శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో వైఫల్యాలు
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలోని నాలుగో యనిట్ గాడిన పడటంలేదు.
- బాలారిష్టాల్లోనాలుగో యూనిట్
- రూ.25.76 కోట్లతో మరమ్మతులు
- జనరేటర్ కొనుగోలుకు నిర్ణయం
- రూ.135 కోట్లకు ప్రతిపాదనలు
- 2028-29 వరకు ఎదురుచూపులే
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలోని నాలుగో యనిట్ గాడిన పడటంలేదు. యూనిట్ పునరుద్ధరణకు జెన్కో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మరమ్మతులు చేసి, గ్రిడ్‌కు అనుసంధానించిన కొద్దిసేపటికే ట్రిప్ అవుతుండటం సవాల్‌గా మారింది. దీంతో కొత్త జనరేటర్/మోటర్సెట్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రూ.135 కోట్ల అదనపు మూలధన వ్యయానికి అనుమతించాలని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరింది. ఇప్పటికిప్పుడు కొత్త జనరేటర్‌ను కొనుగోలు చేసినప్పటికీ 2028-29లోనే ఈ యూనిట్ అందుబాటులోకి రానున్నది.
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రంలో 150 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 6 యూనిట్లున్నాయి. వీటిద్వారా మొత్తం 900 మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. గ్రిడ్ ఫ్రీక్వెన్సీ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ పవర్ ప్లాంట్‌లో 2020 ఆగస్టు 20న అగ్ని ప్రమాదం సంభవించి ప్యానెల్ బోర్డులకు మంటలు వ్యాపించడంతో 3, 5, 6 యూనిట్ల జనరేటర్లకు నష్టం వాటిల్లింది. నాలుగో యూనిట్ జనరేటర్ స్టేటర్ వైండింగ్, కోర్ దెబ్బతిన్నాయి. మూడు యూనిట్లకు మరమ్మతులు పూర్తిచేసినప్పటికీ నాలుగో యూనిట్ పునరుద్ధరణ జెన్కోకు సవాల్‌గా మారింది.
మొదటి ప్రయత్నం ఫెయిల్
నాలుగో యూనిట్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు జెన్కో రూ.25.76 కోట్లు ఖర్చు చేసింది. 2023 జూలై 29న ఈ యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానించినప్పటికీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. 80 గంటలపాటు మాత్రమే పనిచేసిన ఈ యూనిట్ 2023 ఆగస్టు 17న స్టేటర్ ఎర్త్ ఫాల్ట్‌తో మళ్లీ ట్రిప్ అయింది. తనిఖీల్లో 150 స్టేటర్బార్లు దెబ్బతినడంతోపాటు పలు ప్రాంతాల్లో సేటర్ కోర్ కూడా దెబ్బతిన్నట్టు గుర్తించారు. మరమ్మతులకు వెచ్చించిన రూ.25 కోట్లకుపైగా నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.
రెండో ప్రయత్నం విఫలం
2025 అక్టోబర్ 2న యూనిట్‌ను మళ్లీ సింక్రనైజ్ చేశారు. కేవలం పది గంటలు పనిచేసిన యూనిట్ అక్టోబర్ 3న ట్రిప్ అయింది. స్టేటర్, రోటర్ మధ్య ఎయిర్ గ్యాప్ తగ్గిపోవడంతో ఎయిర్ గ్యాప్ ప్రొటెక్షన్ వ్యవస్థ స్పందించి, యూనిట్‌ను నిలిపివేసింది.
జపాన్ నిపుణుల రంగ ప్రవేశం
వోయిత్ సంస్థతోపాటు జపాన్ నిపుణుల బృందం ఈ యూనిట్‌ను పరిశీలించింది. రోటర్, స్టేటర్ మధ్య సుమారు 16 మిల్లీమీటర్ల ఎయిర్ గ్యాప్ ఉండాల్సి ఉండగా.. 4.5 మి.మీ పడిపోయినట్టు గుర్తించారు.
ఫలించని మూడో ప్రయత్నం
వోయిత్ సంస్థ నిపుణులు రోటర్ పోల్స్‌ను సక్రమంగా అమర్చాలని, స్టేటర్ కోర్లో ఏర్పడిన వంపులను సరిచేయాలని, స్టేటర్ కోర్ వదులుతనాన్ని తగ్గించాలని సూచించారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అనుమతి పొంది, ప్రీ-కమిషనింగ్ పరీక్షలను పూర్తిచేశారు. 2026 ఆగస్టు 11 తెల్లవారుజామున యూనిట్‌ను నడిపించి గ్రిడ్‌తో అనుసంధానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

