తరాలుగా కొన్ని పదాలకు స్త్రీ లింగాలు లేవు. మనకు పురోహితుడే తెలుసు. ‘పురోహితురాలు’ పూర్తిగా కొత్త మాట. బెంగాలీ మహిళ నందిని భౌమిక్ కనుక పూనుకొని ఉండకపోతే.. ఇప్పటికీ పుంలింగమే రాజ్యమేలేది. కోల్కతాకు చెందిన నందిని కొన్ని భ్రమల్ని బద్ధలు చేశారు. వ్యవస్థ పెనునిద్దుర వదిలించారు. ఆమె సంస్కృతం చదువుకున్నారు. అందులో డాక్టరేట్ సాధించారు. ఆ తర్వాత, కుటుంబ బాధ్యతలకు పరిమితమై .. బయటి ప్రపంచాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
తన రెండో కూతురి పెండ్లి సమయంలో.. ఎక్కడా పురోహితులు లభించక పోవడంతో.. ‘నేనే మాంగల్యధారణ మంత్రాలు ఎందుకు చదవకూడదు?’ అనే ఆలోచన వచ్చింది. అలా ఆమెలోని పురోహితురాలు సమాజానికి పరిచయమైంది. తనిప్పుడు శ్రాద్ధ కర్మలూ నిర్వర్తిస్తుంది. అన్న ప్రాశనలు, నామకరణ మహోత్సవాలు జరిపిస్తుంది. మధ్య మధ్యలో సందర్భోచితంగా రవీంద్రుని గీతాలనూ వినిపిస్తుంది. ‘నా నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారు. ఇది బాధపడాల్సిన విషయం. ఓ మార్పును స్వీకరించలేనంత బలంగా మహిళలను తొక్కిపెట్టింది మన సమాజం’ అంటారామె.