ్యారు. పిల్లలకు బలవర్ధకమైన ఆహారం ఇవ్వాల్సిన అవసరం గురించి వైద్యులు చెబుతున్నప్పుడు.. తొలిసారిగా చందన మనసులో ఓ బిజినెస్ ఐడియా తళుక్కుమంది. క్రిమిసంహారకాలు పిచికారీ చేయని కూరగాయలు, ఆకుకూరలు మార్కెట్లో దొరకడం గగనమే. దొరికినా జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. అందుకే, ఎంతో కష్టపడి అచ్చమైన దేశీ విత్తనాలు సేకరించారు. బాల్కనీలోని కొద్దిపాటి స్థలంలో ఆకుకూరలు, కూరగాయలు పండించారు. వాటితో వండిన వంటకాలను బిడ్డకు గోరుముద్దలుగా తినిపించారు.
ఓ దశలో తానే దేశీ విత్తనాలను ఎందుకు విక్రయించ కూడదనే అభిప్రాయానికి వచ్చారు. అప్పటికే అమ్ముల పొదిలో సిద్ధంగా ఉన్న ఐడియాకు ప్రాణంపోసి.. seedbasket.in అనే ఈ కామర్స్ సంస్థను స్థాపించారు. ఎంసీఏ చదవడం వల్ల వెబ్సైట్ డిజైనింగ్ పెద్ద అవరోధం కాలేదు. తొలిదశలో భర్త సాయంతో ఇంటి వద్దనే విత్తనాలను అభివృద్ధి చేశారు. క్రమంగా ఎంపిక చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించారు. వాటిని ఇంటి వాతావరణంలో సాగు చేసుకునేలా కస్టమర్లకు ఎరువులు, గార్డెనింగ్ పనిముట్లు కూడా అందిస్తారామె. విత్తనాల ప్యాకింగ్ యూనిట్నూ ఏర్పాటు చేసుకున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన 4-7 రోజుల వ్యవధిలో దేశంలోని ఏ మూలకైనా డెలివరీ చేస్తారు. రసాయన ఎరువుల సేద్యంతో పోలిస్తే.. ఆర్గానిక్ వ్యవసాయంలో దిగుబడి తక్కువ. దీంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపరు. విత్తనాల అభివృద్ధికి అసలే ముందుకు రారు. సీడ్బాస్కెట్.కామ్ రైతులను ఒప్పిస్తూ, గిట్టుబాటు ధర అందిస్తూ విత్తనాల కొరత తీరుస్తున్నది.
మన చుట్టు పక్కల కూరగాయల విత్తనాలను విక్రయించే సంస్థలు చాలానే ఉన్నా.. సహజమైన పద్ధతిలో సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో సమకూర్చే కంపెనీలు చాలా అరుదు. కాబట్టే, ప్రారంభించిన ఐదేళ్లలోనే సీడ్బాస్కెట్.కామ్ రూ. 50 లక్షల టర్నోవర్కు చేరింది. తనతోపాటు మరో ఆరుగురికి ఉపాధినిస్తూ క్రమంగా విక్రయాలను పెంచుకుంటున్నారు చందన. విత్తనాల ధరలు కూడా రూ. 30 నుంచి రూ. 300లోపే ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇప్పటివరకు 30 వేల మంది ఖాతాదారులు తమ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకున్నారని సగర్వంగా ప్రకటిస్తారు చందన. సాధారణ పంటలతోపాటు అరుదుగా దొరికే తెల ్లకాకర, ఎల్లో క్యాప్సికం, ఎర్ర తోటకూర, ఎర్ర బెండ, బేబీకార్న్, చిన్న మెంతి, బ్రొకోలితోపాటు పూల మొక్కల విత్తనాలు కూడా విక్రయిస్తున్నారామె.
…? కడార్ల కిరణ్