తండ్రి కాంట్రాక్టు ఉద్యోగి. తల్లి దినసరి కూలీ. ఆ ఇంట పుట్టిన ఆడపిల్ల ఆశలకు రెక్కలు తొడిగే ప్రసక్తే ఉండదు. కానీ, సాధించాలనే పట్టుదల ఉంటే.. ప్రతికూల పరిస్థితులను దాటుకొని అనుకున్న లక్ష్యం అందుకోవచ్చని నిరూపించింది మాసిపెద్ది సుప్రీత. కఠోర సాధనతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్‌గా ఎంపికైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన సుప్రీత ఎందరికో ఆదర్శం.
సింగరేణి పొలిమేరల నుంచి దేశ సరిహద్దుల వరకు సాగిన సుప్రీత ప్రయాణం ఆమె మాటల్లోనే..
Supreetha | నాకు చిన్నప్పటి నుంచి సైన్యంలో పనిచేయాలనే కోరిక ఉండేది. దేశ రక్షణలో భాగం కావాలని భావించేదాన్ని. కానీ, ఆశలు ఉంటే సరిపోదు. అందుకు తగ్గ వ్యవస్థ ఉండాలి కదా! మా నాన్న రవీందర్రావు ఎన్టీపీసీ టౌన్షిప్లో కాంట్రాక్ట్ ఉద్యోగి. అమ్మ రజిత ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ప్రొడక్షన్ ప్లాంట్‌లో రోజుకూలీగా పనిచేసేది. మేం ముగ్గురం. నేను, ఒక అన్న, తమ్ముడు. నా బాల్యం గోదావరిఖనిలో సాగింది. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నా. ఇంటర్ హనుమకొండలో చదివాను. కరీంనగర్లో డిగ్రీ చేశాను. అమ్మానాన్న ఇద్దరూ కష్టపడినా చాలీచాలని సంపాదనే! నా చదువు వారికి భారం కావొద్దని.. ఓ ప్రైవేట్ దవాఖానలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ డిగ్రీ చదివాను.
డిగ్రీ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాను. ఇంకా చదువుకోవాలని ఉండేది. అయితే, చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలనే తపన ఉండటం వల్ల.. దానికి తగ్గట్టుగా శారీరకంగా ఫిట్‌గా ఉండటం అలవాటు చేసుకున్నా! సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది. కష్టపడి ప్రిపేర్ అయ్యాను. అలా బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. 2023 అక్టోబర్ నుంచి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పశ్చిమ్‌బెంగాల్ రాష్ట్రం బైకుంఠపుర్లో ఏడాదిపాటు శిక్షణ సాగింది.
గత నెల 25న బీఎస్ఎఫ్ జవానుగా విధుల్లో చేరాను. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 91వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నా! చిన్నప్పటి నుంచి దేశ రక్షణలో భాగం కావాలన్న నా కల నెరవేరింది. ఆడపిల్ల కాలేజీ నుంచి రావడం అరగంట ఆలస్యమైతే కంగారుపడుతున్న రోజులు ఇవి! ఇలాంటి పరిస్థితుల్లో మా తల్లిదండ్రులు నా వెన్నుతట్టి ప్రోత్సహించారు. నా ప్రయాణం మరెందరికో ఆదర్శంగా ఉంటుందని నమ్ముతున్నా! ఎంతో కష్టంతో నా కల నెరవేరింది. విధి నిర్వహణలో నా సత్తా చాటుతానన్న విశ్వాసం ఉంది!
– అంకరి ప్రకాశ్, పెద్దపల్లి