ఆట 6 జూనియర్స్ షోలో అందరినీ మెప్పించిన కన్నడ చిన్నది భూమికా రమేష్. పన్నెండేళ్లకే డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె రియాలిటీ షోలు చేస్తూనే చదువునూ కొనసాగిస్తున్నది. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వెన్నంటి ఉన్న కుటుంబమే తన బలం అని చెబుతున్నది. హైదరాబాద్‌తో తనకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకం అని చెబుతున్నది. తెలుగు ప్రేక్షకుల ప్రేమ వేరే లెవల్ అని అంటున్న భూమిక ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే..
నా కెరీర్లో ప్రతి దశలోనూ నా తల్లిదండ్రులు అండగా నిలిచారు. వారి వల్లే ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నాను. మా తమ్ముడికి రుణపడి ఉండాలి. ఎందుకంటే, నా కెరీర్ కోసం అమ్మానాన్న నాతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేవారు. అయినా, మా తమ్ముడు ఎప్పుడూ కంప్లయింట్ చేయలేదు. చాలా సపోర్ట్ చేశారు. ఇక నా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రేక్ష, అభినవ్.
మాది మైసూర్ దగ్గర గుండ్లపేట్. పుట్టగానే జాండిస్ అని తేలిందట. ఇరవై నాలుగు గంటల్లో ఓ ఇంజక్షన్ పడకపోతే నేను బతకనని డాక్టర్లు తేల్చి చెప్పారట. చివరి నిమిషాల్లో అది దొరకడంతో ఈ రోజు నేను మీ ముందున్నా. నిజానికి నేను హిందువునే అయినా క్రైస్తవంతో ఏదో తెలియని అనుబంధం ఉందనిపిస్తుంది. పుట్టింది క్రిస్టియన్ హాస్పిటల్లో, చదువుకుంది క్రిస్టియన్ స్కూల్, కాలేజీలో! స్కూల్ డేస్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. నాన్న వృత్తిరీత్యా మా ఫ్యామిలీ బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాం.
చిన్నప్పటి నుంచీ అనారోగ్యంతో బాధపడేదాన్ని. నా ఆరోగ్యం కోసం అమ్మ చాలా కష్టపడింది. డాక్టర్ సలహాతో నన్ను డ్యాన్స్ స్కూల్లో చేర్పించింది. అక్కడ జాయిన్ అయిన రెండు నెలలకే జీ తెలుగు వాళ్లు ‘ఆట 6- జూనియర్స్ షో’ కోసం వేర్వేరు రాష్ర్టాల్లో మొదటిసారి ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలిసింది. అందులో పాల్గొనమని మా టీచర్ సలహా ఇచ్చారు. 2012లో బెంగళూరులో జరిగిన ఆడిషన్స్‌లో పాల్గొన్నా. అప్పుడు నాకు పన్నెండేళ్లు. నేను డ్యాన్స్ నేర్చుకుంది రెండు నెలలే! కానీ, నా ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని మెచ్చుకున్నారు. తదుపరి ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రమ్మన్నారు.
అమ్మ, నాన్న, నేను, తమ్ముడు హైదరాబాద్‌కు వచ్చాం. చాలామందిని నాకు కొరియోగ్రఫీ చేయడం కోసం అడిగాం. కానీ, ఎవరూ ఒప్పుకోలేదు. దాంతో టీవీలో చూస్తూ అమ్మే నాకు డ్యాన్స్ స్టెప్స్ నేర్పించింది. ఫైనల్ ఆడిషన్స్‌లో ఆర్య సినిమాలోని ‘అ అంటే అమలాపురం..’ పాట పెట్టారు. నాకేమో తెలుగు అస్సలు రాదు. అందుకే ఆ పాటకి నేను డ్యాన్స్ చేయలేనని చెప్పా. అందరూ షాకయ్యారు. అమ్మావాళ్లు భయపడ్డారు. ఇక్కడివరకు వచ్చి బాధపడుతూ వెళ్లాల్సివస్తుందేమోనని.. కానీ లక్కీగా నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు. అప్పటినుంచి హైదరాబాద్‌తో నా అనుబంధం మొదలైంది.
ప్రోమో షూట్‌కు వెళ్లినప్పుడు ఎవ్వరూ నాకు కొరియోగ్రఫీ చేయడానికి ఒప్పుకోలేదు. నాకు తెలుగు తెలియదని చాలా ఏడ్పించారు. ఆడిషన్స్‌లో నేను చేయనని చెప్పడం చూసిన నా కొరియోగ్రాఫర్ నన్ను తనకు కంటెస్టెంట్‌గా ఇవ్వడంతో ఆయనా రాలేదు. నాకు వచ్చిన దాంతోనే చేసేయాలని ఫిక్సయ్యాను. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని ‘అందాలలో..’ పాట షో కోసం నేను చేసిన మొదటి పాట. నా పెర్ఫార్మెన్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సుందరం మాస్టార్ స్టేజ్ మీదికి వచ్చి మెచ్చుకున్నారు. రెండోపాట ‘బొంబాయి’ సినిమాలోని ‘కన్నానులే..’ పాట. ఆ పెర్ఫార్మెన్స్ తర్వాత నా సత్తా ఏంటో అక్కడి వారికి తెలిసొచ్చింది. నేను చేసిన ప్రతి పెర్ఫార్మెన్స్ హిట్ అవ్వడంతో డేంజర్ జోన్‌కి వెళ్లకుండా… ఫినాలే చేరుకున్నా. అదే సమయంలో జీ బిజినెస్ హెడ్ నన్ను పిలిపించి మల్టీ టాలెంట్ రియాలిటీ షోలో కూడా పోటీ చేయమన్నారు. అక్కడా నా సత్తా చాటాను. లిటిల్ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని లిటిల్ మిస్ మోనాలిసా టైటిల్ గెలుచుకున్నాను.
‘ఆట’ షో చేస్తున్నప్పుడు భరతనాట్యంతో ఒక రౌండ్ పెట్టారు. ఆ ఎపిసోడ్లో బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు నాకే వచ్చింది. దీంతో అమ్మ నాకు భరతనాట్యం నేర్పించడం మొదలుపెట్టింది. దాన్నే కెరీర్‌గా మార్చుకోవాలనుకున్నా. ఇప్పుడు ‘విద్వత్’ చేస్తున్నా. వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ నుంచి ఒక స్కాలర్షిప్ అవకాశం వచ్చింది. డ్యాన్స్ షోలతో ఎంత బిజీగా ఉన్నా.. చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేదాన్ని. మా కుటుంబంలో అందరూ బాగా చదువుకున్నవాళ్లే! నేను మెడిసిన్ చదవాలని అనుకున్నా. పదో తరగతిలో 98 పర్సంటేజ్ వచ్చింది.
ఇంటర్ కాగానే నీట్ రాద్దాం అనుకున్నా! కానీ, అదే టైమ్‌లో కొవిడ్ వచ్చింది. అప్పుడే కలర్స్ కన్నడలో ఓ సీరియల్ అవకాశం వచ్చింది. ఖాళీగా ఉండటం ఎందుకని అమ్మానాన్న అనడంతో దానికి ప్రయత్నించాను. అయితే ఆ పాత్రకు నా ఏజ్ సరిపోదని వద్దన్నారు. కళలకు కామా పెట్టేసి, అమెరికా వెళ్లి మెడిసిన్ చేయాలనుకున్నా! ఇంతలో మరో ప్రాజెక్టు కోసం కొందరు సంప్రదించారు. నేను నో చెప్పాను. కానీ, అమ్మానాన్న ప్రోద్బలంతో వెళ్లాను. దానికి ఎంపికయ్యాను. అలా నా యాక్టింగ్ కెరీర్ మొదలైంది.
నాకు జీ తెలుగులో వచ్చిన మొదటి అవకాశం ‘మావారు మాస్టారు’. అయితే డేట్స్ కుదరకపోవడంతో నో చెప్పాను. తర్వాత ‘పడమటి సంధ్యారాగం’ కోసం కూడా అడిగారు కానీ కన్నడ షోలో బిజీగా ఉండటంతో చేయడం కుదరలేదు. కొన్నాళ్లకు ప్రొడ్యూసర్ శ్వేత అక్క కాల్ చేసి ‘ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నాం.. నువ్వు చేస్తావా?’ అని అడిగారు. నేను ఒప్పుకొన్న తర్వాతనే ఆ కథలో డ్యాన్స్ యాంగిల్ కూడా జోడించారు. అంతేకాదు ‘మేఘసందేశం’ సీరియల్లో నా పాత్ర పేరు భూమి. నా పేరుతో ఉన్న పాత్ర చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. నాకు చిన్నప్పుడు పెట్టిన పేర్లు లక్ష్మీ, భూమిక. నేను కన్నడలో చేసిన మొదటి సీరియల్లో నా పాత్ర పేరు లక్ష్మి.
అలా నా రెండు పేర్లతో క్యారెక్టర్లు చేయడం గమ్మత్తుగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతానా అన్న సందేహం ఉండేది. కానీ, ప్రేక్షకుల అభిమానం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నా ఫేవరెట్ యాక్టర్. నా లైఫ్‌లో ఏదీ ప్లాన్ చేయలేదు. కానీ, వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించా! ప్రస్తుతం పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా! కన్నడతోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను గుర్తుంచుకునేలా మంచి పాత్రలు పోషించాలని ఉంది. కష్టాన్ని నమ్ముకున్న నేను సక్సెస్ అవుతానన్న నమ్మకం ఉంది.
– హరిణి