నాలుగో తరగతి తెలుగు వాచకంలో ‘సొంతలాభం కొంతమానుకు.. పొరుగు వారికి తోడుపడవోయ్’ అన్న గురజాడ గేయం ఉంది. పాఠం చెప్పగానే సరిపోదు. ‘గట్టి మేల్ తలపెట్టవలనోయ్’ అని కూడా అనుకున్నారు కామారెడ్డి జిల్లా గాంధారిలోని మండల పరిషత్ ప్రాథమిక బాలికల పాఠశాల ఉపాధ్యాయులు. గణిత సమస్యల చిక్కుముడులు విప్పేందుకు ట్రిక్కులెన్నో చెప్పడం మొదలుపెట్టారు ప్రధానోపాధ్యాయిని బొంపెల్లి భవాని. ఆమెతో మిగతా టీచర్లు.. సుజాత, భాగ్య, నిఖిత చేతులు కలిపారు. విద్యార్థుల కోసం.. ఉపాధ్యాయుల కోసం.. ఉద్యోగార్థుల కోసం బడిలో చెప్పిన పాఠాల్నే యూట్యూబ్‌లోనూ అందుబాటులో తెచ్చారు. ఆ కష్టం ఫలించింది. లక్షల్లో వ్యూస్!
ఎక్కాలు వస్తే ఎంతపెద్ద లెక్కలైనా చిటికెలో పని. ఎక్కాలు లెక్క తప్పితే మాత్రం.. గంటసేపు కుస్తీ పట్టినా ఫలితం తేలదు. చిక్కు వీడదు. అందుకే బడి పిల్లలు ఇరవై వరకూ ఎక్కాలు బట్టీ పట్టేస్తారు. గుణించేప్పుడు, భాగించేప్పుడు అంతకన్నా పెద్ద ఎక్కాలతో పెట్టుకుంటే మాత్రం తడబాటు తప్పదు. అలాంటి లెక్కల్ని కూడా వేగంగా పరిష్కరించడం నేర్పుతున్నారు భవానీ టీచర్. ఈ హెడ్మాస్టరమ్మ బోర్డుపై లెక్క రాస్తుండగానే పిల్లలు సమాధానాలు చెప్పేస్తున్నారు. అంత హుషారుగా ఉంటాయి క్లాసులు. రేఖల మధ్య తొక్కుడు బిళ్ల ఆడుతూ రేఖా గణితాన్ని ఓ ఆటలా నేర్పిస్తారు భవాని. రెక్కలొచ్చిన సీతాకోక చిలుకల్లా పిల్లలు గెంతు తుంటే, ఎవరికైనా.. ‘ఆడుతున్నారా? చదువుతున్నారా?’ అనే సందేహం కలుగుతుంది. ఆ కిటుకులన్నీ ఏ పాఠశాల విద్యార్థులైనా నేర్చుకునేలా.. ఆమె సహోద్యోగులు భాగ్య, నిఖిత రికార్డు చేసి, ఎడిట్ చేస్తున్నారు. ఆ వీడియో పాఠాలు Bompelly Bhavani అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ అవుతాయి.
ఈ ఛానెల్ మొదలుపెట్టడానికి ఓ బలమైన కారణం ఉంది. అదేమిటో భవానీ టీచర్ మాటల్లోనే.. “నాకు చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే ఇష్టం. కాకపోతే నేర్పేవాళ్లే లేరు. నేర్చుకున్నా ప్రదర్శించే అవకాశాలు రాలేదు. ఆ సమస్య స్టూడెంట్స్‌కు రాకూడదని మా కోరిక. సుజాత టీచర్ స్వయంగా పిల్లలకు డ్యాన్స్ నేర్పించారు. పిల్లలు నేర్చుకున్నది ప్రదర్శించడానికి స్కూల్ డే నిర్వహించాం. అంతా అందమైన దుస్తుల్లో
ముస్తాబై వచ్చారు. సంతోషంగా సంబురాలు చేసుకున్నారు. మా బడిలో చాలామంది పేద పిల్లలే. ఈ సంతోషాల్ని వారు పెద్దయ్యాక కూడా చూసుకునేలా Bompelly Bhavani పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టాం. ఇలా ఓ ముచ్చట తీరింది. మేం లెక్కలతోపాటు ఇంగ్లిష్, తెలుగు, పరిసరాల విజ్ఞానానికి ఆటపాటలు జోడించి రకరకాల బొమ్మలు తయారు చేశాం. కళ్లకు కట్టినట్టు చెబుతుంటే పిల్లల రెప్పలార్పకుండా చూస్తారు. చూసింది మర్చిపోరు.
మాడల్ లెసెన్స్ (కాంప్లెక్స్ మీటింగ్)లో మేం పాఠాలు చెబితే ‘మాకు షేర్ చేస్తే మేమూ నేర్చుకుంటాం’ అన్నారు తోటి టీచర్లు. ‘మీ ఛానెల్ ఉంది కదా! అందులో పెడితే మాకు హెల్ప్ అవుతుంది’ అని సలహా ఇచ్చారు. అందరికీ ఉపయోగపడే వీడియోల్లో క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో మంచి కెమెరా, స్టాండ్, మైక్ కొన్నాను. మా ఆయన కూడా వీడియో ఎడిటింగ్‌కు సహకరిస్తున్నారు. వీడియో పాఠాలతో పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. యూట్యూబ్‌లో తమ పిల్లలు కనిపిస్తున్నారని తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. పిల్లలు కూడా శుభ్రమైన దుస్తుల్లో, అందంగా ముస్తాబై వస్తున్నారు. పరిశుభ్రత పెరిగింది. వినయమూ పెరిగింది. మా ఛానెల్ 2023 ఏప్రిల్‌లో మొదలైంది. తొమ్మిది నెలల్లోనే 80 వేలమందికి పైగా ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఈ వీడియోలు చూసి అంతా అభినందించారు. ‘మా పిల్లలకు ఆన్లైన్ క్లాస్ చెబుతారా?’ అని మెసేజ్‌లు పంపుతున్నారు” అని సంతోషంగా చెబుతారామె.
‘సబ్‌స్ర్కైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. గంట కొట్టండి’ అంటూ ఎపిసోడ్ ఎపిసోడ్‌కు సోది చెప్పకుండా సూటిగా స్టార్ట్ చేస్తారు భవానీ టీచర్. నచ్చిన వాళ్లు ఎటూ చూస్తారని నేరుగా లెక్కల్లోకే పోతారు. ప్రాథమిక తరగతుల్లో చతుర్విధ ప్రక్రియలు తెలుసుకుంటే గణితంలో ఆరితేరినట్టే! ఇవి కూడా రాని పిల్లలు చాలా బడుల్లో ఉన్నారు. ఈ లెక్కలను నేర్చుకుంటే సరిపోదు, వేగంగా చేయడం సాధన చేస్తేనే పోటీ ప్రపంచంలో దూసుకుపోతారు. ఆ వేగాన్ని అందుకునేలా గణితంలో ఎన్ని చిట్కాలున్నాయో.. అన్నీ నేర్పిస్తున్నారు భవానీ టీచర్.
ఐదేండ్ల క్రితం.. గాంధారి బాలికల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య యాభై లోపే. బడి శిథిల స్థితిలో ఉండేది. ఓ దాత ఇరవైవేలు, భవాని భర్త మరో ఇరవై వేలు విరాళంగా ఇచ్చారు. దీంతో బడికి రంగులేశారు. రంగురంగుల బొమ్మలు, వర్ణమాల, అంకెలు గోడలపై గీయించారు. బడి రూపురేఖలే కాదు పాఠాల తీరునూ మార్చేశారు. దీంతో, పిల్లల సంఖ్య పెరిగింది. గ్రామాభివృద్ధి కమిటీ స్వచ్ఛందంగా ఇద్దరు విద్యా వలంటీర్లను నియమించింది. ఇప్పుడు 150 మంది విద్యార్థులున్నారు. ఈ స్కూలు ‘మన ఊరు మన బడి’కి ఎంపికయ్యాక లేని సౌలత్ లేదు! ‘ప్రైవేటు స్కూళ్ల కంటే ఈ గవర్నమెంట్ బడే బాగుంది. మీరెందుకు ప్రైవేటు బడికి పంపుతున్నరు’ అని ప్రశ్నిస్తారు ఐదో తరగతి విద్యార్థిని శ్రీజ తల్లి లక్ష్మి. మిగిలిన తల్లిదండ్రులూ ఆమెతో గొంతు కలుపుతారు. మద్దతు పలుకుతారు.
…? నాగవర్ధన్ రాయల