2027లో వర్షాల జోరు.. ఎల్‌నినోకు ఎండ్ కార్డు!
అనూహ్యంగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 2027 నైరుతి రుతుపవనాలపై ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా కొనసాగుతున్న ఎల్‌నినో వచ్చే ఏడాది మార్చి నాటికి బలహీనపడి, ఆ తర్వాత లానినాకు మారే అవకాశాలు ఉన్నట్లు శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. లానినా ఏర్పడితే భారత్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్కాయిస్) తాజా అంచనాలు ఈ ఆశలను పెంచుతున్నాయి.
- మార్చి వరకే ఎల్‌నినో ప్రభావం!
- లానినా తో పుష్కలంగా వానలు?
- ఇన్కాయిస్ తాజా అంచనాలు
హైదరాబాద్: అనూహ్యంగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 2027 నైరుతి రుతుపవనాలపై ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా కొనసాగుతున్న ఎల్‌నినో వచ్చే ఏడాది మార్చి నాటికి బలహీనపడి, ఆ తర్వాత లానినాకు మారే అవకాశాలు ఉన్నట్లు శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. లానినా ఏర్పడితే భారత్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్కాయిస్) తాజా అంచనాలు ఈ ఆశలను పెంచుతున్నాయి.
మార్చి వరకు ఎల్‌నినో
పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు భూమధ్యరేఖ ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితిని ఎల్‌నినో అంటారు. ఇది సాధారణంగా భారత రుతుపవనాల బలహీనతకు దారితీస్తుంది. అక్టోబర్ 2026లో ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదయ్యాయి. సముద్ర అంతర్భాగంలోనూ కొన్ని ప్రాంతాల్లో నాలుగు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఎల్‌నినో మరింత బలపడుతున్నట్లు శాస్తవ్రేత్తలు గుర్తించారు.
2026 నవంబర్ నుంచి 2027 మార్చి వరకు ఎల్‌నినో కొనసాగేందుకు 87 నుంచి 100 శాతం అవకాశాలున్నాయని ఇన్కాయిస్ వెల్లడించింది. ఏప్రిల్-జూన్ 2027 మధ్య ఎల్‌నినో, లానినా ప్రభావాలు లేని తటస్థ పరిస్థితులు ఏర్పడవచ్చని అంచనా. అనంతరం జూన్-ఆగస్టు నుంచి లానినా అభివృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రం చల్లబడే పరిస్థితిని లానినా అంటారు. ఇది సాధారణంగా భారత నైరుతి రుతుపవనాలకు బలాన్నిస్తుంది. ఫలితంగా సాధారణం కంటే అధిక వర్షాలు కురిసేందుకు అనుకూలత ఏర్పడుతుంది.
కృత్రిమ మేధతో అంచనాలు
ఇన్కాయిస్ కేంద్రం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నమూనాను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఎల్‌నినో, లానినా పరిస్థితులను గుర్తించేందుకు ఉపయోగించే నినో 3.4 సూచీ పరిణామాలను అంచనా వేస్తున్నది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గితే వ్యవసాయం, నీటి వనరులు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. లానినా పరిస్థితులు అధిక వర్షపాతానికి అనుకూలించినప్పటికీ ప్రతిసారీ ఒకే తరహా ఫలితాలు ఉండవని సీనియర్ శాస్తవ్రేత్త పి ఏ ఫ్రాన్సిస్ తెలిపారు.
సముద్రాల్లో పెరుగుతున్న వేడి
మరోవైపు ఉత్తర హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 2026లో అరేబియా సముద్రంలోని 80 నుంచి 90 శాతం ప్రాంతంలో అక్టోబర్-నవంబర్ మధ్య సముద్ర ఉష్ణతరంగ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలిక సముద్ర వేడిమి వల్ల పగడపు దిబ్బలు దెబ్బతినడం, చేపల ఆవాసాలు మారడం వంటి ప్రమాదాలు ఏర్పడనున్నాయి. 2026 మే-జులైలో భారత నైరుతి తీరంలో సముద్ర జలాలు పైకి ఎగసే ప్రక్రియ (అప్‌వెల్లింగ్) గతేడాదితో పోలిస్తే బలహీనపడింది. సముద్ర పరిస్థితుల్లో మార్పుల నేపథ్యంలో మత్స్యకారులు తీరప్రాంత ప్రమాద సూచనలను గమనించాలని ఇన్కాయిస్ సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

